Friday, April 26, 2024

మణిపూర్ మంటల పాపం ఎవరిది?

- Advertisement -
- Advertisement -

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఏప్రిల్ 3న ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఇంఫాల్‌లో భారీ ప్రదర్శన చేసేందుకు పిలుపునిచ్చారు. వేలాది మంది గిరిజనులు, కొండజాతి ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదాన ప్రాంతంలో నివసిస్తున్న మైతీలను ఎస్‌టిల జాబితాలో కలపాలని తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఈ ప్రదర్శన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాగా, కుకిలు, రాష్ట్రంలో ఉండే 38 తెగలకు సంబంధించిన గిరిజనులు ప్రదర్శనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరుగుతున్న సందర్భంలోనే బైక్ మీద వస్తున్న గిరిజనులను మైతీ కులస్థులకు (బ్రాహ్మణులు, హిందువులకు) చెందిన వారు కొందరు ట్రక్కుతో గుద్దడం జరిగింది. ఈ కారణంగానే ప్రదర్శన చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య వివాదం తలెత్తి తీవ్ర ఘర్షణగా మారింది.

ఈ ఘర్షణలో అధికారిక లెక్కల ప్రకారమే 60 మంది ప్రజలు మరణించగా, 300 మంది వరకు గాయాల పాలయ్యారు. ఈ సంఘటనతో 35,655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మరణాలు, క్షతగాత్రులు, నిర్వాసితులు ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే, వాస్తవ లెక్కలు మరో ఐదు రెట్లు అదనంగా ఉంటాయని ఊహించవచ్చు.
ఈ ఘర్షణలను నివారించేందుకు అసోం రైపిల్స్ బలగాలు పెద్ద ఎత్తున కవాతు చేస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లతో ఆకాశం నుండే నిఘా పర్యవేక్షణ జరుగుతోంది.పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో నేడు మణిపూర్ రాష్ట్రాన్ని అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడింది. ఈ సందర్భంలోనే సాయుధ బలగాల నుండి 1041 ఆయుధాలను ప్రజలు గుంజుకున్నారని, ఇందులో 7640 మంది ప్రజల చేతుల్లో మందు గుండు సామాగ్రి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంత భారీ ఎత్తున ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగటానికి దారి తీసిన కారణాలేమిటి అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఈశాన్య ప్రాంతమైన మణిపూర్ 22 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30 లక్షల జనాభా కలిగి ఉన్న చిన్నరాష్ట్రం. అంటే మన హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే జనాభాలో ఐదు రెట్లు తక్కువగా ఉంటుంది. ఇంత చిన్న రాష్ట్రంలో జనాభాలో 41 శాతం మంది మైతీలు మతపరంగా హిందూ మతస్థులు, అందరూ బ్రాహ్మణులు. నాగా, కుకిలతో పాటు 38 రకాల వివిధ తెగలకు సంబంధించిన గిరిజనులు ఉన్నారు. వీరిలో కొందరు క్రిస్టియన్లు ఉంటారు. 8 శాతం మంది ముస్లింలు ఉన్నారు. మరో 8.5 శాతం సనాతన సాంప్రదాయాలు, ఏ మతానికీ సంబంధం లేని మైతీలు ఉన్నారు. గిరిజనులు అత్యధికంగా 95 శాతం మంది కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నాగా, కుకిలతో పాటు 38 రకాల గిరిజనులు ఎస్‌టిలుగా పరిగణించబడుతున్నారు. అటవీ హక్కుల చట్టాల పరిధిలో ఈ జాతులు ఉన్నాయి. అన్ని విధాలుగా గిరిజనులు బాగా వెనుకబడిన జాతులు.

మైతీలు ఆర్థికంగా వెనుకబడిన తెగలు (ఒబిసి) ఇంఫాల్‌తో పాటు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులు, హిందువులు సారవంతమైన భూములు, ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెంది ఉన్నవారు. అటవీ జాతులకు సంబంధించిన కుకీ, నాగాలు కొండలు, లోయల్లో సరైన జీవనాధారం కరువైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. గిరిజనులకు అటవీ పరిరక్షణ చట్టాలు, షెడ్యూల్డ్ ఏరియా చట్టాలు, గిరిజన హక్కులు, గిరిజన రక్షణ చట్టాలున్నాయి.ఈ చట్టాలను పాలకులు ఉద్దేశపూర్వకంగానే నీరుకార్చేందుకు పూనుకున్నారు. గిరిజన చట్టాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా గిరిజనులను అణచివేస్తున్న పరిస్థితి నెలకొంది. చట్ట సభల్లో, విద్య, ఉద్యోగాల్లో గిరిజనులను అవకాశం లేకుండాపోయింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది శాసన సభ్యులు ఉండగా, అందులో 40 మంది మైతీలకు చెందిన వారు. 20 మంది మాత్రమే 38 తెగలకు సంబంధించిన గిరిజనులు.

