Home తాజా వార్తలు అంచనాలను అందుకున్నా.. లాభాలు తగ్గాయి

అంచనాలను అందుకున్నా.. లాభాలు తగ్గాయి

Maruti Suzuki

 

క్యూ1లో మారుతీ లాభం రూ.1,018.63 కోట్లు
గతేడాదితో పోలిస్తే 27 శాతం తగ్గింది
14 శాతం క్షీణించిన నికర అమ్మకాలు

న్యూఢిల్లీ: జూన్ ముగింపునాటి తొలి త్రైమాసికం(ఏప్రిల్‌- జూన్)లో మారుతి సుజుకి మార్కెట్ల అంచనాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే లాభాలు క్షీణించాయి. ఏడాది నుంచి ఏడాది ప్రాతిపదికన చూస్తే సంస్థ నికర లాభం 27.33 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రూ.1,435.50 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే రూ. 1,350 కోట్ల లాభాన్ని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా, దీని కంటే అధికంగా లాభాలు ఉండడం గమనార్హం. తక్కువ అమ్మకాల పరిమాణం, అధిక తరుగుదల ఖర్చు, ముడి ఉత్పత్తుల ధరల పెరగడం వంటి అంశాలు కంపెనీ లాభాలను దెబ్బతీశాయి. ఫలితాలు వెల్లడికాకముందు మార్కెట్లో షేరు విలువ రూ.5,700 దిగువకు పడిపోయింది. అయితే ఫలితాల వెల్లడి తర్వాత 2.5 శాతం లాభంతో రూ. 5,900పైకి ఎగబాకింది. చివరకు ఎన్‌ఎస్‌ఈలో 0.85 శాతం లాభంతో రూ. 5,805 వద్ద ముగిసింది.

ఆదాయాలు
ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన రూ .22,459.40 కోట్లతో పోలిస్తే 12.19 శాతం క్షీణించి రూ.19,719.80 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో మారుతీ సుజుకి ఇతర ఆదాయాలు 207.72 శాతం పెరిగి రూ.834.40 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 271.80 కోట్లను నమోదు చేసింది.

అమ్మకాలు
కంపెనీ అమ్మకాలు 17.9 శాతం తగ్గి మొత్తం 4,02,594 యూనిట్లుగా నమోదైనాయి. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 19.3 శాతం తగ్గి 3,74,481 యూనిట్లుగా, ఎగుమతులు 28,113 యూనిట్లుగా ఉన్నాయి. ఈ త్రేమాసికంలో ఇబిఐటిడి రూ.2,047.80 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు సంవత్సరానికి 450 బేసిస్ పాయింట్లు పడిపోయి 10.40 శాతంగా నమోదయ్యాయి.

వ్యయాలు
కంపెనీ వ్యయం రూ .18,645.30 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయం రూ.19,848.80 కోట్లుగా ఉంది. ఉద్యోగుల ఖర్చులు 12.27 శాతం పెరిగి రూ .859.10 కోట్లకు చేరుకుంది. తరుగుదల, రుణ విమోచన ఖర్చులు గత ఏడాది ఇదే కాలంలో రూ .719.80 కోట్లుగా ఉండగా ఈ త్రైమాసికంలో రూ. 918.60 కోట్లకు చేరాయి.

Maruti Suzuki Q1 profit declines 27.3% to Rs 1,435 crore