Saturday, April 20, 2024

మణిపూర్ మంటల వెనుక కారణాలు ఇవే

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ మంటలకు, చల్లారని కాష్టం కావడానికి పలు సంక్లిష్ట , విస్ఫోటన స్థాయి అంశాలు కారణం అయ్యాయి. మైతీ వర్గానికి ఎస్‌టి హోదా కల్పించే హైకోర్టు ఉత్తర్వులకు నిరసనగా కుకీలు వ్యక్తం చేసిన నిరపనలు పరస్పర ఘర్షణలు, విధ్వంసకాండ చల్లారే దశలోనే అంతర్గతంగా ఉన్నట్లుండి మణిపూర్‌లో వేర్పాటువాద ఉగ్రవాదులు రెచ్చిపోవడం, పలు ప్రాంతాలలో వీరు మారణాయుధాలతో తిరగడం , వీరి అణచివేతకు ప్రత్యేక పోలీసు కమెండోల దళాలు గాలింపులకు దిగి దాదాపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చడం ఇవన్నీ కూడా అంతర్గతంగా పలు కారణాలతో రగులుతున్న మణిపూర్ స్థితి వల్లనే అని వెల్లడైంది. ప్రత్యేకించి భూ హక్కులు, సాంస్కృతిక ఆధిపత్య ధోరణులు, మాదకద్రవ్యాల సరఫరాలు నడుమ వర్గఘర్షణలు పరాకాష్టకు చేరుకుని,

చివరికి ఈశాన్యంలో అత్యంత తీవ్రస్థాయి పరిస్థితికి ఇప్పుడు మణిపూర్ కేంద్రం అయ్యేలా చేసింది. దశాబ్దాలలో ఎప్పుడూ లేని స్థాయిలో తెగల మధ్య ఘర్షణలు చివరికి హింసాకాండకు , విధ్వంసానికి దారితీశాయి. కేవలం ఇప్పటి కొత్త కోటా విషయమే కాకుండా అంతర్గతంగా పలు విషయాలు రగులుతూ ఉండటం, రాజకీయ పార్టీలు వీటిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఇప్పుడు తీవ్రస్థాయిలో చిచ్చు రగులుకుని , చివరికి ఇది తెగల మధ్య ఘర్షణ స్థాయిని దాటి వేర్పాటువాద తిరుగుబాటుదార్లు ఉగ్రవాదుల రీతిలో విజృభించడానికి దారితీసిందని విశ్లేషకులు , సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుకీ గిరిజనుల ఆటవికత కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఎక్కువగా ఉండే మైతీలు పేర్కొంటున్నారు.

కుకీలు ఎక్కువగా అక్రమ వృత్తులలో ఉన్నారని, గంజాయి సాగు, తీవ్రవాదానికి దిగడం వల్లనే వారిని ఎవరూ ఏమి చేయలేని స్థితి ఏర్పడిందని మైతీ వర్గాలు విమర్శిస్తున్నాయి. తమకు ఎస్‌టి హోదాను వారు శాంతియుతంగా ప్రతిఘటించవచ్చునని అయితే ఇందుకు వారు సిద్ధంగా లేరని, పైగా ఇక్కడ నెలకొన్న అశాంతి చివరికి అత్యంత ప్రమాదకరమైన వేర్పాటువాదుల ప్రాబల్యానికి దారితీసిందని విమర్శించారు. అయితే కుకీలు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. తాము ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే ఉంటామని , మైదాన ప్రాంతాలలోని వారు తమను తరాలుగా అణచివేస్తున్నారు. చివరికి తమ ఉనికిని కూడా దెబ్బతీసేలా , భూములు కాజేయాలని మాయోపాయంతో ఎస్‌టి హోదాను దక్కించుకునేందుకు యత్నించారని కుకీలు మండిపడుతున్నారు.

