Home తాజా వార్తలు నిఫ్టీ @ 18000

నిఫ్టీ @ 18000

Market cap of bse companies crosses Rs 270 lakh cr

 

సరికొత్త శిఖరాలకు మార్కెట్లు
61 వేల పాయింట్లకు చేరువలో సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఆటోమొబైల్, మెటల్, కన్జూమర్ డ్యూరబుల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లు రికార్డు గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు (0.75 శాతం) పెరిగి 60,836 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 18,161 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 22 షేర్లు లాభాలతో ముగియగా, 8 షేర్లు నష్టపోయాయి. దీనిలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎం షేర్లు భారీ లాభాలను చూశాయి. పవర్‌గ్రిడ్ షేర్లు 3.41 శాతం, ఐటిసి షేర్లు 3.34 శాతం పెరిగాయి. మరోవైపు మారుతి సుజుకీ 2.46 శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఇలో ఆటో ఇండెక్స్ 3.43 శాతం లాభంతో ముగిసింది. ఐటి ఇండెక్స్ 1.19 శాతం, మెటల్ ఇండెక్స్ 1.46 శాతం పెరిగాయి. రియల్టీ ఇండెక్స్ నష్టపోయింది.

రూ.270 లక్షల కోట్లు దాటిన బిఎస్‌ఇ కంపెనీల మార్కెట్ క్యాప్
బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ.270 లక్షల కోట్లు దాటింది. బిఎస్‌ఇలో 3,476 షేర్లు ఉన్నాయి. వీటిలో 1,760 షేర్లు లాభపడగా, 1,578 షేర్లు నష్టాలతో ముగిశాయి. అక్టోబర్ 12న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) మార్కెట్లో రూ.278.32 కోట్లు విలువచేసే షేర్లు విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐలు) మార్కెట్ నుండి రూ.741.22 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

మార్కెట్ బూమ్‌కు కారణాలు
ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా 9.5 శాతం, వచ్చే ఏడాది 8.5 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ వెల్లడించడం.
రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్టానికి చేరుకుంది.
కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తాయనే అంచనాలు.
వ్యాక్సినేషనల్ ప్రక్రియ వేగవంతం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.
పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రభుత్వం తరచూ చర్యలు, సంస్కరణలు చేపడుతోంది.

Market cap of BSE companies crossed Rs 270 lakh cr