Home జనగామ జనగామ పట్టణంలో దొంగల హల్‌చల్…

జనగామ పట్టణంలో దొంగల హల్‌చల్…

Massive Theft in two houses

 

జనగామ క్రైం : జనగామ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు హల్‌చల్ చేశారు. పట్టణంలోని బస్ డిపో వెనుక వైపు ఉన్న శ్రీ హర్షనగర్‌ కాలనీ, వాసవీకాలనీల్లో దొంగలు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం… పట్టణంలోని బస్ డిపో వెనకవైపు ఏకశిల పాఠశాల పక్క వీధిలో ఉన్న వాసవి కాలనీలో ఆదివారం తెల్లవారుజామున రాసాల బాలరాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో దొంగలు ప్రవేశించి రూ.1.30 లక్షల నగదు, 13 తులాల బంగారు నగలు, 45 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాలరాజు కటుంబంతో సహా బందువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. కాగా బాలరాజు వెనకవైపు ఉన్న మరో ఉపాధ్యాయుడు రాజేందర్ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వరండాలోకి చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, భుజాలకు బ్యాగ్‌లు వేసుకొని కనిపించారు. దీంతో దొంగలుగా భావించిన రాజేందర్ బాలరాజుకు చరవాణి ద్వారా దొంగలు వచ్చారని చెప్పాడు.

అయితే బాలరాజు తాను హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపారు. దీంతో రాజేందర్ కొందరు కాలనీవాసులను అప్రమత్తం చేసి దొంగలు అని అరవడంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కాలనీకి చేరుకున్నారు. అయితే అప్పటికే దొంగలు పారిపోగా తీరా కాలనీవాసులు, పోలీసులు చూసే సరికి బాలరాజు ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బాలరాజుకు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటీనా జనగామకు చేరుకున్నారు. ఇళ్లు తెరచి చూడగా బీరువాల తాళాలు పగులగొట్టి ఉండటం, సామాను చిందరవందరగా పడేసి ఉన్నాయి. వాసవికాలనీ ఎదుట ఉన్న శ్రీహర్ష కాలనీలో స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న వాకిటి కృష్ణారెడ్డి ఇంట్లో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. కృష్ణారెడ్డి కుటుంబం రాత్రి ఇంటికి తాళం వేసి పైపోర్షన్‌లో నిద్రిస్తుండగా  దొంగలు ఇంటి తాళం పగులగొట్టి 6 తులాల బంగారు నగలతోపాటు 8 తులాల వెండి పట్టీలను అపహరించుకుపోయారు. అంతేకాకుండా ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్‌ను ఇద్దరు దొంగలు తాగి అక్కడే పడేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు.

ఈ మేరకు ఉదయం పోలీసులు సమాచారంతో వరంగల్ నుంచి క్లూస్‌టీమ్ సభ్యులు జనగామకు చేరుకొని చోరీ జరిగిన బాలరాజు, కృష్ణారెడ్డి ఇళ్లలో వేలిముద్రల ఆనవాళ్లు తీసుకున్నారు. చోరీ ఘటనను నిశితంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. చోరీ జరిగిన వాసవి కాలనీల్లోని బాలరాజు, కృష్ణారెడ్డి ఇల్లను స్థానిక ఎసిపి వినోద్‌కుమార్, సిఐ మల్లేశ్ తదితరులు సందర్శించి చోరీ ఘటనను పరిశీలించారు. క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించుకొని త్వరలో చోరీకి పాల్పడిన వారిని పట్టుకుంటామని సిఐ తెలిపారు. కాగా పట్టణంలో హన్మకొండ ప్రధాన రహదారికి పక్కగా, పట్టణం నడిబొడ్డున ఉన్న వాసవి, శ్రీహర్ష కాలనీల్లో దొంగలు తెల్లవారుజామున చోరీలకు పాల్పడటం పట్ల పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట పోలీసులు గస్తీ మరింత పెంచాలని, చోరీల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Massive Theft in two houses at Jangaon District