Home వరంగల్ రూరల్ ఎస్‌సి వర్గీకరణ సాధనకు 21న ఢిల్లీలో కవాతు

ఎస్‌సి వర్గీకరణ సాధనకు 21న ఢిల్లీలో కవాతు

madiga

*28న విద్యార్థులతో
పార్లమెంట్ ముట్టడి
*జనవరి 3న మహిళలతో
ఢిల్లీ దిగ్బంధం
*డిసెంబర్ 17న హైదరాబాద్‌లో
భారతి సంస్మరణ సభ
*ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: ఎస్‌సిల వర్గీకరణ కోసం డిసెంబర్ 21న దేశ రాజధాని ఢిల్లీ పురవీధులలో మాదిగల కవాతు ఉంటుందని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం హన్మకొండ అం బేద్కర్‌భవన్‌లో ఎంఆర్‌పిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావే శం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేశ్ అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణ సాధనలో అమరులైన భారతి మాదిగ సంస్మరణ సభను డిసెంబర్ 17న హైదరాబాద్‌లో కనీవిని ఎరుగని రీతి లో నిర్వహించి ఆమె త్యాగాన్ని ప్రపంచానికి చాటిచెప్పుతామని అన్నారు. భారతి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కి ఎస్‌సి వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే భారతి త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చేదికాదన్నారు. బిజెపి పార్లమెంటులో బిల్లుపెట్టి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే భారతి ప్రాణాలను కోల్పోయేది కాదన్నారు. భారతి మరణానికి కెసిఆర్, బిజెపి ప్రభుత్వా లే బాధ్యత వహించాల్సి ఉంటుందని మందకృష్ణ అన్నారు. భారతి  ఆశయసాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరోపోరాటానికి మాదిగలు సన్న ద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారతి సంస్మరణసభకు వేలాదిగా తరలిరావాలన్నారు. ఎస్‌సిల వర్గీకరణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధతను కల్పించకుంటే డిసెంబర్ 28న మాదిగ విద్యార్థులతో పార్లమెంటును ముట్టడిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. అదేవిధంగా జనవరి 3న మాదిగ మహిళలతో ఢిల్లీని దిగ్బందిస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినట్లే బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాబోయే శీతాకాలం సమావేశాలలో బిజెపి ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్దతను కల్పించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇన్‌చార్జులు బొచ్చల వెంకటేశ్వర్లు, కొలనపాక వెంకటేశ్వర్లు, ఏపూరి వెంకటేశ్వర్లు, బిర్రు మహేందర్, మంథని సామేల్, పుట్ట రవి, బొడ్డు దయాకర్, జూలియస్, నకిరకంటి యాకయ్య, నరేష్, గుండెపాక వినోద, దామెర కరుణ, కవిత, శ్రీలత, బుర్రి సతీష్, ఉపేందర్, భాస్కర్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారతి ఆత్మకు శాంతి చేకూరాలని కొవొత్తుల ర్యాలీ నిర్వహించి భారతి చిత్రపటానికి నివాళి అర్పించారు.