Home తాజా వార్తలు ముప్పు ప్రాంతాలపై ముందస్తు చర్యలేవి…!

ముప్పు ప్రాంతాలపై ముందస్తు చర్యలేవి…!

చినుకుపడితే చెరువుల్లా తలపిస్తున్నలోతట్టు ప్రాంతాలు
గ్రేటర్ పరిధిలో 32 ప్రాంతాల్లో ఎక్కువగా వరద సమస్య
విపత్తు నిర్వహణ బృందాలే పెద్దదిక్కుగా మారిన పరిస్థితి

Rain

 

మన తెలంగాణ, సిటీబ్యూరో: మహానగరంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకెళ్లుతూ దేశంలో పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు పొందుతుంది. స్వచ్చ సర్వేక్షణ్‌లో పలు అవార్డులను కూడా సొంతం చేసుకుని మెట్రో నగరాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కానీ వానకాలంలో నీటి ముప్పును ఎదుర్కొవడంతో అధికారులు ప్రజలు ఆశించిన విధంగా పనులు చేపట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంటపాటు పెద్ద వాన కురిస్తే రోడ్లను జలమయంగా మారి వరదనీరు ఎక్కడిక్కడే నిలిచిపోయి వాహనదారులు, సమీపంలోని నివసించే బస్తీ ,కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక వేళ రాత్రి వేళలో వర్షం పడితే జాగరం ఉండే పరిస్దితి నెలకొంది. అందుబాటులో విపత్తు నిర్వహణ బృందాలుంటే వరద నీటిలోకి దిగి మ్యాన్‌హోల్ తెరవడం, అలా కూడ వెళ్లకపోతే రోడ్లపై ఉన్న ఎత్తుకట్టలను త్రవ్వి నీరు నాలాల్లోకి మళ్లించే పనులు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు బాధలు చెప్పతరంగాలేవు. నగరంలో 32 ప్రాంతాలు ముప్పు చిన్న వర్షానికి చెరువుల్లా తలపిస్తాయి.

ఆరునెల కితం జెఎన్‌టియూహెచ్ బృందం నగరమంతా పర్యటించి రోడ్లు, బస్తీలు, కొత్త ఏర్పడిన కాలనీలతో కలిపితే 229 ప్రాంతాలకు వరద ముప్పు ఉందని, రూ. 4933కోట్లు ఖర్చుచేస్తే ఏడాదిలో పనులు చేపట్టి, వరద ముప్పులేకుండా శాశ్వత పరిష్కారం చూపవచ్చని నివేదికలో పేర్కొంది. గ్రేటర్ నగరంలో మలక్‌పేట, గోల్నాక, నాగమయ్యకుంట, బేగంపేట, పికెట్ ప్రతి ఏటా ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవే కాకుండా పంజగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్ చౌరస్తా, రోడ్డు నెం. 12,ఫిలింనగర్ జంక్షన్, మల్కాజిగిరి బండచెరవు, కుత్బులాపూర్ ప్రగతినగర్, దీప్తినగర్, కాప్రా, నాచారం, రామంతపూర్,శేరిలింగంపల్లి, మల్కం చెరువు, బయోడైవర్సిటీజంక్షన్, ఎల్‌బినగర్, కొత్తపేట, సుష్మ చౌరస్తా ప్రాంతాలను కూడా వరద ముప్పు ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఈప్రాంతాల్లో వరద ముప్పకు అగ్నిమాపక, పర్యాటక, రంగంలోకి దిగుతున్నాయి. బోట్ల సాయంతో స్థానికులను సురక్షణ ప్రాంతాలకు తరలింపు చేయడం, ప్రగతినగర్, కాప్రా, నాచారం ఏరియాల్లో వారం రోజుల పాటు నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టిన సందర్భాలున్నాయి. హిమయాత్‌నగర్, రాజ్‌భవన్‌రోడ్డు, బయోడైవర్సిటీ జంక్షన్‌లో వాహనాలు వెళ్లేందుకు మోటార్ల ద్వారా నీటిని తరలించారు.

 Rain

వరద నీటి నిల్వతో వాహనదారుల అవస్థలు: వర్షానికి రోడ్లులపై వరద నీరు చేరి నిలిచిపోవడంతో ప్రధాన రహదారులు, జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ అవస్థలు ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజగుట్ట వైట్‌హౌజ్, రాజ్‌భవన్‌రోడ్డు, నాగోల్ మెట్రో స్టేషన్, మెట్టుగూడ, కూకట్‌పల్లి వైజంక్షన్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో రోడ్డు కిందికి ఉండటంతో నాలాల ద్వారా మెల్లగా నీరు పోవడంతో రోడ్డుపై గంట పాటు అవస్థలు పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. మెట్రో పనుల కారణంగా కొన్నిచోట్ల ఇప్పటికి వరద ముప్పు పెరిగిందని, ఆప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేయడంతో నీరు నిలిచిపోతుందని దుకాణాల వ్యాపారులు పేర్కొంటున్నారు.

నాలాల కబ్జాతో పలుప్రాంతాలకు వరద ముప్పు: శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా ఉండటంతో కొంతమంది రాజకీయ నాయకులు అపార్టుమెంట్లకు సమీపంలో ఉన్న నాలాల భూములను కబ్జా చేసుకుని నిర్మాణాలు చేపట్టారు. దీంతో వరద నీరు వెళ్లకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. గత ఏడాదిలో జీహెచ్‌ఎంసీ అధికారులు చేసిన సర్వేల్లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీప్తినగర్ నాలాకు అడ్డంగా భవన సెల్లార్ నిర్మించారు. దీంతో అగకుండా యాజమాన్యం న్యాయస్థానం నుంచి స్టే తీసుకొచ్చి అధికారులు అడుగు పెట్టకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారు. తప్పని పరిస్థితిల్లో దాని పక్క నుంచి నాలాలను నిర్మించుకునే పరిస్దితి నెలకొంది. కొన్నిచోట్ల రోడ్లపై వంతెనలు నిర్మించడంతో వరదనీరు నిలిచిపోవడంతో రోడ్డుపై గుంతలు పెట్టి నాలాల ద్వారా నీటి పంపిస్తున్నారు. బల్దియా అధికారులు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు చేయాలని ప్రజలు పలుమార్లు కోరిన నిధుల కొరత, భూసేకరణ సమస్యలు చూపించి చేతులు దులుపుకోవడం సరికాదని సూచిస్తున్నారు. వరద ముప్పు లేకుండా చూసి నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

 

Many Areas Submerged in Heavy Rain in Hyderabad