తమ ఉనికి ఇతర కారణాలతో తాము ఏ పరిస్థితుల్లోనే ఇతరులకు హానీ చేసే స్థితిలో లేమని , అయితే ఇతర వర్గాలు ఎస్‌టి హోదాను దక్కించుకుని చివరికి తమ భూములను కాజేసే విధంగా మారారని వాపోతున్నారు. కుకీలు ఎక్కువగా గంజాయి సాగు పనులతోనే జీవనాధారాలు దక్కించుకుని ఉన్నారని, వీరు తెలిసోతెలియకో రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యవహారాలు మితిమీరేలా చేశారని , ఎప్పుడైతే ప్రభుత్వం ఈ గంజాయి ఇతర అక్రమ వ్యవహారాలను అడ్డుకుందో అప్పుడు ఈ వర్గం రెచ్చిపోయిందని , ఇది చాలా ప్రమాదకర స్థితికి చేరే అవకాశం ఉందని మణిపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అంగామ్ దిలీప్‌కుమార్ సింగ్ తెలిపారు. ఇక బిజెపి ప్రభుత్వం ఇక్కడ జాతీయ పౌర చిట్టా (ఎన్‌ఆర్‌సి) ని ప్రవేశపెట్టడం కూడా కుకీల్లో ఆగ్రహానికి దారితీసిందని తెలిపారు.

సాధారణంగా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు, మయన్మార్‌కు చెందిన గిరిజనులు ఆదివాసీలు ఎప్పటికప్పుడు సరిహద్దులు దాటుతూ సంచరించడం అలవాటు. ఈ క్రమంలో వారి పేర్లు వివరాలు నమోదు చేసే ఎటువంటి అధికారిక ప్రక్రియలను అయినా వీరు సహించే స్థితిఓ లేరని వెల్లడైంది. అన్నింటికి మించి రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతోన్న ఆయుధాలతో పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతోంది. ఏ విధంగా అయిన తమకు అన్యాయం జరిగిందని భావిస్తే ఆ వర్గం తమకు దక్కే ఆయుధాలతో విచ్చలవిడిగా తిరగడం జరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని అంతర్లీనంగా ఇంతకాలం నిద్రాణంగా ఉన్న వేర్పాటువాద శక్తులు వీరిని రెచ్చగొట్టడం ఈ ప్రాంతంలో భయానక ఉగ్రవాద ఉనికికి దారితీసిందని విశ్లేషకులు తెలిపారు.

చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగుబాటుదార్లు చాపకింద నీరుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. మైతీలు, నాగాలు, కుకీలకు చెందిన వారు ఇతర సంస్కృతి లేదా అత్యంత ప్రమాదకరమైన రీతిలో జాతీయ స్థాయి స్రవంతి భావనలు ఇక్కడ వచ్చి చేరడం సహించలేకపోతున్నట్లు వెల్లడైంది. ప్రగతి పేరిట సాగుతోన్న పనులు చివరికి తమ అస్థిత్వాన్ని తమ భూమి హక్కులను దెబ్బతీస్తున్నాయనే భావనలు వారిలో పెరిగిపోతూ ఉండటం మణిపూర్‌ను ఇప్పుడు అగ్నికణికను చేసింది. కుకీ మిలిటెంట్లు చాలాకాలం వేర్పాటువాద తిరుగుబాటు వర్గీయులుగా చలామణి అయ్యారు. దీనితో ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా తీవ్రవాద సమస్య నెలకొంటూ వచ్చింది.

తరువాతి క్రమంలో ప్రభుత్వాలతో కుదిరిన ఒప్పందాలలో భాగంగా కుకీ తిరుగుబాటుదార్లు కేంద్రీయ బలగాల పహారాలోని నిర్ణీత క్యాంప్‌లలో ఉండేందుకు అంగీకరించినా వీరు ఆంక్షలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారని, సాయుధులుగా తమ అరాచకాలకు పాల్పడుతున్నారనే విమర్శలను కాపలాలో అస్సామ్ రైఫిల్స్ తోసిపుచ్చాయి. అయితే క్యాంపులను వీడి ఇప్పుడు వీరు బయటకు రావడం వల్లనే తీవ్రస్థాయిలో ఉగ్రవాదుల సంచారానికి దారితీసిందని విశ్లేషణలు వెలువడ్డాయి. వివిధ తెగల మధ్య తరాలుగా పడని తత్వం. పెంచుకున్న పగలు కార్పణ్యాలు ఇప్పటి స్థితికి కారణం అని, నిజానికి ఈ స్థితికి మూలపుటేళ్లను గుర్తించేందుకు ఏ రాజకీయ పార్టీ , ఏ నేత కూడా యత్నించలేదని ఓ వైద్య విద్యార్థి నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News