Home ఆఫ్ బీట్ లగ్గం ముచ్చట్లు…!!

లగ్గం ముచ్చట్లు…!!

marriage-function

సుభద్రమ్మ మనుమని లగ్గానికచ్చింది. లగ్గమెక్కడనుకున్నరు హైదరాబాద్‌ల. మాదండి పట్నమాయె ఐద్రాబాద్. ఆమె ఇదువరకు గూడ హైద్రాబాద్ మావచ్చిందిగని లగ్గానికి రాలేదు. గీపట్నంల లగ్గం జూసుడు గామెకు గిదే మొట్టమొదటి మల్క. హోటల్ల లగ్గమాయె. దండిగ జేసిండు లగ్గం. మటన్, చికెన్ రకరకాల కూరలు, బువ్వలు మస్తు అలంకారాలు. లచ్చెలల్ల ఖర్సయింది. కని మూడు నాలుగు గంటలల్లనే అంతయిపెయింది. ఎక్కడోల్లక్కడ ఎల్లిపెయిరి. వెయ్యిల మంది బువ్వదిని పోట్వలు దిగి ఎటోల్లటు ఎల్లిపెయిరి. గిప్పుడు అతట గట్లనే నడుత్తది గని గీ హైద్రాబాద్‌లనయితే గంటల్ల కతం. లగ్గమయినంక అందరింటికచ్చిరి.

బిడ్డకొడుకు లగ్గం గద. మ్యానమామలు గూడచ్చిరి ఇంత దిని తెల్లారి ముచ్చట్లల్ల వడిరి. మనువన్ని మనుమరాల్ను దగ్గెరికి కూసోవెట్టుకున్నది సుభద్రమ్మ. ఇగ మేం పోతం బిడ్డా అను. ఏందే అమ్మమ్మ గట్లనవడ్తివి. వారం రోజులుండి పోలేవు అన్నడు అభి. అమ్మా నీకెప్పుడేగిర్తమే. ఎందుకే ఉరుకులాట. నాలుగొద్దులట్ల ఉప్పస లెక్క ఉండి పోలేవు. కన్నాగురంల ఏమున్నదని ఉరుకుతననవడ్తివి. ఏమున్నదంటె నా కొడుకుల్లేర. ఇల్లు లేద! పెండ్లికచ్చినం, ఇగ వోతం. ఇంకేంది అన్నది.

గట్లంటవేమె నువ్వేమన్న పరాయిదానివా? అట్లచ్చి ఇట్లురుకుటానికి అంది లక్ష్మి. అది గాదే అమ్మమ్మ మాతోదని వారంరోజులన్నుంటె నీకు మంచిగుంటది గద. వెయ్యిల మంది లగ్గానికచ్చిరి. తలువాలేసిరి. బువ్వదిని పోయిరి. నువ్వు గట్లనే పోతవా? సాకి. నేం గట్లనే పోకుంటె గిదేమన్న పల్లెటూరా! పట్నంల లగ్గాలు గంతేమరి. తలువాలు దులుపుకుంటరు. పెండ్లాన్ని సంకలవెట్టుకొని ఉరుకవుచ్చుకుంటరు. మా కాలంల నయితె పదారు రోజులు లగ్గం కార్యక్రమాలు అయ్యేటియి.

రొన్నెల్లు మొసమర్లకుంట పనులుండేటియి. గప్పుడు సిన్నప్పుడు లగ్గమాయె. మల్ల కాల్లగోల్ల కార్యక్రమం వేరే ఉండేది. సుట్టాల రాకట పోకట ముచ్చెట్లు.. లగ్గం సంబురాలు. బీంబాజులు, డప్పులు ఓ ఒగ వశెంగాదన్నట్టు.. అంది సుభద్రమ్మ.

