Home జాతీయ వార్తలు చైనా తీరు ఇలాగే ఉంటే ‘ఇతర చర్యలు’ తప్పవు

చైనా తీరు ఇలాగే ఉంటే ‘ఇతర చర్యలు’ తప్పవు

Masood Azhar

వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్నిఅడ్డుకునే చర్యలను చైనా ఇలాగే కొనసాగించిన పక్షంలో భద్రతామండలిలోని బాధ్యతాయుత సభ్య దేశాలు ఇతర చర్యలు తీసుకోవలసి వస్తుందని భద్రతామండలిలోని దౌత్యవేత్తలు హెచ్చరించారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని బుధవారం నాడు చైనా సాంకేతిక పరమైన కారణాలతో అడ్డుకోవడంపై భద్రతామండలిలోని ఇతర సభ్య దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఈ దౌత్యవేత్త మాటల్లో స్పష్టమవుతూ ఉంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పెంచి పోషించిన మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి గత పదేళ్లలో చేసిన నాలుగు ప్రయత్నాలను చైనా ఇప్పటివరకు అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన 1267 ఆంక్షల కమిటీ కింద ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలయిన ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లు గత నెల 27న ప్రతిపాదించాయి. ‘అయితే అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చేసే ప్రయత్నాలను చైనా గనుక ఇదే విధంగా అడ్డుకుంటూ ఉంటే మిగతా బాధ్యతాయుత సభ్య దేశాలు ఇతర చర్యలు తీసుకునే విషయం గురించి ఆలోచించక తప్పదు’ అని ఒక దౌత్యవేత్త తీవ్రస్వరంతో హెచ్చరించారు.

చైనా నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్, తమ దేశ పౌరులపై దాడులతో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠాల నేతలను చట్టం ముందు నిలబెట్టడానికి అన్నిమార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారని, భద్రతా మండలి తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చకుండా కమిటీని చైనా అడ్డుకోవడం భావ్యం కాదని మరో దౌత్యవేత్త అన్నారు. తమ గడ్డపైనుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర ముఠాలను, ఉగ్రనేతలను కావాడుకోవడానికి చైనాపై అధారపడుతున్నదుకు పాకిస్తాన్‌ను కూడా ఆ దౌత్యవేత్త తప్పుబట్టారు. కాగా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి తీరాల్సిందేనని, లేని పక్షంలో శాంతి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని అమెరికా స్పష్టం చేసింది. భద్రతామండలిలో తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాబర్ట్ పల్లాడినే ఈ మేరకు వ్యాఖ్యానించారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి తగిన ఆధారాలున్నాయని కూడా ఆయన అన్నారు.

మరో వైపు చైనా చర్యలను అమెరికా కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. చైనా చర్య ఏ విధంగాను సమర్థనీయం కాదని వారన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు మధ్య సమావేశం తర్వాత చైనా ఈ పని చేసి ఉండాల్పింది కాదని పలువురు అమెరికా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.
సమర్థించుకున్న చైనా
బీజింగ్: అయితే చైనా మాత్రం తన చర్యను గట్టిగా సమర్థించుకుంటూ. అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి సంబంధిత పక్షాల మధ్య మరిన్ని చర్చలు జరిగేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది.గురువారం బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో విలేఖరులు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్‌నుఎందుకు చైనా ఈ తీర్మానాన్ని అడ్డుకుందని ప్రశ్నించగా, తమ ప్రభుత్వ నిర్ణయం కమిటీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని ఆయన చెప్పుకున్నారు.‘ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించగలదు. ఈ సమస్యను సరయిన విధంగా హ్యాండిల్ చేయాలని భారత్ సహా అన్ని పక్షాలను సమన్వయపరిచేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని కూడా ఆ ప్రతినిధి అన్నారు.
మోడీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు: రాహుల్
కాగా ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. మోడీ బలహీనుడని, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అంటే ఆయనకు భయమని అన్నారు.‘ బలహీనమైన మోడీ జిన్‌పింగ్‌ను చూసి భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే మోడీ ఒక్కమాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో (నరేంద్ర మోడీని ఉద్దేశించి) దౌత్యం ఎలాంటిదంటే…1. గుజరాత్‌లో జిన్‌పింగ్‌తో కలిసి పర్యటిస్తారు, 2. ఢిల్లీలో జిన్‌పింగ్‌ను హగ్ చేసుకుంటారు, 3. చైనాలో జిన్‌పింగ్ ముందు తలవంచుతారు’ అని రాహుల్ ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
దేశం బాధపడుతుంటే మీకు సంతోషమా?: బిజెపి
కాగా, రాహుల్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తప్పు బట్టింది. చైనా చర్యతో దేశమంతా బాధపడుతుంటూ రాహుల్ మాత్రం సంతోషంతో పండడ చేసుకుంటున్నటల్గు ఆయన వ్యాఖ్యలున్నాయని బిజెపి న్రేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు రాహుల్ వ్యాఖ్యలు చూస్తుంటే అజర్ మసూద్‌కు ఆయనకు దగ్గరి సంబంధాలున్నట్లు అనిపిస్తోందని కూడా అన్నారు. చైనాతో విభేదాలను తగ్గించుకోవడానికి భారత్ ప్రయత్నించిందని మోడీ దౌత్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రవిశంకర్ అన్నారు. అయితే ఉగ్రవాదంపై పోరు విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Masood Azhar should be declared an international terrorist