Home ఎడిటోరియల్ చంద్రునిపై గనుల తవ్వకం

చంద్రునిపై గనుల తవ్వకం

moon

 

మానవుల లక్షం చంద్ర ఉపరి తల గనుల తవ్వకం కాబోతోంది. దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సాయం తోడు కానున్నాయి. ఈ గనుల నుంచి వెలువడే సిలికాన్, ఇనుము, అల్యూమినియం ఉత్పత్తి, నిర్మాణ రంగాలకు వరాలు కానున్నాయి. చంద్రుని ఉపరితలంపై కనిపించే సిలికాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, ఐరన్, అల్యూమినియం భవనం నిర్మాణానికి ఉపయోగపడతాయని ‘నాసా’ శాస్త్రవేత్తలు ఆశాభావం వెలిబుచ్చుతున్నారు. ఈ మేరకు చంద్రుని ఆవిష్కరణకు సంబంధించి అనేక ఆలోచనలు ‘నాసా’లో రూపొందుతున్నాయి. ఇది వరకు ఎన్నడూ మానవులకు అనుసంధానం కానివి ఇప్పుడు అనుసంధానం కావడానికి అత్యంత ఆధునిక సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంతో పాటు కావలసిన పెట్టుబడులు పెట్టడానికి జెఫ్ బెజోస్ వంటి బిలీయనీర్లు ముందుకు రావలసిన అవసరం ఉందని ‘నాసా’ అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టియిన్ ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ఇటువంటి ఆర్థిక సంపన్నులు చంద్రునిపై తిరిగి వచ్చి, శాశ్వత నివాసం ఏర్పర్చుకుని ‘నాసా’ చేపట్టిన గనుల తవ్వకానికి అండదండలు అందించాలన్న ఆకాంక్షతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

బిలియనీర్ ప్రైవేటు ఎయిర్ స్పేస్ సంస్థ బ్లూ ఆరిజిన్ ఉంది. చంద్రునిపై నివాస మార్పిడి, పరిశ్రమ స్థాపనకు దోహదపడుతుంది. అంతరిక్షంలోని క్లిష్టమయిన విషయాలను చాలా సులభంగా, అతి తక్కువ వ్యయంతో లభించేవిగా తయారు చేయడానికి ప్రయత్నించడం తప్పనిసరి. ఆ తరువాత వాటిని అంటే ఆయా ఖనిజ మూలకాలను భూమికి తీసుకు రావలసి ఉంటుందని బెజోన్ ఒక ఇంటర్వూలో వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంటుంది. చంద్రునిపై అరుదైనవి, భూమిపై అత్యంత విలువైనవి అయిన ప్లాటినం గ్రూపు లోహాలు టన్నుల కొద్దీ చంద్రునిపై ఉండవచ్చని ‘నాసా’ బైడెన్ స్టయిన్ అభిప్రాయపడుతున్నారు. ప్లాటినంతో పాటు సిలికాన్, టిటానియమ్, అల్యూమినియం కూడా చంద్రునిపై పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు 80 శాతం అరుదైన లోహాలు చైనా నుంచి వస్తున్న తరుణంలో చంద్రునిపై లభించే అరుదైన ఖనిజ మూలకాలు అమెరికాకు రానురాను అత్యంత విలువైన వనరులుగా వర్ధిల్లగలవని అభిప్రాయ పడుతున్నారు.

