Home తాజా వార్తలు గంజాయి దందా: వైజాగ్ టూ హైదరాబాద్

గంజాయి దందా: వైజాగ్ టూ హైదరాబాద్

Marijuana Illegal transport

 

గంజాయి వైజాగ్ టూ హైదరాబాద్
ఇంజనీరింగ్ విద్యార్థులే లక్షంగా సరఫరా
రోజుల వ్యవధిలో 230 కిలోల గంజాయి పట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పక్క రాష్ట్రమైన ఎపిలోని విశాఖపట్నం ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు వివిధ వాహనాలలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులే లక్షంగా గంజాయి సరఫరా చేస్తున్నారు. రోజుల వ్యవధిలో కిలోల కొద్ది గంజాయి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు పట్టుబడటమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల కాలంలో హైదరాబాద్ పరిధిలో 102 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దీనికంటే కొన్ని రోజుల ముందు 80 కిలోల గంజాయి పట్టుబడింది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 50 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు స్వాధీనం చేసుకుంది. ఇలా రోజుల వ్యవధిలో 230 కిలోలకు పైగా గంజాయి పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. తమకు పట్టుబడుతుంది కొంత మొత్తమేనని, అధికారుల కళ్లుగప్పి గుట్టు చప్పుడు కాకుండా ఎక్కువ మొత్తంలోనే సరఫరా చేస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి మన తెలంగాణతో వ్యాఖ్యానించారు. ఒడిస్సా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని సరఫరా చేస్తున్నారని ఆ అధికారి వివరించారు.

పట్టుబడుతున్న వారి లోతుగా విచారిస్తే మళ్లీ పాత నేరస్తుల తెరపైకి వస్తున్నారని పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కూడా గంజాయి దందా జోరుగా సాగుతుందని ఆయన తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలు ఉన్న ప్రాంతాల్లో ఇదీ మరి ఎక్కువగా ఉంది. కొందరు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తరలించేందుకు సొంత వాహనాలు వినియోగిస్తుండగా, మరికొందరు ప్రైవేట్ బస్సులు, రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అసలు ఎక్కడా వాసన రాకుండా పకడ్బందీగా ప్యాక్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడికి వచ్చిన తరువాత కొంత లాభానికి సరఫరాదారుడు విక్రయిస్తే, దానికి డబుల్ రేటుకు దానిని రెగ్యులర్ కస్టమర్స్ ఇంకో టీమ్ విక్రయిస్తుందని ఒక అధికారి తెలిపారు.

విశాఖపట్నం నుంచి కిలోకు రూ.1500లకు కొనుగోలు చేసి ఇక్కడ వ్యాపారులకు రూ. 4 వేల చొప్పున విక్రయిస్తే గంజాయి వినియోగించే వారికి రూ.10 వేల వరకు అమ్ముకుంటున్నారు.అలాగే, గంజాయి విక్రయానికి కోడ్ భాషను ఉపయోగిస్తున్నారు. గంజాయి కొనడాన్ని ’స్కోర్’గా పిలుస్తారు. మెటీరియల్, స్టఫ్ వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. గతంలో డబ్బుల కోసం వ్యాపారం చేసేవారే ఇందులో కీలకపాత్ర పోషిస్తుండేవారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి చోటుచేసుకుంది. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన విద్యార్థులే సరఫరా దారులుగా మారుతుండటం గమనార్హం.

Marijuana Illegal transport from Vizag to Hyderabad