Friday, March 29, 2024

8 గంటలకు ఎసరు!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కార్మికవర్గం చికాగో కార్మికుల త్యాగాలను స్మరించుకొనే పోరాట దినోత్సవాన్ని 137వ సారి మే 1న జరుపుకోబోతున్నది. భారతదేశంలోని కార్మికులు పారిశ్రామిక కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, అసంఘటిత రంగ కార్మికులు ఉన్న గ్రామ గ్రామాల్లో సంఘాలకు అతీతంగా ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవాన్ని మే 1న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జెండావిష్కరణలు సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మేడేను జరుపుతున్న సంఘాలలో దానిని ఒక వేడుకగా, పండుగలా చేసి చాక్లెట్లు, స్వీట్లు పంచుకొనే వారు ఉన్నారు.ఇది కార్మికులకు మేడే పోరాట చరిత్రను తెలియకుండా చేయడం అవుతుంది.కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన పాలకులు తమ బాద్యతను విస్మరించి నష్టం చేస్తున్న ప్రభుత్వాలు మేడే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి కార్మికులు వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని సందేశాలు ఇస్తున్నారు.

1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో హె మార్కెట్ వద్ద కార్మికులు 12 గంటల పనిదినానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పనికోసం,మెరుగైన వేతనాలు, చట్టాలు, సౌకర్యాల కోసం ఉద్యమించారు. చికాగో నగరంలో కార్మికులు చేస్తున్న విరోచిత సమ్మెను అణిచివేసేందుకు పెట్టుబడిదారుల పక్షాన ప్రభుత్వం పూనుకుంది. ఎనిమిది గంటల పని దినాన్ని, కార్మికుల డిమాండ్లను సహించలేని పాలకులు ఉద్యమిస్తున్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురు కార్మికులను బలితీసుకుంది.ఈ దారుణ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా కార్మికులలో నిరసన వ్యక్తం కావడంతో పోరాటoలో అమరులను స్మరించుకొనేందుకు దానిని స్ఫూర్తిగా తీసుకోవాలని 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.నాటినుండి ప్రపంచంలోని అన్నిదేశాలు మే1నప్రపంచకార్మికదినోత్సవాన్ని(మేడే) జరుపుకుంటూ నాటి పోరాట వీరుల త్యాగాలను స్మరించుకోవడం జరుగుతుంది.

8 గంటల పనిదినం అమలు జరుగుతున్న 136 సంవత్సరాల తర్వాత భారతదేశంలో నేడు మోడీ ప్రభుత్వం ఎనిమిది గంటల పనిదినాన్ని రద్దుచేసింది. తెల్లదొరల పాలననాడే భారత కార్మికవర్గం అనేక సమ్మెలు పోరాటాలు త్యాగాలతో అనేక చట్టాలను,హక్కులను సా ధించినది. కార్మిక సంఘాల చట్టం-1926, వేతనాల చెల్లింపు చట్టం-1936, నష్ట పరిహార చట్టం-1923, స్టాం డింగ్ ఆర్డర్స్ చట్టం-1946, కనీస వేతనాలు చట్టం-1948, బోనస్ చట్టం-1965, గనుల చట్టం-1952, కాంట్రాక్టు లేబర్ అభాలిషన్ అండ్ క్రమబద్ధీకరణ చట్టం-1970, సమానపనికి సమానవేతన చట్టం-1976,ప్రావిడెంట్ ఫండ్ చట్టం-1952,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం-1996,బోనస్ చట్టం-1965లాంటి కార్మికులకు అంతో ఇంతో ఉపయోగపడే 29 కార్మిక చట్టాలను.2020లో మోడీ ప్రభుత్వం రద్దుచేసింది.రద్దు చేసి న 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చింది.

