Home తాజా వార్తలు ఉత్పత్తి నిలిపివేత

ఉత్పత్తి నిలిపివేత

Maruti-Suzuki

 వాహన సంస్థలపై కరోనా ఎఫెక్ట్
మారుతీ సుజుకీ హర్యానా ప్లాంట్ మూసివేత
హీరో, ఫియట్ కార్యకలాపాలూ 31 వరకు రద్దు

ముంబై: కరోనా వైరస్ ప్రభావం వాహన సంస్థలపైనా పడింది. టూవీలర్, త్రీవీలర్ కంపెనీలు తయారీ కేంద్రాల్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, ఫియట్, అలాగే టూవీలర్ సంస్థ హీరో కంపెనీ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలివేస్తున్నట్టు ప్రకటించాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం, వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

మారుతీ సుజుకీ

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) తన హర్యానాలోని తయారీ కేంద్రంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి భయాల కారణంగా ఉత్పత్తి, ఆఫీస్ కార్యకలాపాలను మూసివేశామని సంస్థ తెలిపింది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాలను వెల్లడించింది. గుర్గావ్, మానెసర్, హర్యానాలో కార్యకలాపాల నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. కోవిడ్19 వ్యాప్తికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను మారుతీ కంపెనీ సూచించింది. తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలని, శానిటైజేషన్ వినియోగించాలని, టెంపరేచర్ తనిఖీ చేయాలని పేర్కొంది.

వీడియో కాన్ఫరెన్స్‌లను పెంచాలని, ఉద్యోగులు పర్యటనలు రద్దు చేసుకోవాలని, సమూహంలో ఉండరాదని, విధిగా ప్రభుత్వ సూచనలను పాటించాలని కంపెనీ ఉద్యోగులకు తెలియజేసింది. ఈ మూసివేత ఎంత కాలం ఉంటుందనేది ప్రభుత్వ విధానాల ఆధారంగా ఉంటుందని సంస్థ తెలిపింది. తదపరి చర్యగా ప్రభుత్వం ఉత్పత్తులను నిలిపివేయాల్సిన అవసరం ఉండనుందని, అందుకే కంపెనీ ఉత్తత్తులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. రోహ్తక్‌లో మారుతీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డి) కేంద్రం కూడా మూసివేయనున్నారు. కంపెనీకి చెందిన హర్యానాలోని రెండు ప్లాంట్లలో వార్షికంగా 15.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థం ఉంది.

ఫియట్

అమెరికా కార్ల తయారీ సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్‌సిఎ) కూడా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 31 వరకు పశ్చిమ భారత రాష్ట్ర మహారాష్ట్రలో ప్లాంట్‌లో ఉత్పత్తిని రద్దు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. పుణెలోని ప్లాంట్ ఉద్యోగులకు మూసివేసిన రోజుల వేతనాలను చెల్లిస్తామని ఫియట్ ప్రకటించింది. భారత్‌లో ఇప్పటివరకు 324 మందికి కరోనా సోకగా, నలుగురు మృతి చెందినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో మహారాష్ట్రలోని ఆర్థిక రాజధాని ముంబై, పుణె, నాగ్‌పూర్‌లో షాపులు, కార్యాలయాలను మార్చి 31 వరకు మూసివేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్పిస్తే మిగతా అన్ని మూతపడ్డాయి. కాగా కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్రంలోని కారు ఫ్యాక్టరీలో కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారంనాడే టాటా మోటార్స్ లిమిటెడ్ ప్రకటించింది. అమెరికా, కెనడా, మెక్సికోలో ప్లాంట్లను మూసివేస్తున్నట్టు గతవారమే ఫోర్డ్ మోటార్, జనరల్ మోటార్‌తో పాటు ఫియట్ ప్రకటించింది. ఈ కేంద్రాల్లో దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

హీరో మోటార్స్ కూడా..

కరోనావైరస్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ (హెచ్‌ఎంసిఎల్) తన తయారీ, అసెంబ్లీ ప్లాంట్లన్నింటినీ తక్షణమే మూసివేయాలని నిర్ణయించింది. కంపెనీ నిర్ణయం భారతదేశం, కొలంబియా, బంగ్లాదేశ్‌లోని అన్ని ప్లాంట్లకు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ నెల చివరి వరకు ఈ నిర్ణయం అమలు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆదివారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు హీరో మోటోకార్ప్ ఇచ్చిన సమాచారంలో ఇతర విధులు, ప్రదేశాలలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తూనే ఉంటారని తెలిపింది. దీనిలో జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి) ఉద్యోగులు కూడా ఉన్నారు. అత్యవసర సేవలందించే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించదని కంపెనీ తెలిపింది. కరోనావైరస్‌పై పరిస్థితిని పర్యవేక్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

నేటి నుంచి టాటా పుణే ప్లాంట్ మూసివేత

మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున టాటా మోటార్స్ లిమిటెడ్ పుణే ప్లాంటును మూసివేయాలని నిర్ణయించింది. మార్చి 23(సోమవారం) నాటికి పుణే ప్లాంట్‌లో అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేస్తామని, మార్చి 24(మంగళవారం) నుంచి ప్లాంట్‌ను మూసివేస్తామని సంస్థ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంటి నుంచే పని

కరోనావైరస్ వ్యాప్తి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది దేశీయ, విదేశీ ఆటో తయారీ సంస్థ తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరాయి. ఈ సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎఫ్‌సిఎ ఇండియా, వోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియాతో సహా అనేక ఇతర వాహన కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని కోరాయి.

Maruti Suzuki suspends production