Wednesday, April 24, 2024

‘కల్తీ’ పనిపట్టేందుకు చర్యలు!

- Advertisement -
- Advertisement -
food
ఉమ్మడి పది జిల్లాల వారీగా శాంపిల్స్ సేకరణ,  20 రోజుల్లోనే రిపోర్టును వెల్లడించనున్న ల్యాబ్ అధికారులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఉమ్మడి పది జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికలతో విడతల వారీ గా పలు హోటళ్లలో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ, ప్రజలకు మెరుగైన ఆహారం అందాలనే దృడ సంకల్పంతో హోటళ్లపై నిఘా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించే పుడ్ శాంపిల్స్‌ను పరీక్షించేందుకు ఒక ల్యాబ్ మాత్రమే ఉన్నా, ఒక్కో శాంపిల్ రిపొర్టును కేవలం 20 రోజుల్లో వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. వాస్తవంగా గతంలో ఒక్కో శాంపిల్ నివేదిక రావడానికి కనీసం 45 రోజుల పాటు వేచిచూడాల్సి వచ్చేంది.

కానీ రెండేళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌కు ల్యాబ్ లో 24 గంటల పాటు పరీక్షలు నిర్వహిస్తుండటంతో 15 నుంచి 20 రోజు ల్లో నివేదికలు ఇస్తామని పుడ్‌సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2018 సంవత్సరంలో కల్తీ అయిన శాంపిల్స్ సంఖ్య కంటే 2019లో తగ్గాయని పుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. 2018 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 2519 శాంపిల్స్ సేకరిస్తే 598 కలుషితం కాగా, 2019లో 1760 శాంపిల్స్‌కి 394 శాంపిల్స్ కల్తీ అయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. నిత్యం ప్రజలతో పాటు, హోటళ్ల నిర్వహుకులకు సైతం కల్తీ ఆహారపదార్థాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పుడ్ సేఫ్టీ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి నెల నుంచి మరో విడత శాంపిల్స్ సేకరణ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు.

వేగంగా శాంపిల్స్ సేకరణ..

తెలంగాణ రాష్ట్ర పుడ్ సేప్టీ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, శాంపిల్స్ సేకరణ మాత్రం వేగవంతంగా చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ సేఫ్టీ డైరెక్టర్లు 5, ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 10 మంది పుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం పెరిగిన జిల్లాలకు అనుగుణంగా పనిచేసేందుకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కానీ కల్తీ పై నిఘా పెట్టడంలో మాత్రం తెలంగాణ పుడ్ సేప్టీ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నామని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2016లో 1524 శాంపిల్స్ సేకరించగా, 286 కల్తీగా పదార్ధాలుగా అధికారులు గుర్తించారు. అదే విధంగా 2017లో 1480 శాంపిల్స్ సేకరించగా, 330 నాణ్యతలేనివిగా, 2018లో 2519 శాంపిల్స్ తీసుకోగ, 598 కల్తీ, 2019లో 1760 శాంపిల్స్‌కి 394 కల్తీ పదార్ధాలుగా గుర్తించామని అధికారులు చెప్పారు.

చికెన్ పదార్ధాలలోనే ఎక్కువ కల్తీ..

హోటళ్లలో లభిస్తున్న చికెన్ పదార్ధాల్లోనే ఎక్కువ కల్తీ అవుతున్నట్లు పుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసే వివిధ స్టాళ్ల వద్ద రంగురంగులతో వివిధ రకాల చికెన్ పదార్ధాలను వండి వినియోగదారులకు అందిస్తున్నారు. కానీ అవి ఎంత మాత్రం శ్రేయస్కరం కావని అధికారులు చెబుతున్నారు. అంతేగాక రోడ్లకిరువైపుల అమ్మే జ్యూస్‌లు ఇతర కూల్ డ్రింక్‌ల పట్ల కూడా జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొంటున్నారు. కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

కల్తీ పదార్ధాలు వలన వచ్చే ఆరోగ్య సమస్యలు..

వాస్తవంగా చాలా హోటళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్ధాలను వేడి చేసి ఇస్తుంటారు. ఆహారపదార్ధాలను మళ్లీ మళ్లీ వేడి చేయడం వలన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐస్‌తో చేసే జ్యూస్‌తో గ్యాస్ట్రో ఎంటైటీస్, వైరల్‌ఫీవర్, ఒళ్లునొప్పులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అదే విధంగా వీటిని త్రాగేందుకు వినియోగించే డిస్పోజబుల్ వలన అతిసారం వంటి వ్యాధులు ప్రబలుతాయని వైద్యులు చెబుతున్నారు.
శాంపిల్స్ సేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం..

విజయ్‌కుమార్ పుడ్ సేఫ్టీ డైరెక్టర్

రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్ధాలను అరికట్టేందుకు శాంపిల్స్ ప్రక్రియ వేగవంతం చేశాం. నిత్యం ప్రజలతో పాటు హోటళ్ల నిర్వహుకులకు కూడా కల్తీ ఆహారంతో వచ్చే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాం. 2018 కంటే 2019లో కల్తీ అయిన పదార్ధాలు తగ్గాయి. వీలైనంత వరకు తరచూ వేడి వేడి ఆహార పదార్ధాలను తీసుకుంటే కొంత వరకు మేలు.

 

Measures to avoid adulterated food in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News