ఇప్పటి వరకు 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలించగా, వారిలో పది మంది బ్రాహ్మణ హిందువులకు సంబంధించిన మైతీ వర్గం వారే. కేవలం ఇద్దరు మాత్రమే గిరిజన తెగలకు సంబంధించిన వారు. జనాభాలో సమాన నిష్పత్తిలో ఉన్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల రాజకీయ పదవులలో మూడొంతుల్లో రెండొంతుల మంది గిరిజనేతరులు ఉన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందిన మైతీలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వర్తక, వ్యాపార రంగాల్లో వీరే ఆధిపత్యం చలాయిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న గిరిజనులకు ఉద్యోగ, ఉపాధులు లేకుండా గిరిజనేతరులు చేశారు.
ఆదివాసీలు జీవిస్తున్న కొండలు, లోయ ప్రాంతాల్లో వాటా కావాలనే లక్ష్యంతో తమను ఎస్‌టిల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ను మైతీలు ముందుకు తెస్తున్నారు. 1936లో బ్రిటిష్ వారు ఎస్‌టిలుగా ఉన్న మైతీలను, బ్రాహ్మణులు, హిందువులను ఎస్‌టిల జాబితా నుండి తొలగించి ఒబిసిలుగా చేయడం జరిగింది.

భారత దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ మణిపూర్ మాత్రం 1949లో దేశంలో విలీనమైంది. అంతకు ముందు బ్రిటిష్ వారి పాలనలో కొనసాగింది. ఈ నేపథ్యంలో ఒబిసిలుగా ఉన్న మైతీలను ఎస్‌టిలుగా చేర్చాలనే డిమాండ్‌ను బ్రాహ్మణ, హిందువు మతస్థులు చేస్తున్న డిమాండ్ అన్యాయమైనది. ఇందువల్ల గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని అర్థం చేసుకోవచ్చు. దీనికి రాజకీయ అవకాశవాదంతో మతపరంగా బ్రాహ్మణ, హిందువులను నిలుపుకొనేందుకు ముఖ్యమంత్రి, బిజెపి నాయకత్వం మైతీలను గిరిజనులుగా చేసే విషయాన్ని ముందుకు తేవడం జరిగింది. ఈ చర్యలు గిరిజనుల, ఆదివాసీల మనుగడకు ప్రమాదకరమైంది. ఇప్పటికే చట్టసభల్లో ప్రజాప్రాతినిధ్యంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న మైతీలను గిరిజనులుగా చేస్తే నామమాత్రంగా వచ్చే ఉద్యోగాలు లేకుండాపోతాయని, తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని గిరిజనులు భయపడుతున్నారు.తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని గిరిజనులు భావించటం న్యాయమైనదే.

ఈ పరిస్థితుల్లో గిరిజన జాబితాలో మైతీలను చేర్చడాన్ని గిరిజన జాతులన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డ్రగ్స్ అక్రమ వ్యాపారంలో దొరికి అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులను చూపెట్టి రాష్ట్రంలోని మొత్తం గిరిజనులందరూ డ్రగ్స్ అక్రమ వ్యాపారం చేస్తున్నారని, గిరిజనులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మీడియాలో, సోషల్ మీడియాలో ఆ రాష్ట్ర సిఎం బైరన్ సింగ్ ఆరోపణలు చేశారు.
కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి అధికారంలో వున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తాయని దేశ వ్యాప్తంగా మోడీ, సంఘ్ పరివార్ శక్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలు ప్రధాని మాటల్లోని డోల్లతనాన్ని చూపెడుతున్నాయి.

రాష్ట్రానికి విదేశీ చొరబాటుదారులు ప్రవేశించినప్పుడు, అల్లకల్లోలాలు తలెత్తి అంతర్గత కుమ్ములాటలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ద్వారా అవకాశం కల్పించింది. అది సాధ్యం కానప్పుడు ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. మణిపూర్‌లో అనధికారికంగా ఆర్టికల్ 355ను అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి శాంతి భద్రతల సలహాదారుడు అనే పేరుతో కేంద్రం సలహాదారుని నియమించింది. కేంద్ర బలగాలను, డ్రోన్లను, హెలికాప్టర్ల ద్వారా నిఘాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాయుధ బలగాల నుండి ఆయుధాలు గుంజుకొనే పరిస్థితుల్లో తమ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన ఉన్నది. బిజెపియేతర రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను కుట్రలతో కూల్చడం, అస్థిరత సృష్టించడానికి అలవాటుపడిన మోడీ, షాలకు సొంత రాష్ట్రంలో పరిస్థితులు క్షీణిస్తే అప్రకటిత ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నది. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలు విషమించాయని అంగీకరించడానికి బిజెపి పెద్దలు సిద్ధంగాలేరు. మణిపూర్ ప్రజలకు శాంతి కావాలి.

మణిపూర్‌లో నాగా, కుకి జాతులకు చెందిన 38 తెగల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సమస్యకు పరిష్కారం చూపాలి. హిందుత్వ బ్రాహ్మణీయ శక్తులకు చట్టసభల్లో, ప్రజాప్రాతినిధ్యంలో, ఉద్యోగాల్లో గల తేడాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. సమపాళ్లతో గిరిజనులకు ప్రాతినిధ్య ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అటవీ హక్కుల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేవలం బ్రాహ్మణ హిందుత్వవాదులకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ ప్రభుత్వంపై విశ్వాసం కల్పించి గిరిజన ఆదివాసీల్లో తలెత్తిన అపోహలను తొలగించి, సమస్యకు పరిష్కారం చూపేందుకు చిత్తశుద్ధితో పూనుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉంది.

జె. సీతారామయ్య
9490700954

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News