Home ఎడిటోరియల్ పర్యావ‘రణా’నికి ఆఫ్రికాబలి!

పర్యావ‘రణా’నికి ఆఫ్రికాబలి!

Cartoon

 

సైన్సు చెప్పేది వినండి. పర్యావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు తరచు వింటూ ఉంటాం. పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేషన్లు కూడా పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు ప్రకటిస్తున్నాయి. కాని వీటన్నింటి మధ్య మనం మరిచిపోతున్న వాస్తవాలు కొన్ని ఉన్నాయి. ఓజోన్ పొరను బలహీనపరిచే గ్రీన్ హౌస్ వాయువులను అడ్డుకునే ప్రయత్నాలను కనీసం 2050 వరకు పక్కన పెట్టడం జరిగింది. గ్రీన్ హౌస్ వాయువులను నిరోధించడం తక్షణం అవసరమని శాస్త్రవేత్తలు ఒకవైపు చెబుతున్నప్పటికీ వెంటనే అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎందువల్ల ఈ ఆలస్యమంటే, ప్రపంచంలో ఇంధన ఉత్పాదకత అవసరం ఎంతైనా ఉంది. శిలాజ ఇంధనాలను ఉపయోగించి ఇప్పటి వరకు దానిని ఉత్పత్తి చేస్తున్నారు.

శిలాజ ఇంధనాలను వదిలేసి స్వచ్ఛమైన, పునర్వినియోగం సాధ్యమయ్యే శక్తి వనరులకు మారాలంటే కొంత సమయం కావాలి. అందుకే ఆలస్యమవుతోంది. అంటే శిలాజ ఇంధనాలకు బదులు వాయుశక్తి, సౌరశక్తిని ఉపయోగించుకునే టెక్నాలజీకి మారవలసిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంఘం మొదలు అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్తల వరకు అందరూ ఇది కోరుతున్నారు. గ్రీన్ టెక్నాలజీ అనే మాట ఎటు చూసినా వినబడుతోంది. గ్రీన్ టెక్నాలజీ మాత్రమే ప్రమాదాలను నివారిస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాని, గ్రీన్ టెక్నాలజీ నిజంగానే ప్రమాదరహితమా అనేది కూడా ఆలోచించాలి. ఇంధన అవసరాల కోసం హైడ్రోకార్బన్లను ఉపయోగించే బదులు ఇతర పద్ధతులు పాటించడానికి, అలాగే ఎలక్ట్రానిక్, మెకానికల్ పరికరాల తయారీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక ఖనిజాలను, లోహాలను తవ్వి తీస్తున్నారు.

ఫలితంగా పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయడమే కాదు, వేలాది మంది ప్రజలను కూడా నిరాశ్రయులను చేస్తున్నారు. అంటే ఒక అన్యాయం స్థానంలో మరో అన్యాయం జరుగుతోంది. ఆఫ్రికాలోని గినియా దేశంలో బాక్సైట్ ఖనిజం చాలా ఎక్కువ. ప్రపంచంలోని బాక్సైట్ నిల్వల్లో దాదాపు 30 శాతం ఇక్కడే ఉన్నాయి. అంతేకాదు ముడి ఇనుము కూడా ఇక్కడా అపారంగా దొరుకుతుంది. గినియా దేశం 98 శాతం అడవులే. విద్యుత్తుతో నడిచే వాహనాలు, కార్లు, హై కెపాసిటీ కరెంటు వైర్లు తయారు చేయడానికి అల్యూమినియం అవసరం. బాక్సైట్ నుంచే అల్యూమినియం తీస్తారు. అలాగే భారీ నిర్మాణాలకు ఉక్కు అవసరం. గాలిమరలు తయారు చేయడానికి, భవన నిర్మాణానికి, ఇంకా అనేక నిర్మాణాల్లో ఉక్కు అవసరం. అల్యూమినియం, ఉక్కు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఈ రెండింటి కోసం జరిగే విధ్వంసం గినియా లాంటి దేశాల్లో ఎంత ఉంటుందో పాఠకులు ఊహించుకోవచ్చు.

కాంగో దేశంలో కోబాల్ట్ అపారంగా ఉంది. ప్రపంచంలోని కోబాల్ట్ నిల్వల్లో 60 శాతం కాంగోలోనే ఉన్నాయి. విద్యుత్తు వాహనాలు, కార్లు, మొబైల్ ఫోన్లలో ఉపయోగించే బ్యాటరీల తయారీకి ఈ లోహం కీలకమైనది. ఈ లోహాన్ని తవ్వి తీయడానికి ఇక్కడ కాంట్రాక్టర్లు దాదాపు 35 వేల మంది పిల్లలను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ పిల్లలు పనిచేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తవ్వుతున్న ఈ గనుల వల్ల విస్తారమైన సవానా వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయి. వేలాది ప్రజల జీవనోపాధి గల్లంతయ్యింది. కోబాల్ట్ డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఆఫ్రికాలో అనేక దేశాలకు సంబంధించి ఇలాంటి కథలే వినవచ్చు. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ఖండం ఆఫ్రికా. ప్రపంచంలోని మిగిలిన దేశాలు ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం ప్రయత్నిస్తు, టెక్నాలజీని మార్చుకుంటూ, కొత్త బ్యాటరీలు, ఇతర వస్తు పరికరాలు తయారు చేసుకుంటున్నాయి.

