Friday, March 29, 2024

ఆదివాసి జిల్లాలో అన్నల అలజడి

- Advertisement -
- Advertisement -

Maoists spreading tension in Asifabad

ఆసిఫాబాద్ : రెండునెలల నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగింది. నెల రోజులుగా గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు 500మంది తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇటీవల రెండు సార్లు మావోయిస్టులు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. నక్సల్స్‌ను పట్టుకోవడానికి జిల్లా అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జిల్లాపై మంచి పట్టు ఉన్న మావోయిస్టు అత్రం శోభన్ ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతం లో వారి కదలికలు తగ్గాయి. దట్టమైన అటవీ ప్రాంతం, భారీ లోయలు ఉండడంతో మావోయిస్టులు మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడేళ్లు అలియస్ భాస్కర్ తోపాటు మరికొంత మంది సభ్యులు ఇక్కడి దళంలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రిక్రూట్‌మెంట్ బాధ్యతలు భాస్కర్‌కు అప్పగించినట్లు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు సానుభూతిపరుల సహాయంతో ఇప్పటికే పదుల సంఖ్యలో యువతి, యువకులను దళ సభ్యులుగా చేర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల మంగి అడవుల్లో రెండు సార్లు మావోయిస్టులు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో పార్టీ అగ్రనేతలు త్రుటిలో తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో దొరికిన మావోయిస్టుల డైరీలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 15మంది యువకుల పేర్లు ఉండడంతో వారిపై పోలీసులు నిఘా పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత సులువుగా వారివైపు ఆకర్షితులు అవుతారని పోలీసులు భావిస్తున్నారు.

చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన దళ సభ్యుడు వర్గీస్ గిరిజనుడు కావడంతో ఆదివాసిలతో మమేకమై గిరిజన యువకులను రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నట్లు సమాచారం. మైదాన ప్రాంతంలో మందమర్రి గ్రామానికి చెందిన బండి ప్రకాష్, అటవీ ప్రాంతంలో భాస్కర్ కొత్తగా దళ సభ్యులను చేర్చుకుంటున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగి దళంలో కీలకంగా ఉండే అత్రం శోభన్, ఇదే ప్రాంతంలో పోలీసులకు చిక్కకుండా కార్యకలాపాలు నిర్వహించేవాడు. దాదాపు 10 సార్లు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పటి ఉమ్మడి జిల్లా పోలీసులు మహారాష్ట్ర పోలీసులను సమన్వయం చేసుకొని 2016లో అత్రం శోభన్‌ను మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం మంగి అటవీ ప్రాంతం దట్టమైన చెట్ల పొదలతో విస్తరించి ఉంది. పది మీటర్ల దూరంలోని వ్యక్తి కూడా కనిపించడు.

దీన్ని ఆసరాగా చేసుకున్న మావోయిస్టులు భాస్కర్ నేతృత్వంలో మంగి అడవుల్లో నెల రోజులుగా తలదాచుకుంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. తిర్యాణి మండలం, మంగి, గుండాల అటవీ ప్రాంతం నుంచి సిర్పూర్ మీదుగా మహారాష్ట్రకు అటు దండేపల్లి, మంచిర్యాల నుంచి సిరంచా, ఆసిఫాబాద్ నుంచి గడ్చిరోలి ఇలా పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి అనేక అటవీ మార్గాలు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఉమ్మడి జిల్లా పోలీసులు ముట్టడిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలతో 500మంది పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆసిఫాబాద్ మండలం, మోవాడ్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మావోయిస్టులకు అన్నం తీసుకువెళ్తుండగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తిర్యాణి మండలంలోని ఓ గిరిజన గ్రామంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు గ్రామంలోని ఓ ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.

చికటి పడడంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం. ఆ గిరిజన గ్రామంలో మావోయిస్టులకు సహకరిస్తున్న యువకున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. గురువారం గ్రేహౌండ్స్ ఐజి నాగిరెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను కలసి పలు సూచనలు చేశారు. శుక్రవారం డిజిపి మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డిజిపి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారని, త్వరలోనే మావోయిస్టులను పట్టుకుంటారని తెలిపారు. జిల్లాలోకి మావోయిస్టులు రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News