ఈ నాలుగు లేబర్ కోడులలో ఎనిమిది గంటల పనిని 12గంటల పనిగా మార్చటం, మహిళలను అర్ధరాత్రి వేళ పనిచేయడానికి నిషేధించిన చట్టాలను రద్దుచేసి అర్ధరాత్రి పని చేయించడం, పరిశ్రమల్లో కనీస రక్షణ కల్పించాల్సిన యాజమాన్యాలకు దా ని నుండి మినహాయింపు కలిగించటం, పరిశ్రమలను మూసివేసేందుకు ప్రభుత్వ కార్మిక శాఖ అధికారుల అనుమతి పొందాలని నిబంధనలను రద్దుచేయడం, కనీ స వేతనాలు చెల్లించాల్సిన బాద్యతకు మినహాయింపు, సకాలంలో వేతనాల చెల్లింపు స్థానంలో యజమానులకు కుదిరినప్పుడే చేయవచ్చని, కార్మిక శాఖ అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చడం తదితర అనేక ప్రమాదకరమైన కార్మిక వ్యతిరేకమైన అంశాలను నాలుగు లేబర్ కోడ్లు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. నాలుగు లేబర్ కోడ్ల ఆమోదం జరగక ముందే బిజేపి పాలిత రాష్ట్రాల్లో అమలు లోకి తీసుకురావడం జరిగింది.

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని కార్మి క సంఘాలు 70కోట్ల మంది కార్మికులు సార్వత్రిక స మ్మెలకు, పోరాటాలను, ఉద్యమాలను నిర్వహించడం జరిగింది.70 కోట్ల మంది కార్మికుల నష్టంచేసే కేంద్ర ప్ర భుత్వ కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడులపై మోడీ ప్రభు త్వం స్పందించకపోవడానికి ఏకైక కారణం మోడి మి త్రులైన అదాని, అంబానీలాంటి బడాకార్పొరేట్ సంస్థల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు తోడ్పడేవి కావడమే.
కార్మిక వర్గాన్ని వారి శ్రమను నిలువునా దోచుకునే అవకాశాల్ని యజమానులకు,పారిశ్రామిక అధిపతులకు మోడీ ప్రభుత్వం లేబర్ కోడులలో కల్పించింది.ఇప్పటికే పేదలను దోచుకొని పెద్దలకు పెడుతున్న మోడీ ప్రభుత్వం భారతదేశంలో ప్రజల కష్టార్జితంతో స్థాపించబడిన 49 ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మివేసింది.ఇందులో అత్యంత ప్రయోజనకరమైన బొగ్గు, ఆయిల్, స్టీల్, రైల్వే, ఎల్‌ఐసి, ఎయిర్లైన్స్, డిఫెన్స్, ఎయిర్పోర్టు లాంటి కీలక సంస్థలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించిన వాటిలో ఉన్నాయి. లాభాలతో నడుస్తున్న బొగ్గు కంపెనీని ప్రైవేట్ వాళ్లకు వేలం పెట్టడం జరిగింది.

ఇప్పటికే భారత దేశంలో ఉన్న కోల్ ఇండియా కంపెనీ లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని ఏర్పాటు చేస్తున్నది.దేశవ్యాప్తంగా అనేక విద్యుత్ రంగా సంస్థలకు సరిపడా బొగ్గును సప్లై చేస్తున్నది.ఈ పరిస్థితుల్లో వందల కోట్ల లాభాలతో నడుస్తున్న సింగరేణిలోని సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని బొగ్గుబావులను ప్రైవేటు వాళ్లకు అమ్మకానికి పెట్టింది. మరొకవైపున ఆస్ట్రేలియాలో మోడీ మిత్రు డు అదానికి ఉన్న బొగ్గుబావుల నుండి బొగ్గును దేశంలోకి దిగుమతి చేయడానికి బలవంతంగా ఒత్తిడి చేయడం జరిగింది.భారత దేశ బొగ్గు టన్నుకు మూడు వేల రూపాయల ధర ఉంటే ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకుంటున్న ఆధాని బొగ్గుటన్నుకు 30 వేల రూపాయల ధర చెల్లించాలని మోడీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్ల అప్పులను రద్దుచేస్తూ పైగా వారికి అనేక రాయితీలను మోడీ ప్రభుత్వం కల్పించింది.

దేశ ప్రజల మీద నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, గ్యాస్, అధికధరల భారం, పన్నుల భారాన్ని మోపి గోళ్లుఊడకొట్టి వసూలు చేస్తున్నది. రైతులకు రుణమాఫీ చేయడమే దేశానికి నష్టమని ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల రుణాలను మాత్రం లక్షల కోట్ల రూపాయలను రద్దు చేయడం,రాయితీలు కల్పించడం చూస్తే మోడీ అమలుచేస్తున్న విధానాలు దేశంలోని 99 శాతం మంది ప్రజలకోసం కాదని కేవలం ఒక శాతం ఉన్న బడా కోటీశ్వరులు,కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకని అర్థమవుతుంది. భారత కార్మిక వర్గం నేడు ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలు ప్రైవేటీకరణతో లక్షలఉద్యోగాలు కోల్పోతున్నది. సమానపనికి, సమానవేతనాలు చెల్లించాలని 1976లోనే చట్టం చేయబడిన అమలు కు నోచుకోలేదు.ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకే పని చేస్తున్న కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేందుకు ఏమాత్రం పూనుకోవడం లేదు.ఆర్మీ రంగంలో తాత్కాలిక పద్ధతిన సైన్యం ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించి దేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్మీని సైతం అమ్మకానికి దూరంగా పెట్టలేదని స్పష్టం అవుతుంది.

ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు కాపాడుకోవడం, పరిశ్రమల పరిరక్షణ,హక్కుల రక్షణకు కార్మిక వర్గం పూనుకోవాల్సిన అవసరం ఉంది.ప్రపంచవ్యాప్తంగా 137 ఏళ్లుగా ఎనిమిది గంటల పనిని కార్మిక వర్గం అమలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం 12 గంటల పనిని తీసుకురావడం దేశాన్ని తిరోగమన వైపు నడిపించడం తప్ప మరొకటి కాదు. కోట్లాది మంది శ్రమజీవులు కులం మతం విస్మరించి కర్మగారాల్లో పనిస్థలాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నారు.ఇలాంటి చోట బ్రాహ్మణీయ హిందుత్వ ఆధిపత్య శక్తులు కార్మిక వర్గాన్ని విభజించేందుకు వారు తినే తిండి మీద, కట్టే బట్టమీద, మాట్లాడే భాష మీద అనేక ఆంక్షలు పెడుతున్నారు.ముస్లిములు, క్రిస్టియన్లు మైనార్టీల పేరుతో హిందువులను రెచ్చగొడుతున్నారు.రెచ్చగొట్టే చర్యలను, విధానాలను అమలు చేస్తున్నారు. నిజానికి బిజెపి ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు స్వదేశీ నినాదాన్ని ఇచ్చాయి.కానీ దేశంలో మిలటరీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ విదేశీ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటీకరించటo గమనిస్తే హిందూత్వo పేరుతో దేశాన్ని, ప్రజలను ఎలా దోచుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు.

దేశంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ భారం నిత్యావసర సరుకుల ధరల పెంపువలన దేశంలో ఉన్న మైనారిటీ ప్రజలు మాత్రమే కాకుండా దేశo లోని అన్ని వర్గాల ప్రజలు, హిందువుల సైతం ధరల భారం మోయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.ఇది కూడా జియో కోసం, బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదానీల కోసం అంబానీల కోసం సంపదలను వనరులను కట్టబెట్టి దేశ ప్రజలపై భారాన్ని మోపటం తప్ప మరొకటి కాదని స్పష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాడు చికాగో కార్మికులు ఎనిమిది గంటల పనితో పాటు వేతనాలు, సౌకర్యాలు,హక్కుల కోసం పోరాడి అమరులయ్యారు. నేటి కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణకు,ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసంఘటిత రంగంలో కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు సాధించేందుకు, ఉద్యోగ భద్రతకోసం, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం, కార్మిక వర్గాన్ని విచ్చలవిడిగా దోచుకునేందుకు అవకాశం కల్పిస్తున్న నాలుగు లేబర్ కోడెల రద్దు కోసం, మోడీ ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలు పునరుద్ధరణ కోసం, హిందూ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ పేరున కార్మిక వర్గాన్ని విభజిస్తున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది.గత తరాల కార్మికులు భవిష్యత్ తరాల కోసం పోరాటంలో తమ విలువైన జీవితాన్ని బలిచ్చి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడు కొనేందుకు నేటి కార్మిక వర్గం పూసుకుంటామని శపదం తీసుకోవాలని 137 మేడే సందర్భంగా భవిష్యత్తు తరాలకు తోడ్పాటు అందించే విధంగా ఈ మేడేను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జే.సీతారామయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News