కాని ఈ ప్రయత్నాలకు అవసరమైన ఖనిజాల తవ్వకం ఆఫ్రికాలో కొనసాగుతోంది. ఆఫ్రికా ఖండం ఈ భారాన్ని మోస్తోంది. ఈ ప్రమాదాలను భరిస్తోంది. పర్యావరణ సంక్షోభ సమస్యలో కొట్టుమిట్టాడుతోంది. ఆహార ధాన్యాల కరువు, జీవ వైవిధ్యం దెబ్బతినడం, వ్యాధులు విజృంభించడం వంటి అనేక సమస్యలు తలెత్తాయి. గనుల తవ్వకం వల్ల గినియా, కాంగో వంటి దేశాలకు ప్రారంభంలో కొన్నిలాభాలు కలుగవచ్చు. కాని తర్వాత పర్యావరణ సంక్షోభం, ఆ పిదప రాజకీయ సంక్షోభాలు తప్పవు. ఉదాహరణకు బొలివియాలో సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న ఉప్పు మైదానాల్లో లిథియం ఖనిజం అపారంగా లభిస్తుంది. ప్రపంచంలోని లిథియం నిల్వల్లో దాదాపు సగం ఇక్కడే ఉన్నాయి. బ్యాటరీలు మొదలైనవి తయారు చేయడానికి లిథియం చాలా కీలకం. లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసిన శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం కెమిస్ట్రీ నోబెల్ బహుమతి లభించింది. లిథియం కోసం అక్కడ పోటీ మొదలైంది.

లిథియం తవ్వకాల రాజకీయాలు చివరకు అక్కడి సోషలిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టాయి. లిథియం గనుల తవ్వకాన్ని నియంత్రించి, గనుల తవ్వకం వల్ల లభించే ప్రయోజనాలు ప్రజల వరకు చేరడానికి పాత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు వామపక్ష ప్రభుత్వం కూలిపోయి, ఆ స్థానంలో మతతత్వ ప్రభుత్వం వచ్చింది. విదేశీ గనుల కంపెనీలతోను ఒప్పందాలు చేసుకోడానికి చేతులు సాచి ఆహ్వానిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో నీటి కొరత ప్రధాన సమస్య. తేమ లేని ప్రాంతాలివి. రాగి, లిథియం గనులకు దగ్గరగా ఉన్న చెరువుల్లో నీరు అడుగంటిపోవడంతో పాటు కాలుష్యానికి గురవుతోంది. పైగా ఈ ప్రాంతాల్లో లభించే నీటిలో 75 శాతం వరకు గనుల తవ్వకానికి మళ్ళిస్తున్నారు. కేవలం గనుల తవ్వకం వల్ల మాత్రమే పర్యావరణ విధ్వంసం జరుగుతుందని కాదు. ముడి ఖనిజాలు తవ్వి తీసిన తర్వాత వాటిని శుద్ధి చేసే ప్రక్రియలోను వాటిని ఉపయోగించుకునే ప్రక్రియలోను పర్యావరణ విధ్వంసం జరుగుతోంది.

ముడి ఖనిజాలను శుద్ధి చేసి వాడుకునే ప్రక్రియలో శిలాజ ఇంధనాలను ఉపయోగించడం తప్పడం లేదు. వాయుశక్తికి ఉపయోగపడే ఒక గాలిమర తయారు చేయాలంటే 900 టన్నుల ఉక్కు కావాలి. 2500 టన్నుల కాంక్రీటు కావాలి. 45 టన్నుల ప్లాస్టిక్ కావాలి. ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి చేయాలంటే, 780 కి.గ్రా.ల బొగ్గు అవసరం. ఒక్క టన్ను కాంక్రీటు ఉత్పత్తి చేయడంలో 1.25 టన్నుల కార్బన్ డయాక్సయిడ్ వాతావరణంలో కలుస్తుంది. అలాగే సాంప్రదాయిక పద్ధతిలో సోలార్ పానెల్స్ తయారీ జరుగుతోంది. ఈ తయారీ ప్రక్రియలో నైట్రోజన్ ట్రై ఫ్లోరైడ్ విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ కన్నా 17,200 రెట్లు అధిక ప్రమాదకరమైనది. వాతావరణంలో ఇది దాదాపు ఏడు శతాబ్దాల కాలం వరకు ఉంటుంది. స్వచ్ఛమైన ఇంధన ఉత్పాదక పద్ధతులు పాటించాలని అందరూ అంటున్నారు. కాని ప్రపంచంలో ఇంధన అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు నియంత్రణ, నిబంధనలు సరళీకరిస్తున్నారు.

ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 8 శాతం విద్యుత్తు మాత్రమే సౌరశక్తి, వాయు శక్తి ఉపయోగించి తయారు చేస్తున్నారు. రానున్న 30 సంవత్సరాల్లో డిమాండ్ 7 నుంచి 20 రెట్లు పెరగవచ్చు. డిమాండ్ పెరగడంతో పాటు వనరులను వాడుకోవడం కూడా పెరుగుతుంది. ఈ ప్రభావం పర్యావరణంపై పడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్కులో 9 శాతం మాత్రమే రీ సైకిల్ అవుతోంది. పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పద్ధతులు మార్చుకోవాలనే ఆలోచనలో లోపాలున్నాయి. నిజానికి పారిశ్రామిక కార్యకలాపాలపై పునరాలోచించవలసిన అవసరం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తులపై ఆధారపడే నేటి జీవనవిధానానికి ప్రత్యామ్నాయ జీవన విధానాలను, పని చేసే పద్ధతులను అన్వేషించి అవలంబించవలసి ఉంది.

Many measures to protect the environment