Home జాతీయ వార్తలు పట్టణ మేధావులపై నజర్

పట్టణ మేధావులపై నజర్

పార్టీలో చేర్చుకోవడానికి మావోయిస్టుల యత్నాలు
రెండవ స్థాయి నాయకత్వ  లేమితో సవాళ్లు
వయసు మీరిన ఉన్నతస్థాయి నాయకత్వం

Maoists

కోల్‌కతా : పట్టణ మేధావులైన యువతీ యువకులను  పార్టీలో చేర్చుకోవడానికి సిపిఐ ఎంఎల్ (మావోయిస్టు) పార్టీ ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో తగిన నాయకులు లేకపోవడంతో మేధావులైన యువకులు, ఆదివాసీలు, దళితులను పోరాటంలో పాల్గొనే విధంగా తగిన కార్యాచరణని రూపొందించుకున్నామని మావోయిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత బోస్ అలియాస్ కిషన్ దా పార్టీ పత్రిక లాల్ చింగారి ప్రకాషన్‌లో రాశారు. రెండవస్థాయి నాయకత్వాన్ని తయారు చేయడంలో పార్టీ విఫలమైందని ఆయన అన్నారు.

కింది స్థాయి పార్టీ సభ్యుల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటం, మేధావులు లేకపోవడం వల్ల రెండవస్థాయి నాయకత్వాన్నిపార్టీ  పెంపొందించలేకపోతోందని కిషన్ దా తెలిపారు. పట్టణ ప్రాం తాల్లో పార్టీ ఆలోచనా విధానంపై విస్తృతంగా చర్చ జరుగుతోందని, నక్సలైట్ల సిద్ధాంతం పట్ల వారు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు. అయితే రెండవస్థాయి నాయకత్వాన్ని పెంపొందించడంలో అనుకున్నంతగా విజయం సాధించలేదని ఆయన తెలిపారు. ఇది పార్టీకి ఓ పెను సవాలుగా మారిందని పార్టీ అంతర్గత  పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన తెలిపారు.  వృద్ధాప్యం వల్ల శారీకంగా బలం కోల్పోయిన సీనియర్ నేతలు పార్టీ రహస్య కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నారని, అటువంటి సీనియర్ నేతలను ఉన్నత నాయకత్వం నుంచి తప్పించి తగిన పని అప్పజెప్పాలని పార్టీ గత సంవత్సరం నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకున్న సంవత్సరం తరువాత మావోయిస్టు పొలిట్‌బ్యూరో నేత ప్రశాంత బోస్ డాక్యుమెంట్ బయటపడింది.

పశ్చిమ బెంగాల్ తప్ప అసోం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, నిరుపేద వర్గాల్లో పార్టీ పునాది ఏర్పాటు చేసుకోగలిగింది. అయితే వారిలో అక్షరాస్యత చాలా తక్కువ కావడం వల్ల మార్కిస్టు సిద్ధాంతాల పట్ల వారికి అవగాహన కల్పించడం చాలా సవాలుతో కూడిన పనిగా మారిందని 72 ఏళ్ల బోస్ అన్నారు. ఇటువంటి వారిని చైతన్యవంతులను చేయడానికి విప్లవకారులైన, బాగా చదువుకున్న, మేధావులైన యువ కామ్రేడ్స్ అవసరం ఉందని ఆయన అన్నారు. పోరాట ప్రాంతాల్లో విద్యావంతులైన పార్టీ కార్యకర్తలు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో వారిని రాజకీయంగా చైతన్యవంతులను చేయడానికి పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. తెలివైన విద్యార్థులు, మేధావులు, విప్లవ సిద్ధాంతం పట్ల మంచి అవగాహన కలిగిన వారిని పోరాట ప్రాంతాలకు పంపాలని సిపిఐ ఎంఎల్ ( మావోయిస్టు ) పార్టీ కేంద్ర కమిటీ  కిందిస్థాయి కమిటీలను కోరింది.

విప్లవ భావాలు కలిగిన మేధావులు తప్పకుండా పార్టీలో చేరతారని, అటువంటి వారితో రెండవ, మూడవ స్థాయి నాయకత్వాన్ని పెంపొంచుకుంటామని బోస్ చెప్పారు. వృద్ధాప్యం వల్ల తమ బాధ్యతలను నిర్వహించలేకపోతున్న నాయకులతో  పదవీ విరమణ చేయించి, వారికి తగిన పని అప్పజెప్పాలని మూడు పేజీలతో కూడిన తీర్మానంలో పార్టీ తెలిపింది.

మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావుకి 67 ఏళ్లు, బోస్ వయసు 72 , సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ వాసవరావుకు 62 ఏళ్లు. మావోయిస్టుల ప్రధాన స్థావరమైన  దండకారణ్య ఇన్‌చార్జ్ సోను, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ వయసు కూడా 60 ఏళ్లు.  ఇప్పటికే ఉన్నతస్థాయి నాయకుల్లో చాలా మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని, మరికొందరు అరెస్ట్ అయ్యారని 2008 నుంచి మల్లోజుల కోటేశ్వర్ అలియాస్ కిషన్ జీ ఎన్‌కౌంటర్ వరకు బాధ్యతలు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి  ఒకరు చెప్పారు. మేధావులైన యువకులు పార్టీలో చేరాలని మావోయిస్టులు కోరుతున్నా, ఇప్పటి తరం యువత అడవిలో గెరిల్లా పోరాటానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు.