Friday, January 27, 2023

ఆసుపత్రి- ఆశీర్వాదం

- Advertisement -

 

సుబ్బారావుగారింటికి ఓ పెద్దమనిషి వచ్చాడు. ఎనభై ఏండ్లు పై బడ్డ సుబ్బారావు గారు ఈ మధ్య మాట్లాడటమూ తక్కువే, వినిపించుకోవటమూ తక్కువే. (ఊహ ద్వారా వినటం అనేది వార్ధక్యంలో పై మెట్టు) ‘మా రాజశేఖర్‌కి పెళ్లి’ చిన్నగా కళ్లు ఆర్పారు సుబ్బారావుగారు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకున్నారు.
‘మా రాజశేఖర్‌కి పెళ్లి.’
‘మహారాజా? ఎవరు?’
‘కాదండీ. మా రాజశేఖర్ ఉన్నాడు చూసారూ…’, గొంతు పెంచారు.
‘ఆ ఆ…’. ఎవరో గిల్లినట్లు అరిచారు ఈయన.
‘పెళ్లి.’
‘ఆ…శుభం!.’
‘మీరు పెద్దవారు.’ అంతేనా అన్నట్లు, ఏవన్నావు అన్నట్లు చూసారాయన.
‘మీరు…’ చెవి దగ్గర చెయ్యి పెట్టారు.
‘నీళ్లు?…తాగుతారా?’
‘అయ్యో కాదండీ. పెళ్లికి రావాలి.’, చాలా గట్టిగా అరిచారు ఇద్దరూ.
‘ఓహో! తప్పకుండా.’
‘ఆశీర్వదించాలి.’
‘కాశీకా? ఈ ఏడాది వెళ్లలేదు.’
‘అయ్యో కాదండీ…’, మరల అరిచారు,’…
ఆశీర్వదించాలి!’, ఆవిడ అభినయం కూడా చేసింది.
చిరునవ్వు నవ్వాడు.
‘అలాగే!’ పెళ్లి వేల్టికైనా కనిపించారు అన్నట్లుగా నన్నెందుకో చూసారాయన.
***
సుబ్బారావుగారి పక్కన మరి నేనూ ఉన్నాను. పెద్దాయన నోరు వెళ్లబెట్టుకుని చూస్తున్నారు. మా ముందర ఉన్నవి రెండు- నాలుగు కెమెరాలు, నలభై నాలుగు కెమెరా మనుషులు. చేతిలో పెట్టిన పానీయాలు తాగుతూ వాళ్ల వీపులు మేము చూస్తున్నాం. పెళ్లి కూతురూ పెళ్లికొడుకూ వాళ్లకు ఎదురుగా ఉన్న కెమెరాలను చూస్తున్నారు. ఆరో ప్రాణం అయిన కెమెరా తతంగం అరుంధతీ నక్షత్రాన్నే మింగేసిన రోజులు!
భారతీయ సత్సంప్రదాయ జ్యోతిని రెండు చేతులతో కాపాడుకుంటున్న ప్రవచనం ఏదో చెవిలో పెట్టుకుని ఒకాయన కూర్చున్నాడు.
‘పెళ్లికొడుకుకి మేనమామను అవుతాను సార్…’, అన్నాడు. అందులో నవ్వే విషయం ఏదీ లేనప్పటికీ సుబ్బారావుగారు ఎందుకో నవ్వారు. ఈయన కనెక్ట్ కాలేదని అర్థమయింది.
‘మేనమామను ’, గట్టిగా అన్నాడు.
‘ఓనమాలు?’
‘అయ్యో కాదు సార్. అబ్బాయి…’
‘బాగున్నాడు.’
‘అబ్బాయికి మేనమామను!’ దాదాపు అరిచేసాడు.
‘శుభం.’
హమ్మయ్య అనుకుని తతంగం చూస్తున్నాడు. మొబైల్ స్పీకర్ ఆన్ చేసాడు ఇటు పక్కనాయన. అవతలి వాళ్లకి కావాలో అక్కరలేదో ఎవరికి అక్కరలేదు. వినిపించేస్తాం అంతే. వినిపిస్తోంది…
మొదటి మెట్టు, రెండవ మెట్టు, మూడవ మెట్టు, నాల్గవ మెట్టు, అయిదవ మెట్టు, ఆరవ మెట్టు, ఏడవ మెట్టు అల్లా ఇన్ని మెట్లు దాటి వెళ్లి ఆ చివరి మెట్టు దగ్గర అతను అల్లా కాలు మోపి ఇదేవిటీ అని నున్నగా ఉన్నదనుకుని జారి పడిపోయాడతను. అంచాత అదివరకు గతంలో నేను మనవి చేసుకున్నట్లు అన్నీ చక్కగా జరుపుకున్నామని మీరనుకుంటే ఎంతో పొరపాటు సుమండీ…నేనూ…’
‘అక్షతలంటే గొప్పగా వివరించారండీ…’
ఎంగిలి కాఫీ కప్పులూ పక్కన పెట్టి చేతులు కూడా కడుక్కోకుండా అక్షతలు పట్టుకునొచ్చాడు పైనుండి ఓ పెద్ద మనిషి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా అక్కరలేకుండా అందరి చేతుల్లో పోసేసాడు. వేదమంత్రాలతో జరిపే కార్యక్రమానికి ఏ పాటి గౌరవం ఇవ్వాలో ఎవరికీ అక్కరలేదు. అక్షతల గురించి ఎవరో చెబితే తెలుసుకునే దౌర్భాగ్యం అందరిదీనూ!
‘అందులో సైన్స్ గురించి చెబుతున్నారు…’, ఓ అమ్మాయి అంటోంది. శరీరంలోని కొన్ని భాగాలను పూర్తిగా కప్పుకునే అలవాటు ఎక్కడో పారేసారు. సరైన బొట్టు పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంది. వీళ్లకి సైన్సు కావాలి, సెన్సు అక్కరలేదు! ఆమె పక్కన ఓ కుర్రాడున్నాడు. భుజాలు బాగా ఊపుతున్నాడు. ‘అకే అకే…’అనేవి కెయ్ కెయ్ మంటున్నాయి. ‘బాగా చెబుతున్నాడు.’, అంటున్నాడు.
అందరూ రేషన్ షాపు ముందు గతంలో చక్కెర కోసం లైను కట్టినట్లు లైను కట్టారు. అక్కడ వధూవరుల మధ్య తెర ఉంది. అది ఎందుకని చర్చించుకుంటున్నారు మా పక్కనున్న యువజంట. అసలు ఈ కాలంలో అక్కరలేదేమో! కిందటి రోజున అడ్డమైన వాళ్ల చేతుల్లో చేతులు పెట్టి గోరింటాకులు పెట్టించుకుని జుగుప్స కలిగించే సినిమా పాటలకు బహిరంగంగా చిందులు వేసిన వీళ్లకి ఈ సంప్రదాయం ఎందుకో!
సుబ్బారావుగారు ధైర్యంగా లేచారు.
‘అక్షతలిచ్చారా?’
‘కక్షా? ఎందుకు? ఎవరి మీద?’
‘సార్, అక్షతలు. అక్షతలిచ్చారా?’
‘ఇచ్చారు కానీ ఆ ఇద్దరూ కాళ్లకి నమస్కారం చేసుకుని మీద చల్లించుకున్నారు.’
అటు తిరిగాను. కుర్రాడు నవ్వుతున్నాడు. ఎవరో సుబ్బారావుగారిని మెల్లగా పైకి తీసుకుని వెళుతున్నారు. నా పక్కనున్న వ్యక్తి అమ్మయిని అడుగుతున్నాడు,
‘ మీ ఇద్దరూ అన్నా చెల్లెళ్ల వరుస గదా?’
అమ్మాయి డెంటిస్టు కాబోలు, పళ్లికిలించింది. ‘అలా సంబంధం చేసుకోవటం తప్పు కదా?’
‘రెండేళ్లుగా చాటింగులో ఉన్నాం.’
‘అయితే?’ ‘చాటింగు చేస్తే చాలు, పెళ్లి చేసుకోవచ్చని చాటంటివారు చెప్పారు!.’
ఇది వింతగా ఉంది.
‘పెళ్లికి అందరూ వస్తే బాగుంటుంది.’, కుర్రాడు అంటున్నాడు. ‘ఓహో! మరి రెండేళ్లుగా ఎందుకు చెప్పలేదు?’
‘మా మనసులు కలిసాయి సార్. ఆ తతంగం అంతా కూడా మనసులు కలిసేందుకేనని చాలా మంది మైకుల్లో చెబుతున్నారు.’
‘అది అయిపోయాక పెళ్ళెందుకు?’
‘వేడుక ఉండాలి…’. అమ్మాయి చెబుతోంది,’…
మా గోత్రాలు కూడా కలిసాయి!’
‘మరి ఎవరూ చెప్పలేదా? తప్పని?’
‘ఇప్పుడే పెద్దాయన సుబ్బారావు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఆయన మరేం ఫరవాలేదని చెప్పారు!’
నేను లేచాను. ఆయనకు ఏం వినిపించిందో, ఏం చెప్పారో?
ఎంతో కష్టపడుతూ స్టేజ్ మీద నిలబడ్డారు సుబ్బారావు గారు. కెమెరా మనిషి అందరినీ తోసేస్తున్నాడు. ఎలాగో అలాగ వధూవరుల దగ్గరికి చేరారు. నేను స్టేజ్ కిందనున్నాను. ఎలా జారిపడ్డారో తెలియదు పాపం, సూటిగా నా మీదనే పడ్డారు!
***
డాక్టరు అన్ని రిపోర్ట్లూ చదివాడు.
‘టైం పడుతుంది…’, అన్నాడు,’…వయసు మీద పడింది కదా సార్, ఆరు నెలలు పడుకోవాలి.’
‘వయసు ఆయన మీద పడింది. ఆయన నా మీద పడ్డారు.’ ‘ఒకరి మీద ఒకరు పడటమే జీవితం. ఈ మందులు వాడండి.’, నవ్వుకుంటూ వెళ్లిపోయాడు డాక్టర్. ‘ఆశీర్వదించలేకపోయాను…’, అన్నారు సుబ్బారావుగారు.
‘అవును సార్, అన్నా చెల్లెళ్ల వరుస వాళ్లు వివాహం చేసుకోవచ్చా?’
‘కన్నా? నా కన్ను బాగానే ఉంది.’
తల పట్టుకున్నాను. గదిలోకి ఓ కుర్రాడొచ్చాడు. ఎక్కడో చూసినట్లుంది. మెడకి వాసుకి చుట్టుకున్నట్లు ఓ బెల్టు చుట్టాడు. ‘ఎలా ఉన్నారు సార్?’, అడిగాడు. నా వైపు తిరిగి నోరు తెరిచారు సుబ్బారావు గారు.
‘ఎవరబ్బాయి మీరు?’, అడిగాను.
‘సార్, నేను సుదర్శన్‌ని. మొన్న పెళ్లి జరిగింది నాకే!’
‘వామ్మో! నువ్వా? ఏవైంది మెడకి?’
‘తీవ్రంగా పట్టేసింది.’
‘ఎందుకలాగ?’ ‘ముందరేమో నెత్తి మీద చెయ్యి పెట్టినప్పుడు కలుక్కుమంది. పైగా ఆ కెమెరా వాడు అలా తల పెట్టు, ఇలా తిరుగు, ఇటే చూడు అన్నందుకు డైరెక్షన్ చేసి నాకు రెండో వివాహం చేసాడు. మెడ కాస్తా కలుక్కుని మూసుకుంది.!’
‘ఇవేంటి?’
‘అక్షతలు.’ ‘ఎందుకు?’
‘భారతీయ సంప్రదాయాన్ని మేము మరచిపోలేదు సార్! పెద్ద సార్ ఆశీర్వదించలేకపోయారు కదా? నాకు గుర్తుంది. ఇక్కడ ఎలాగో ఉన్నారు కదాని ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చాను!’
అతను నమస్కారం చేసుకున్నాడు. సుబ్బారావుగారు అతి కష్టం మీద ఆశీర్వదించారు.
‘అలాగే ఉండండి…’, అన్నాడు బిగుసుకుంటూ…,
‘ఓ సెల్ఫీ తీసుకుంటాను.’ అతను వెళ్లిపోయాక సుబ్బారావుగారు అడిగార్, ‘ఎవరతను? కాంపౌండరా?’
‘పెళ్లికొడుకు.’
‘కిళ్ళీయా? ఇప్పుడెందుకు?’

                                                                                                                     ~శ్రీ
                                                                                                              95151 27539

Marriage Comedy story in telugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles