Home తాజా వార్తలు మారుతీలో కూడా ‘బై నౌపే లేటర్’ఆఫర్

మారుతీలో కూడా ‘బై నౌపే లేటర్’ఆఫర్

Maruti Suzuki cars with Buy Now Pay Later option

 

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మహీంద్రా, మహీంద్రా తరహాలోనే ఈ సంస్థ కూడా ‘బై నౌపే లేటర్’ఆఫర్‌ను తీసుకు వచ్చింది. కరోనా సంక్షోభంలో ఇబ్బంది పడుతున్న వినియోగదారులు కూడా సులభంగా కారును కొనుగోలు చేసేందుకు సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకుగాను చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్సింగ్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. కోవిడ్19, లాక్‌డౌన్ కారణంగా ద్రవ్య లభ్యత కొరతను ఎదుర్కొంటున్న కొనుగోలుదారులే లక్షంగా దీన్ని తీసుకు వచ్చామని మారుతి సుజుకి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( మార్కెటింగ్, సేల్స్)శవాంక శ్రీవాస్తవ తెలిపారు.

వెంటనే అదనపు ఒత్తిడి లేకుండా కారు కొనుగోలుకు ఇది ప్రోత్సహిస్తుదన్నారు. కాగా వినియోగదారులకు ప్రయోజనాలు చేకూర్చడమే ఈ ఒప్పందం లక్షమని చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర కుందు చెప్పారు. ఈ పథకంలో వినియోగదారులు కారును కొనుగోలు చేసిన రెండు నెలల తర్వాతే ఇఎంఐలు చెల్లించడం మొదలు పెట్టవచ్చు. దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి ఔట్‌లెట్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని మారుతి ఆ ప్రకటనలో తెలిపింది. జూన్ 30తో ఈ ఆఫర్ గడువు ముగుస్తుంది.

Maruti Suzuki cars with Buy Now Pay Later option