Home తాజా వార్తలు మందగమనాన్ని అధిగమించాయ్

మందగమనాన్ని అధిగమించాయ్

car sales

 

న్యూఢిల్లీ: డిసెంబర్‌లో నెలలో పలు కంపెనీ వాహన విక్రయాలు మెరుగయ్యాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల వాహన సేల్స్ పెరిగాయి. మరోవైపు హుందయ్, టొయొటా కంపెనీలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

ఎం అండ్ ఎం స్వల్ప వృద్ధి
మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు డిసెంబర్‌లో 1 శాతం మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం 37,081 యూనిట్లుగా ఉండగా, గతేడాదిలో 36,690 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది చివరి నెల డిసెంబర్‌లో సేల్స్ విషయంలో తమ పనితీరు మెరుగ్గా ఉందని, ప్రస్తుతం మొత్తం నిల్వ స్థాయిలో సౌకర్యంగా ఉన్నామని ఎం అండ్ ఎం చీఫ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) విజయ్ రామ్ నక్ర అన్నారు. కొత్త సంవత్సరంలో బిఎస్6 వాహనాల విషయంలో మరింత వేగం పెంచుతామని, వచ్చే మూడు నెలల్లో మార్పు దిశగా మరిన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

హుందయ్ సేల్స్‌లో క్షీణత
హుందయ్ సేల్స్ డిసెంబర్‌లో 9.8 శాతం తగ్గాయి. గత నెలలో విక్రయాలు 37,953 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సేల్స్ 42,093 యూనిట్లుగా ఉన్నాయి. 2019లో దేశీయ అమ్మకాలు 7.2 శాతం క్షీణించాయి. 2019 సంవత్సరంలో 5,10,260 యూనిట్లుగా ఉండగా, 2018 ఇదే సమయంలో ఈ సేల్స్ 5,50,002 యూనిట్లుగా ఉన్నాయి. హెచ్‌ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్ మార్కెటింగ్, సర్వీస్) తరుంగ్ గార్గ్ మాట్లాడుతూ, 2019 దేశీయ వాహన పరిశ్రమకు సవాళ్ల సంవత్సరంగా ఉందని అన్నారు. దారుణ పరిస్థితుల్లో హుందయ్ మోటార్స్ ఇండియా వివిధ సెగ్మెంట్లలో 4 కొత్త బెంచ్‌మార్క్ ప్రోడక్ట్‌లను లాంచ్ చేసింది.

టొయొటా కిర్లోస్కర్ మోటార్
డిసెంబర్ నెలలో టొయొటా కిర్లోస్కర్ మోటార్స్ దేసీయ అమ్మకాలు అత్యంతగా 45 శాతం పడిపోయాయి. 2019 డిసెంబర్‌లో సేల్స్ 6,544 యూనిట్లు మాత్రమే నమోదవగా, 2018 సంవత్సరంలో ఈ విక్రయాలు 11,836 యూనిట్లుగా ఉన్నాయి. 2019లో కంపెనీ దేశీయ అమ్మకాలు 16.36 శాతం తగ్గాయి. 2019 సంవత్సరంలో సేల్స్ 1,26,701 యూనిట్లుగా ఉండగా, 2018 సంవత్సరంలో ఈ విక్రయాలు 1,51,480 యూనిట్లుగా ఉన్నాయి. టొయొటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, పరిశ్రమలో మందగమనం ఉన్నప్పటికీ రిటైల్ సేల్స్ సానుకూలంగా కొనసాగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. కొన్ని సెగ్మెంట్లను ఆశించిన మేరకు సేల్స్ వృద్ధి లేదని అన్నారు.

ఎంజి మోటార్స్ శుభారంభం
2019 డిసెంబర్‌లో ఎంజి మోటార్స్ ఇండియా విక్రయాలు 3,021 యూనిట్లు నమోదు చేశాయి. ఎంజి మోటార్ ఇండియా డైరెక్టర్(సేల్స్) రాకేశ్ సిదానా మాట్లాడుతూ, హెక్టార్‌తో భారత మార్కెట్లోకి ప్రవేశించిన తమకు వేగవంతమైన విక్రయాలు నమోదు కావడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు.

మారుతీ సేల్స్ 2.4 శాతం జంప్

గతేడాదిలో మందగమనం ప్రభావం నుంచి బయటపడి మారుతీ సుజుకీ మంచి విక్రయాలను నమోదు చేసింది. డిసెంబర్‌లో మారుతీ దేశీయ అమ్మకాలు 1,21,479 యూనిట్ల నుంచి 1,24,375 యూనిట్లకు చేరాయి. మొత్తంగా 2.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో కాంపాక్ట్ సెగ్మెంట్‌లో న్యూ వాగనర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల సేల్స్ 65,673 యూనిట్లతో 27.9 శాతం వృద్ధిని చూపాయి.

అయితే, గతేడాది (2018) డిసెంబర్ నెలలో వీటి సేల్స్ 51,346 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. జిప్సీ, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, ఎస్‌క్రాస్, విటారా బ్రెజ్జా సహా యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాలు 17.7 శాతం పెరిగాయి. గతేడాదిలో 20,225 యూనిట్ల నుంచి 23,808 యూనిట్లకు పెరిగాయి. అలాగే ఆల్టో, ఎస్‌ప్రెస్సో, ఓల్డ్ వాగనర్ వంటి మినీ సెగ్మెంట్ సేల్స్ 13.6 శాతం క్షీణించాయి. గతేడాది వీటి అమ్మకాలు 27,649 యూనిట్ల నుంచి ఈసారి 23,883 యూనిట్లకు తగ్గాయి.

Maruti Suzuki car sales grow 2.4% in December