Home తాజా వార్తలు నేను మీ జైలు జాకీ…

నేను మీ జైలు జాకీ…

prisoners

 

శిక్షించే చోటు కాదు…పరివర్తన కేంద్రం కూడా
ఖైదీలకు ఉపాధే లక్షంగా అనేక కార్యక్రమాలు
ఎఫ్‌ఎం ఏర్పాటుతో మరో ముందడుగు
ఐదుగురు ఖైదీలకు రేడియో జాకీలుగా శిక్షణ
ఖైదీలతో జిల్లా జైలు రేడియో
సుప్రభాతంతో మొదలై.. రాత్రికి ఖైదీలు కోరిన మధుర గీతాలతో ముగింపు

జిల్లా జైలులో ప్రారంభమైన జైలు రేడియో ప్రసారాలు

జైలు అంటే కేవలం శిక్షించే చోటే కాదు.. పరివర్తన కేంద్రం కూడా.. సంగారెడ్డి జిల్లా జైలు పరివర్తన కేంద్రంగా మారడం ద్వారా ఆదర్శంగా నిలుస్తోంది. ఆవేశంతో కొందరు, కావాలని కొందరు, క్షణికావేశంలో ఇంకొందరు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడి జైలుకు వెళ్తుంటారు. అలాంటి వారిలో పరివర్తన తీసుకురావడంలో సంగారెడ్డి జైలు ముందున్నది. ఇప్పటికే అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈ జైలు తాజాగా జైలు అంతర్వాణి ఎఫ్ఎంను కూడా ప్రారంభించింది.

సంగారెడ్డి : జైలు అంటే కేవలం శిక్షించే చోటే కాదు. పరివర్తన కేంద్రం కూడా..! సంగారెడ్డి జిల్లా జైలు పరివర్తన కేంద్రంగా మారడం ద్వారా ఆదర్శంగా నిలుస్తోంది. ఆవేశంతో కొందరు, కావాలని కొందరు, క్షణికావేశంలో ఇంకొందరు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడి జైలుకు వెళ్తుంటారు. అలాంటి వారిలో పరివర్తన తీసుకురావడంలో సంగారెడ్డి జైలు ఎంతో ముందున్నంది. ఇప్పటికే అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈ జైలు తాజాగా జైలు అంతర్వాణి ఎఫ్‌ఎంను కూడా ప్రారంభించింది. ఇప్పటి వరకు పెద్ద జైళ్లకే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని మామూలు జిల్లా జైలులో కూడా ప్రారంభించడం ద్వారా ఇక్కడి అధికారులు ఎంతో శ్రద్ద తీసుకున్నారు.

ఇక్కడి ఖైదీలకు ఇప్పటికే ఫర్నీచర్ తయారీ, స్టీల్ బీరువాలు, ఇతర ఉపకరణాలు తయారీలో శిక్షణనిచ్చారు. అంతేకాకుండా ఫినాయిల్, కారంపొడి, పసుపు, ఆటా తదితర వస్తువులను మై నేషన్ పేరుతో తయారు చేసున్నారు. గతంలో దశాబ్దాలుగా సంగారెడ్డి పాత పట్టణంలో ఉన్న జైలును జిల్లా కేంద్రానికి దూరంగా కంది ఊరవతల ఏర్పాటు చేశారు. అనేక అధునాతన ఏర్పాట్లతో రూపొందిన ఈ జైలులో మొక్కల పెంపకంపై కూడా శిక్షణనిచ్చి ఖైదీల ద్వారా ఒక నర్సరీని తయారు చేశారు. ఇక పాత జైలును హెరిటేజ్ జైలుగా మార్చారు. అంతేకాకుండా జైలులో ఉన్న ఫీలింగ్ ఇతరులు స్వయంగా అనుభవించే విధంగా రోజుకు 500 రూపాయల టిక్కెట్‌తో ఫీల్ ద జైల్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల వారు 80 మందికి పైగా ఈ ఫీలింగ్‌ను స్వయంగా జైలులో ఒక రోజు గడిపి తెలుసుకున్నారు.

ఇక ఆయుర్వేదిక్ విలేజ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కేరళ మసాజ్‌ను కూడా అందిస్తారు. శిక్షణ పొందిన ఖైదీలు ఈ మసాజ్ చేస్తారు. దీనికి గాను మసాజ్‌ను బట్టి ఛార్జి వసూలు చేస్తారు. అంతే కాకుండా సంగారెడ్డి సమీపంలోని కాశీపూర్‌లో పెట్రోల్ పంపును కూడా ఖైదీలే నిర్వహిస్తున్నారు. పరివర్తన కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల ద్వారా ఏడాదికి 60 నుంచి 70 లక్షల ఆదాయం సమకూర్చారు. మరో రెండు పెట్రోల్ పంపులను కూడా ఖైదీల ద్వారా నడపాలని యోచిస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని రెండు కోట్లకు పెంచాలన్నది లక్షంగా పెట్టుకున్నారు.

అనేక వినూత్న కార్యక్రమాలకు వేదికగా నిలిచిన సంగారెడ్డి జైలులో సోమవారం నాడు ఎఫ్‌ఎంను ప్రారంభించారు. ఇందుకు గాను 5గురు ఖైదీలకు రేడియో జాకీలుగా శిక్షణనిచ్చారు.ఉదయం సుప్రభాతంతో పాటు జైలు సమయ సూచిక ప్రకారం వినోదాన్ని అందించే కార్యక్రమాలను చెబుతారు. అంతేకాకుండా బైట జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను కూడా ఖైదీలకు ఈ జాకీల ద్వారా తెలియజేస్తారు. నాలుగు గోడల మధ్య ఉన్నందున బైట విషయాలు ఇప్పటి దాకా అంతగా తెలిసేవి కావు. కానీ ఎఫ్‌ఎం ద్వారా అనేక విషయాలు ఖైదీలకు తెలిసే అవకాశముంది. ఇక ఖైదీలు కోరుకున్న పాటలను కూడా ఈ ఎఫ్‌ఎం ద్వారా వినవచ్చు. మైనేషన్ పేరుతో వందకు పైగా నిత్యావసర వస్తువుల విక్రయాలను కూడా చేపట్టారు.

ఇక్కడి ఖైదీలే కాకుండా ఇతర జైళ్లలోని ఖైదీలు తయారు చే సిన వస్తువులను విక్రయిస్తున్నారు. సంగారెడ్డి ప్రాంతంలోని 39 షాపుల్లో ఈ వస్తువులను అందుబాటులో ఉంచారు. విడుదలైన ఖైదీలకు 2 నుంచి 3 లక్షల వరకు స్టాకు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందించడం జరుగుతుంది. 5 వేలకు మించి ఎవరైనా ఆర్డర్ ఇస్తే హోం డెలివరీ కూడా చేస్తున్నారు. త్వరలో జిమ్‌ను కూడా ప్రారంభించబోతున్నామని సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ తెలిపారు. ఆనందాశ్రమం కూడా ఏర్పాటు చేసి అభాగ్యులను చేరదీసేందుకు యోచిస్తున్నామన్నారు.ఎఫ్‌ఎం రేడియోను ప్రారంభించిన సందర్భంగా జిల్లా జైలులో పండుగ వాతావరణం కనిపించింది. కొంందరు ఖైదీలు పాటలు కూడా పాడారు. డిప్యూటీ జైలర్ వెంకటేశ్వర్లు, అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Many programs for employment of prisoners