Home తాజా వార్తలు నవంబర్‌లో మెరుగైన తయారీ రంగం

నవంబర్‌లో మెరుగైన తయారీ రంగం

PMI

 

పిఎంఐ 51.2 నమోదు.. కానీ మందగించిన డిమాండ్

న్యూఢిల్లీ: నవంబర్‌లో దేశీయ తయారీ రంగ కార్యకలాపాల్లో స్వల్ప మెరుగుదల కనిపించింది. అయితే కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి లేకపోవడం వల్ల ఈ రంగం వృద్ధి రేటు ఇంకా నెమ్మదిగానే ఉంది. పారిశ్రామిక రంగం సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఐహెచ్‌ఎస్ మార్కెట్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పిఎంఐ(కొనుగోలు నిర్వాహకుల సూచీ) నవంబర్‌లో 51.2కు పెరిగింది. అక్టోబర్‌లో పిఎంఐ రెండేళ్ల కనిష్ట స్థాయి 50.6 వద్ద ఉంది. సూచీ 50పైన ఉంటే ఉత్పత్తి విస్తరణను సూచిస్తుంది. ఉత్పాదక రంగం పిఎంఐ వరుసగా 28వ నెలలో 50 పాయింట్ల మార్కు పైన ఉంది. తయారీ రంగం స్థితిలో స్వల్ప మెరుగుదల కనబరిచినట్లు నవంబర్ సూచీ తెలియజేస్త్తోంది. సోమవారం విడుదల చేసిన పిఎంఐ సర్వే నివేదికలో నవంబర్‌లో ఉత్పాదక రంగం పరిస్థితి మెరుగుపడినప్పటికీ, ఈ సంవత్సరం ప్రారంభ నెలలతో పోలిస్తే ఈ రంగం కార్యకలాపాలు నెమ్మదిగా ఉన్నాయి.

ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త పోలియానా డిలిమా మాట్లాడుతూ, అక్టోబర్‌లో స్తుబ్దుగా ఉన్న తర్వాత తయారీ రంగం వృద్ధి రేటు నవంబర్‌లో వేగవంతమైంది. అయితే ఇప్పటికీ కర్మాగారాల ఆర్డర్లు, ఉత్పత్తి, ఎగుమతుల పెరుగుదల 2019 ప్రారంభంలో కంటే అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. మొత్తంగా చూస్తే డిమాండ్ మందగించడమే దీనికి ప్రధాన కారణమని డిలిమా అన్నారు. నివేదిక ప్రకారం, నవంబర్‌లో మార్కెట్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, దీనికి అనుగుణంగా మెరుగైన డిమాండ్, పోటీ ఒత్తిడిని తగ్గించడంతో కంపెనీల వృద్ధి మెరుగుపడింది. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమీక్ష నిర్ణయం డిసెంబర్ 5న వెల్లడించనుంది. ఈసారి కూడా వడ్డీ రేటును తగ్గిస్తే, ఇది పాలసీ రేటులో వరుసగా ఆరో కోత అవుతుంది. ఆర్‌బిఐ ఇప్పటివరకు 2019 సంవత్సరంలో రెపో రేటును 1.35 శాతం తగ్గించింది. ప్రస్తుతం ఈ రేటు 5.15 శాతంగా ఉంది.

Manufacturing PMI rises to 51.2 in November