Home ఖమ్మం మావోయిస్టు రిక్రూట్‌మెంట్ జరుగుతోందా ?

మావోయిస్టు రిక్రూట్‌మెంట్ జరుగుతోందా ?

అవుననిపిస్తున్న వరుస సంఘటనలు
గోదావరి ఈవల అలజడి
Maoistమన తెలంగాణ/ఖమ్మం : ఇటీవల కాలంలో మావోయిస్టు కేడర్ రిక్రూట్‌మెంట్ పెరుగుతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ మధ్య జరుగుతున్న వరుస సంఘటనలు మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ చర్యలను బలపరుస్తున్నాయి. మావో యిస్టులు క్రమేపీ బలహీన పడుతున్నారని యువత ఆ పార్టీ వైపు పయనించడం లేదన్న ప్రచారం నిన్నటి తాండూరు ఘటనతో తప్పు అని తేలిపోయింది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన వారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టుల పార్టీలో చేరిన వారే. అంతే కాదు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన వారు కావడం గమనార్హం. సెంట్రల్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన శృతి, అంతకు ముందు మరణించిన ఓయు లా విద్యార్థి సూర్య పేటకు చెందిన వివేక్ సాయుధ దళ సభ్యులుగా చేరడం మావోయిస్టు పార్టీ పట్ల యువత సానుకూలంగా స్పంది స్తున్న సంకేతాలు వస్తున్నాయి. మావోయిస్టు ఎజెండాను అమలు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పాలన ఏడాది గడవక ముందే మావోయిస్టులో చేరికలు, ఎన్‌కౌంటర్లు చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల కాలంలో మావోయిస్టుల చర్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఆందోళనలు, హింసాత్మక చర్యలు భద్రాచలం ఏజెన్సీ లేదా ఖమ్మం- చత్తీస్‌ఘడ్‌కు పరిమితం అయ్యాయి. తెలంగాణ ప్రాంతం నుండి మావోయిస్టు పార్టీలో అగ్ర నాయకత్వం ఉన్నా నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం నుండి క్యాడర్ రిక్రూట్‌మెంట్ చేయలేకపోయారు. మావో యిస్టుల హింసాత్మక చర్యల్లో గిరిజనులు ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్ లేదా ఆ ప్రాంతం నుండి వలస వచ్చిన వారే పాల్గొనే వారు.
ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి ఊపిరి లూదిన కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై క్రమేపీ పట్టు కోల్పోతున్న దశలో మావోయిస్టులు యువతను ఆక ర్షించడం ప్రారంభించారు. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతపై ప్రధానంగా దృష్టి సారించారు. సంవత్సర కాలంగా మావోయిస్టు పార్టీ చేర్పింపు కార్యక్రమం ప్రారంభించారు. సాయుధ శిక్షణకు చత్తీస్‌ఘడ్ దండకారణ్యానికి తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా మణుగూరు మొదలు, కరీం నగర్ జిల్లా మంథని వరకు గోదావరి లోయ సాయుధ పోరాటాన్ని తిరిగి ఏజెండా మీదకు తీసుకు వచ్చారు. రిక్రూట్ తర్వాత వరంగల్ జిల్లాలో తొలిసారి హింసాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. తొలుత కాంతనపల్లి ప్రాజెక్టును నిర సిస్తూ ప్రచారం చేసిన మావోయిస్టులు స్పీకర్ మధు సూదనాచారిని హెచ్చరిస్తూ పోస్టర్లను అంటించారు. తర్వాత ప్రొక్లైన్లకు నిప్పు అంటించి హింసాత్మక చర్యలకు ప్రారంభించారు. ఒకప్పుడు గోదావరి ఇవతల కార్య క్రమాలు నిర్వహించిన మావోలు దాదాపు దశాబ్ధం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్దాక తిరిగి బలపడే ప్రయ త్నం చేస్తున్నారు. చాలాకాలం నుండి ప్రశాంతంగా ఉంద న్నకున్న ఈ ప్రాంతంలో తుపాకీ మోతలు పెద్ద అలజడి రేపాయి. ఆరునెలల క్రితం వరంగల్, కరీంనగర్ సరి హద్దులో భారీ శిక్షణా కార్యక్రమం చేపట్టారని ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌లోని విశ్వ విద్యాలయాలతో పాటు వరంగల్‌పైన దృష్టి సారించి నట్లు తెలుస్తోంది. అసంతృప్తికి గురైన యువతను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కొంతమేర విజయం సాధిం చినట్లు కనిపిస్తోంది. గోదావరి ఇవతల నాలుగు జిల్లాల పైన తీవ్ర ప్రభావం చూపే మావోయిస్టు ఉద్యమంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా తాండూరు ఘటన బలపడిన మావోయిస్టు పార్టీకి పెరుగుతున్న రిక్రూట్‌మెంట్‌కు సాక్షిగా నిలిచింది.

నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ లేదు :డిజిపి అనురాగ్ శర్మ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులు కొత్తగా రిక్రూట్‌మెంట్ చేపట్టలేదని, మేడారం అడవు లలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడిన సందర్భంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసు కున్నా యని డిజిపి అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అడ వులలో పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టడం సర్వ సాధారణమన్నారు. ఈ క్రమంలోనే మేడారం ఘటన చోటు చేసుకున్నదని తెలిపారు. నిషిద్ధ మావోయిస్టుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూంబింగ్ కొన సాగుతుందని డిజిపి తెలిపారు. వెంగలాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైనదేనని మీడియాకు చెప్పారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు వున్నారనే పక్కా సమాచారంతోనే పోలీసు బలగాలు గాలింపు చేబపట్టాయని ఆయన వివరించారు. ఈ ఘటనలో చనిపోయిన నక్సలైట్లు ఇద్దేరేనని, పోలీసుల అదుపులో ఎవరూ లేరని డిజిపి స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ తరువాత తప్పించుకున్న మావోల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేస్తున్నారని తెలిపారు. నక్సలిజంవైపు యువత ఆకర్షితులై బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని శర్మ హితవుపలికారు.