Home తాజా వార్తలు కుల ఆధిపత్యం వల్లే మావోయిస్టు పార్టీని వీడారు

కుల ఆధిపత్యం వల్లే మావోయిస్టు పార్టీని వీడారు

లొంగిపోయిన సుధాకర్, మాధవిలను మీడియా ఎదుట హాజరుపరిచిన సందర్భంలో డిజిపి మహేందర్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, అతని భార్య మాధవి బుధవారం రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు దంపతులు సుధాకర్, మాధవిలను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో కుల ఆధిపత్యం వల్లే నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సత్వాజి అలియాస్ సుధాకర్, అతని భార్య వైదుగుల అరుణ అలియాస్ నీలిమ లొంగిపోయినట్లు తెలిపారు. సుధాకర్ నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో జన్మించాడన్నారు. సొంత గ్రామంలో ఏడవ తరగతి వరకు చదివాడని, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు నిర్మల్ గవర్నమెంట్ కాలేజీలో అభ్యసించినట్లు తెలిపారు. 1983లో ఇంటర్ మధ్యలోనే స్వస్తిపలికి మావోయిస్టు పార్టీలో చేరాడన్నారు. 1986లో సుధాకర్‌ను గుల్బర్గ పోలీసులు అరెస్టు చేశారని, అతని నుంచి 11 ఆయుధాలు స్వాధీనం చేసుకుని జైలుకు పంపించారన్నారు. జైల్లోనే వరవరరావుతో పరిచయం ఏర్పడిందని, 1989లో జైలు నుంచి విడుదలయ్యాక వరవరరావు ఆధ్వర్యంలో నడిచిన రైతుకూలీ సంఘంలో పనిచేశారన్నారు. 1983 నుంచి 1985 వరకు సుధాకర్ ఆదిలాబాద్‌లో కొరియర్‌గా పనిచేసినట్లు తెలిపారు. అనంతరం డిసిఎస్ కటకం సుదర్శన్ సహకారంతో మావోయిస్టు పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. బెంగుళూరు కేంద్రంగా సుధాకర్ ఆయుధాలు సరఫరా చేసేవాడన్నారు. 1990 నుంచి సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లి 1992 నుంచి 94 మధ్య చెన్నూరు దళ కమాండర్‌గా పనిచేశాడని తెలిపారు. 1997, 99 మధ్య ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌చార్జీగా, 1999 నుంచి 2001 వరకు నార్త్‌జోనల్ కమిటీ ఇన్‌చార్జీగాఅప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవుల్లో పనిచేశాడని వివరించారు. 2003 నుంచి 2013 వరకు స్టేట్ మిలటరీ కమిషన్ సభ్యుడిగా, 2014 నుంచి 2019వరకు (ఈఆర్‌బి)కేంద్ర కమిటీ సభ్యునిగా మిలటరీ కమిషన్ సభ్యునిగా బీహార్, జార్ఖండ్ కేంద్రంగా పనిచేశాడని డిజిపి వెల్లడించారు.
జనాణ్యం నుంచి అరణ్యంలోకి: మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న సుధాకర్ ఉమ్మడి రాష్ట్రంలో మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో జనారణ్యంలోకి వచ్చాడు. తన స్వగ్రామంలోనే ఉంటూ పనులు చేసుకున్నాడు. అయితే మళ్లీ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం విధించడంతో 1991లో తిరిగి అరణ్యంలోకి వెళ్లాడు. 1998లో తన తండ్రి కాశీరాం మృతిచెందినప్పటికీ సుధాకర్ రాలేదు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లకు ఆయన హాజరుకాలేదు. సుధాకర్ సోదరులు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో సుధాకర్ కీలక భూమిక పోషించాడు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో సుధాకర్‌పై అనేక కేసులున్నాయి.

బాల్య వివాహం కారణంగా: సుధాకర్ భార్య ఆరుణ(43) వరంగల్ జిల్లాలోని దుగ్గొండి అని డిజిపి తెలిపారు. మాధవి 3వ తరగతి చదువుతున్న సమయంలోనే బాల్య వివాహం కారణంగా విరక్తి చెంది ఆమె దళ సభ్యుల పాటలకు ఆకర్షితురాలై దళంలో చేరినట్లు తెలిపారు. మాధవి పార్టీలో స్టేట్ కమిటీలో కీలక హోదాలలో పనిచేసిందన్నారు. మావోయిస్టులైన అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని, అక్కడి వేధింపుల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అలాగే ఇటీవల కాలంలో ఆరోగ్యం సహకరించడంలేదని, పార్టీలో ఉంటూ పనిచేయలేనిస్థితిలో ఉన్నామని అందుకే లొంగిపోయినట్లు మావోయిస్టు దంపతులు మీడియాకు తెలిపారు.

పార్టీలో సుధాకర్ పాత్ర: 1990 నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలోనే ఉంటూ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడని డిజిపి తెలిపారు. సుధాకర్ ఇంటర్‌లోనే రాడికల్ స్టూడెంట్ నాయకుల ప్రభావంతో మవోయిస్టు పార్టీలో కొరియర్‌గా చేరాడన్నారు. పలు హింసాత్మక సంఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగాగడన్నారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బీహార్, జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నెరవేర్చాడన్నారు. సుధాకర్‌పై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని 1998లో సుధాకర్ వివాహం చేసుకున్నాడని తెలిపారు.
సోదరుడి వల్లే లొంగుబాటః మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ సోదరుడు నారాయణ 2017 ఆగస్టులో రాంచీలోని పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లిద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్య మాధవితో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

అనతికాలంలోనే రివార్డులు: లొంగుబాట పట్టిన మావోయిస్టు దంపతులకు సంబంధించిన రివార్డు మొత్తాలను అనతికాలంలోనే అందజేస్తామని డిజపి తెలిపారు. సత్వాజి పేరు మీద రూ.25 లక్షల రివార్డు ఉందన్నారు. అలాగే అతని భార్య మాధవి పేరుమీద రూ.10లక్షల రివార్డు ఉందని వారిద్దరి పేరుమీద ఉన్న రివార్డు మొత్తాలను అనతికాలంలోనే వారికి అందజేస్తామన్నారు. ఈ సందర్బంగా లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, మావోయిస్టులు పార్టీ వీడి జన జీవన స్రవంతిలో ప్రశాంత జీవనం గడపాలని డిజిపి పిలుపునిచ్చారు.

Maoist Sudhakar Surrender before TS Police