Home రాష్ట్ర వార్తలు కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తా

కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తా

Marri RajaSekhar Reddyకెసిఆర్, కెటిఆర్ సహకారంతో ప్రజాసేవలో ముందుంటా ‘మన తెలంగాణ’తో మల్కాజ్‌గిరి టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి.

మల్కాజ్‌గిరి ప్రజలు ఆదరించి ఎంపిగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానని టిఆర్‌ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తండ్రి నిర్దేశించిన బాటలో నడుస్తూ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటైన ఎంఎల్‌ఆర్‌ఐటి కళాశాల డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగా పేరుగాంచిన మర్రి రాజశేఖర్‌రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌నే ఆదర్శంగా తీసుకొని రాజకీయ ఆరంగేట్రం చేశారు.

మనతెలంగాణ/షాపూర్‌నగర్: సిఎం కేసిఆర్ బంగారు తెలంగాణ సాధనలో కంకణబద్ధ్దులై చేపడుతున్న పనులకు ఆకర్శితుడైన మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి స్ఫూర్తితో ప్రజలకు సేవచేయాలనే సంకల్పతంతో మందుకు వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ నుండి మల్కాజ్‌గిరి ఎంపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తాను ఎంపిగా పోటీ చేయడంతో పాటు తాను గెలిస్తే ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు అనే అంశంపై ఎంపి అభ్యర్ది రాజశేఖర్ రెడ్డి ‘మన తెలంగాణ’తో తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకున్నారు.

విద్యారంగంలో ఉన్న మీరు రాజకీయరంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు?
ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నో రోజుల నుంచి ప్రజలకు వివిధ రకాలుగా సేవచేస్తూ ఉన్నాను. తాను నిర్వహించే కళాశాలలో పేద ప్రజల కష్టాలు విద్యార్థుల నుండి తెలుసుకుంటూ తోచినంతా సహాయం చేసేవాడిని. వారికి నేను అందించిన తోడ్పాటుతో ఎంతోమంది నా విద్యార్థ్దులు ఉన్నత పదవులతో పాటు మంచి లక్షాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు. అదే విధంగా ప్రజలకు కూడా సహాయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను.

మల్కాజ్‌గిరి ఎంపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గెలిస్తే ప్రజలకు మీరు ఏంచేస్తారు?
నేను చిన్ననాటినుంచి స్థానికంగా ఉన్న ఎన్నో సమస్యలను చూస్తూ వస్తున్నాను. అత్యధికంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, అల్వాల్, తిరుమలగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు ఆర్మీ, పరిధిలో ఉన్నాయి. వాటి ద్వారా చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇళ్లు కట్టుకోవాలన్నా ఆర్మీనుండి ఎన్‌ఓటి తెచ్చుకోవడం, కంటోన్మెంట్ పరిధిలో ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను సిఎం కెసిఆర్, కెటిఆర్‌ల సహకారంతో కేంద్రంలో పరిష్కార దిశగా ముందుకు వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. హెచ్‌ఎంటిలాంటి కేంద్ర రంగ సంస్థలతో చర్చించి జగద్గిరిగుట్ట లాంటి ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే బస్సు డిపోలు ఏర్పాటు చేయిస్తా.

రాజకీయాల్లోకి రాగానే ఎన్నికలు వచ్చాయి. మిగతా రాజకీయ నాయకులతో దోస్తీ ఎలా ఉంది?
నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా.. మా మామగారు రోజు రాజకీయాల్లో ఉండటం నాకు సహాయంగా ఉంది. అప్పటినుంచే పలువురు నేతలతో మాట్లాడే వాడిని కావడంతో పెద్దగా ఇబ్బంది ఏమిలేదు. కెటిఆర్ గారి దిశానిర్దేశంతో ముందుకు వెలుతున్నా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ సహకరిస్తుండటంతో ఎన్నికల ప్రచారం సాఫీగా సాగుతుంది.

ప్రజల్లోకి ప్రచారానికి వెళుతున్నారు.. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
సిఎం కెసిఆర్ మంచి పాలన అందిస్తున్నారు. కెసిఆర్, కెటిఆర్, కవితగారి స్ఫూర్తితో పనిచేయాలని ముందుకువచ్చి ప్రజల వద్దకు వెలుతున్నాను. ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను గుర్తించి వారికి సేవ చేస్తూ వారికి అందుబాటలో ఉంటూ ప్రజాసేవకోసం పనిచేస్తానని వారికి హామీ ఇస్తున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా టిఆర్‌ఎస్ ఎంపిగా అందరి సహకారంతో గెలిచి కెసిఆర్, కెటిఆర్ బాటలో నడిచి ప్రజా సేవలో ఉంటానే నమ్మకం నాకుంది.

Marri RajaSekhar Reddy Interview with Mana Telangana Daily