చంద్రునిపైనే కాదు సమీప గ్రహాలపై కూడా ఖనిజాల తవ్వకానికి నాసా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చంద్రునిపై తవ్వకాలను సాగిస్తుంది. అ యితే రోబోటిక్ రోవర్లు, ఖనిజ సాంకేతిక పరిజ్ఞానం ఈ మేరకు సాధ్యం చేయడానికి నాసా ఇన్నొవేటివ్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్ (ఎన్‌ఎసి) కార్యక్రమం ప్రారంభమవుతుంది. లాసర్లతో చంద్రుని ఉపరితలాన్ని పేల్చడానికి ఆప్టికల్ మైనింగ్‌” వంటి పద్ధతిని వినియోగిస్తారు. తరువాత ఆ శిథిలాలను సేకరిస్తారు. ‘ఆర్టెమిస్’ మిషన్ ద్వారా చంద్రునిపైకి తిరిగి కాలు మోపుతామని ‘నాసా’ ఇటీవలనే ప్రకటించింది. 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవడమే దీని లక్షం. ఈ మేరకు వచ్చే దశాబ్ద కాలంలో 37 ప్రత్యేక ప్రయోగాలు విడివిడిగా నిర్వహిస్తారు. అదే విధంగా చంద్రునిపై అంతరిక్ష కేంద్ర ముఖ ద్వారాన్ని 2024 నాటికి నిర్మిస్తారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం ఇది వరకటి అభిప్రాయాల కన్నా చంద్రునిపై పుష్కలంగా నీటితో పాటు మంచు పొరలు మిళితమై ఉంటాయని భవిష్యత్తులో మానవ అవసరాలు తీర్చగలవని నేచరల్ జియో సైన్స్ పరిశోధనలో స్పష్టమయింది. చంద్రుని ఉత్తర ధ్రువం కన్నా దక్షిణ ధ్రువంపై నీడ ఎక్కువ. ఏ మాత్రం సూర్యరశ్మి సోకని ఛాయా ప్రాంతాలు దక్షిణ ధ్రువంపై ఉంటాయని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టిఐఎఫ్‌ఆర్)లో అంచనాగా వెల్లడయింది.

మంచు పొరల రూపంలో నీటితో పాటు ఆవిరయ్యే లక్షణాలు కలిగిన మూలకాలు కూడా ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. బుధ, చంద్ర గ్రహాల భౌగోళిక స్వరూపాలు, సహజ ప్రకృతి జల వనరుల సారూప్యతపై విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ రెండు గ్రహాలపై ఉండే బిలాలను సరిపోల్చి చూస్తున్నారు. చంద్రుని ఉపరితల బిలాల్లో శాశ్విత ఛాయా ప్రాంతాల్లో దట్టంగా మంచు పేరుకుపోయి ఉందనడానికి ఆధారాలు దొరికాయని కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ యూనివర్శిటీల పరిశోధకులు వెల్లడించారు. మెర్యురీలాసర్ అల్టిమేటర్ డేటా ఉపయోగించి బుధగ్రహం ఉత్తర ధ్రువం సమీపాన గల 2000 చిన్న బిలాల లోతు పాతులను, పరిమాణాలను కొలిచి చూశారు. ఏవైతే దట్టమైన మంచు కప్పబడి ఉంటాయని అనుకుంటున్నామో ఆయా బిలాలు ఎత్తయిన అక్షాంశాల్లో లోతు లేనివిగా తయారయ్యాయని పరిశోధకులు గ్రహించ గలిగారు.

అలాగే చంద్రుని ఉపరితలంపై ఉన్న దాదాపు 12 వేల బిలాలపై నాసా లూనార్ రికయిజాన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ) డేటా ఉపయోగించి సమాంతర పరిశోధన జరిపారు. బుధగ్రహం మాదిరిగానే చంద్రుని దక్షిణ ధ్రువ భౌగోళిక పరిస్థితి కనిపించింది. ఇక్కడ కూడా దట్టంగా మంచు పేరుకు పోయింది. బుధ గ్రహ ధ్రువ ప్రాంతాలు హిమ వాహినులతో నిండి ఉండగా, చంద్రుని ఉపరితలంపై బయటకు ఏవీ కనిపించవు. ఉపరితలం దిగువన మంచు పొరలు కోకొల్లలని పరిశోధకులు అంచనా వేశారు. చంద్ర, బుధ గ్రహాలు ఒకే అక్షాంశ రేఖలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అయినా ఈ గ్రహాల ధ్రువాలు సూర్యుని ముఖం చూడవు. అందువల్ల ధ్రువాల ఉపరితలాలు చాలా వరకు అతిశీతలంగా ఉంటాయి.