గట్ల ఉబ్బిత్తవుగని గప్పటి లగ్గాలు ఎట్లుంటయో సెప్పక పోతివి. కొంచెమంత సెప్పలేవు అంది సాహిత్య. నేనేమన్న కథలు రాత్తనాయె లగ్గాలను కతోలెసెప్పుటానికి. మీ నాయిన్నంటె కతలు రాసె. గది గానే అమ్మమ్మ గిది సెప్పుటానికి కతలు రాయన్నాయె. మా తాత గూడ పద్యాలు రాసెటోడట గద. కవి పెండ్లానివి గద. ఇగ నువ్వు గా లగ్గం ముచ్చెట్లన్న సెప్పలేవు అన్నడు అభి. డ్బ్భై ఐదేండ్లు దాటినా తాతపేరు తీసెవరకు బోలబోలనవ్వింది. ఇగ నన్ను పోనియ్యరా! సరెపటు గప్పటి లగ్గాల ముచ్చెట్లు సెప్పుతినుండ్రి. గివ్వి తెలిత్తే ఎట్టుండెనో లగ్గాలు తెలుత్తయి అని సెప్పుడు మొదలువెట్టింది సుభద్రమ్మ.

మా కాలంల లగ్గాలు సిన్నప్పుడే అయ్యేటియి. ఐదారేండ్లు పోరగాండ్లకు, ఆడిపిల్లలకు లగ్గాలు జేత్తురు. కొందరయితె పాలు మరువని పొల్లగాండ్లకు గూడ లగ్గాలు జేత్తురు. గట్ల ఎందుకు జేత్తురంటె గదో మూఢనమ్మకమే. ఆడిపిల్లకు సముర్తయినంక లగ్గం జేత్తే తప్పని అందురు. పసిపిల్లకే లగ్గం. సముర్తాయె దాకుంచుతె గంగల ఇల్లు కట్టుకోన్నందురు. ముప్పయేండ్ల పడుసోనికి మూడేండ్ల పిల్లనే ఇచ్చెటోల్లు. మా నాయిన్నంటె అప్పుడే కొంచెం తెలివికల్లోడు. మా అన్న బడిపంతులాయె పటికి నాకు సిన్నప్పుడేం లగ్గం జెయ్యలేదు. గప్పుడు పిల్లం జూసుటానికి పొయ్యేటోల్లు. పిల్లోల్లు పినుమన్ని సూసుటానికి పొయ్యేటోల్లు.

గతుకుతె అతుకదని గాల్లింట్ల తినద్దు అనెటోల్లు. మాట ముచ్చెట అన్నీ అయ్యి సంబంధం కుదిరితేనే తినెటోల్లు. ఊళ్ళె గప్పుడు హోటళ్ళెక్కడియి? ఇంట్లనన్న తినిపోదురు. గట్లుండె ఏడేడుతరాల ఆచారాలు, వివరాలు, కులం, చరిత్ర సూసెటోల్లు. కట్నాలు మా ఉండెగని సాన తక్వ. గది ముఖ్యం గాదు. కుటుంబం సంగతి జూసి పిల్లనచ్చితే సేసుకునేటోల్లు. ఓపారి వరపూజ, అటెనుక లచ్చిం పూజ, మాట ముచ్చెట. కట్న కానుకల గురించి మాట్లాడుకునుడు. తల్లిదండ్రులు సూసిన పిల్లనో పిలగాన్నో సేసుకునెటోల్లు. గప్పట్ల బావను ఎదురుంగ సూడకపోదురు. ఎదురత్తె దూరం బోదురు. ఇంట్ల అత్త పోరుండె. ఆడిబిడ్డ పోరుండె.

ఇంటి పెద్ద కోడలు మీన భారముండేది. లగ్గం బెట్టుకున్నరంటె ఇగ ఒగ పనులు గాదు. వడ్లు గిర్ని పట్టిచ్చి బియ్యం తయారు జేసుకోవాలె. పప్పులు దంచుకోవాలె. కారప్పొడి కొట్టియ్యాలె. నూనె గానుగ వట్టియ్యాలె. గిర్నీలు రాకముందయితె రోకండ్లతోని వడ్లు దంచుడే దంచుడు. నగలు జేయించాలె. అవుసలోల్ల ఇంట్ల కూసొని సేయించుడాయె. పందిర్లేయించాలె. బట్టలు కొనాలె. మంగలయినెను, సాకలయినెను పిలిసి సుట్టాలు పక్కాలు ఊరోల్లు, కులపోల్లకు పెండ్లి సంగతి సెప్పిరావాలె. గాల్లను పయినం పంపియ్యాలె. లగ్గానికి తరిలిపోవాలె. మా అప్పుడు పదారు రోజుల లగ్గముండె. మొదటిరోజు లగ్గం.

