Thursday, April 25, 2024

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

Maoist killed in encounter at gundala

గుండాల: పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మవోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు మృతి చెందాడు. మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలో మావోయిస్టు దళం, యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయనే సమాచారంతో దేవలగూడెం, దుబ్బగూడెం అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో గుండాల పోలీసులు, స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. గురువారం గుండాల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని సిబ్బంది వెంబడించారు. లొంగిపొమ్మని పోలీసులు గట్టిగా కేకలు వేశారు.

దీంతో అకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిపై ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు పారిపోయారు. పారిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎస్పి సునీల్ దత్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జిల్లాలో చాలా కాలంగా మావోయిస్టు దళాలు, యాక్షన్ టీమ్‌ల సంచారం ఉందన్న సమాచారంతో నిఘా పెంచామన్నారు. బుధవారం రాత్రి నుంచి వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. గురువారం ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారని, దీంతో వారు పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. పోలీసులు ఎదురు కాల్పులకు దిగినట్లు ఎస్పి వెల్లడించారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించగా 25ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహం లభించిందన్నారు.

పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తి వివరాలపై ఆరా తీసేందుకు జిల్లా కేంద్రానికి తరలించామన్నారు. సంఘటనా స్థలంలో ఒక ఆయుధం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరో మావోయిస్టు గురించి గ్రేహౌండ్స్ దళాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పి తెలిపారు. గుండాల తహసీల్దార్ ఉషాశారద మావోయిస్టు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్పి వెంట కొత్తగూడెం ఓఎస్‌డి తిరుపతి, ఇల్లందు డిఎస్పి రవీందర్‌రెడ్డి, మహబూబాబాద్ డిఎస్పి నరేష్ కుమార్, టేకులపల్లి సిఐ రాజు, గుండాల, ఆల్లపల్లి ఎస్సైలు ముత్యం రమేష్, అంజయ్య ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News