ఈ పరిస్థితుల్లో కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మంచు నిల్వలు స్థిరంగా ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా, చంద్రుని దక్షిణ ధ్రువంలోని లోతు తక్కువ బిలాలకు, ఉపరితల మంచు నిల్వలకు సంబంధం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పరిణామ ప్రక్రియలో రానురాను మంచు ఉపరితలంపైకి తేలి ఉండవచ్చు. లేదా ఉపరితలం లోపలి భాగంతో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. రాడార్ పరిశీలనలో బుధగ్రహంపై 50 మీటర్ల వెడల్పుతో మంచు పొరలు దట్టంగా ఉండగా, చంద్రుని ఉపరితలంపై లోతు తక్కువగా ఉన్న నీటి మడుగులు కనిపించాయి. ఈ తేడా ఎందుకొచ్చిందంటే గ్రహాల బిలాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలి. చంద్రుని బిలాల సముదాయం భవిష్యత్తు పరిశోధనలకు ఆధారపడే లక్షాల సాధనకే కాకుండా రెండు గ్రహాలపై గడ్డ కట్టిన ద్రవ రూపాల విరుద్ధ తత్వాన్ని విశ్లేషించడానికి సహాయ పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బుధ గ్రహం ఉపరితలంపై స్వచ్ఛమైన మంచు పొరలు కనిపించగా, చంద్రుని ఉపరితలం కఠినమైన శిలలతో, ఇతర సేంద్రియ పదార్థాలతో పేరుకుపోయి గడ్డ కట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే నిర్మాణాలకు, పరిశ్రమల స్థాపనకు ఆధారం దొరికినట్టే.

చంద్రునిపై నీటివనరుల అన్వేషణతోనే పరిశోధన ఆగిపోదు. సౌర వ్యవస్థ తొలి దశ శిలాజాల విశేషాలను అధ్యయనం చేయడానికి కూడా పరిశోధనలు ఊతం ఇస్తాయి. అలాగే భూమికి చంద్రునితో ఉన్న సంబంధం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చంద్రుని దక్షిణ ధ్రువంలో కొన్ని బిలాలు పగటి వెలుగు తమ నేలపై చేరడం అన్నది ఎరగకపోవడం విశేషం. ఇవి శాశ్వత చీకటిలో మగ్గ పోతున్నాయని నాసా గొడ్డర్డ్ స్పేస్ ఫైట్ సెంటర్ (అమెరికా) పరిశోధకులు గుర్తించగలిగారు. ఈ బిలాల్లోని శీతల ఉష్ణోగ్రతలను లూనార్ రికనైజాన్స్ ఆర్బిటర్ (ఎలార్‌ఒ) కొలవగా నీరు పదిలంగా ఉండే పర్యావరణం వీటిలో ఉందని తేలింది. మైనస్ 233 డిగ్రీలకు ఉష్ణోగ్రత దిగజారినప్పటికీ మంచు నిల్వలు చెక్కు చెదరబోవని, చంద్రుని ఉపరితల సన్నని పొరలో నిగూఢంగా ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ధ్రువ బిలాలు కొన్ని నీటిని సంగ్రహిస్తాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి పరిస్థితి వేరుగా ఉంటుంది.

సౌర వాయువుల తాకిడి, ఉల్కా పాతాలు అలా అనుకున్నట్టు జరగనివ్వవు. అత్యధిక ఉష్ణ్రోగ్రతల దిశగా నీటిని మళ్లిస్తుంటాయని చంద్రయాన్ 1 సేకరించిన ఆధారాల బట్టి స్పష్టమవుతోంది. తక్కువ లోతు బిలాల్లోని నీరు బొట్టు బొట్లుగా ఒక పక్క బయటకు చిమ్ముతున్నా ఆ మేరకు నీరు మళ్లీ తోక చుక్కలు, సౌర వాయువుల తాకిడి వల్ల భర్తీ అవుతుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. తొలినాటి నీటి వనరుల నమూనాను చంద్రునిపై సేకరించగలిగితే చంద్రునిపై నీటి మూలాలు అన్వేషించడానికి దారి దొరుకుతుంది. ఆ దిశగా చంద్రయాన్ 2 సాగుతోంది.

చంద్రుడు, అంగారకుడు ఈ రెండు గ్రహాల పైనే ఎందుకు విస్తృతంగా అధ్యయనాలు సాగుతున్నాయి? అన్న ప్రశ్నకు ఇతర గ్రహాలు భూమికి చాలా దూరంలో ఉన్నాయి. అలాగే సూర్యునికి చాలా దూరంలో ఉన్నందున వాటిపై సూర్యరశ్మి సోకక అతి శీతల వాతావరణంలో ఉంటున్నాయి. ఉదాహరణకు గురు గ్రహం తత్వాన్ని గమనిస్తే భారీ గ్రహమే కాకుండా గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. మరి కొన్ని గ్రహాల్లో విష పూరిత వాతావరణం కమ్ముకొని ఉంటుంది. ఈ కారణాల దృష్టా జాబిల్లి భవిష్యత్తు ఆశల వెల్లిగా అందరినీ ఆకర్షిస్తోంది.

Many thoughts on the discovery of the moon at NASA