మూడు పూటల భోజనాలు. నాలుగో రోజు నాగెల్లి. నల్లపూసలు గుచ్చే పదారు పండుగ పదారో రోజున, పదిగేడు రోజుల ముందు నుంచే సూట్టాలచ్చెటోల్లు. అన్ని పనులల్ల ఆదుకుందురు. ఇంటి సుట్టు పక్కలోల్లు, కులపోల్లు అన్ని పనులు సేసెటోల్లు. గప్పుడు ఊరోల్లయితె లడ్డూల పడుదురు. సకినాలు జేత్తురు. లగ్గంల ఆడిబిడ్డలకు, సుట్టపోల్లకు, దగ్గెరోల్లందరికి బట్టలు వెట్టెటోల్లు. గొర్రె కూరతోని విందులు, ఓ పూట పప్పు దప్పుడం. కల్లు దావతయితె తప్పకుండ ఉండేటిది. కల్లు దాగి కొట్టుకుంటున్నరని గది అటెనుక బందు జేసిండ్రు. బంతులుగా కూసుండబెట్టి మాంసం, కూరలు వడ్డిత్తురు. ఎవ్వలకన్న ముక్కలు తక్వవడితె కుల తప్పు. అందరికి సమానంగ ఎయాలేనన్నట్టు. ఎయ్యకుంటె పంచాయితులు. సాలోల్లండ్ల గీ పంచాయితులెక్కువయ్యేటియి. మాంసంతోని విందయితె తప్పకియ్యాలె.

మీ అమ్మ లగ్గం గూడ మస్తుగయింది బిడ్డ. మీ తాత సదువుకున్నోడే అయినా విజ్జవ్వ లగ్గం పద్నాలుగేళ్ళకే సేసిండు. పసిపోరేకని ఊల్లె సదువులేదని వేరే ఊరికి పంపుడెందుకని లగ్గం జేసిండు. పల్లకిల కూసుండి నా బిడ్డ మస్తు సంబురపడె. ఆకుపోకలిచ్చెటప్పుడు గదేందో దానికి తెల్వది. సెయ్యితోని గుంజిపారేసె. మీ అమ్మ లగ్గానికి అరవై కచ్చురాల్ల మందచ్చిండ్రు. ముంగట ఓ గుర్రం. గుర్రంమీన మారం వెంకటయ్య. మొత్తం వరిగడ్డి వామంత ఎడ్లుమేసుటానికాయె.

గప్పుడు లగ్గం నాడు ఏడు గొర్లు కోసినం. లడ్డూలు సేసినం. సకినాలు జేసినం. గప్పుడు మన కులంల ఎవ్వలియ్యలేదు పదివేల కట్నం. పదివేల కట్నమిచ్చింది మీ నాయిన్న బాపుకు నూట పదార్లిచ్చి ఆవుల్యాగనిచ్చిండ్రట. మీ నాయిన్నకు పదివేల నూట పదార్లిచ్చి ఆవుల్యాగనిత్తన్నం కని ఇయ్యాలె. సదువుకునెటోల్లకెందుకని ఊకున్నం. మరి నీకిప్పుడు లచ్చెలల్ల ఖర్సాయె. నా అప్పుడు దాదాపు నెల రోజులు లగ్గం సంబురాలు నడిత్తె మీ అమ్మకాలంల పదిరోజులు లగ్గం సంబురాలు. నీ కాలంల గంటలల్ల ఐపోతది. కాకపోతె తెల్లారి ఇంత రిసిప్షనో, సత్యనారాయణ సామి నోమో ఉంటది గప్పుడు సిన్నప్పుడు లగ్గాలు పెద్ద మనిషయినంక కాళ్ళ గోళ్ళుండె. గిప్పుడు లగ్గమయి తెల్లారే కాల్లగోళ్ళాయె అంది సుభద్రమ్మ.
కాళ్ళగోళ్ళందేందే అమ్మమ్మ. గదినేం జెప్ప. ఎవ్వలనన్న అడుగు. అంది సుభద్రమ్మ. శనార్తి.