Tuesday, June 18, 2024

జనసాగరం నడుమ సారలమ్మ ఆగమనం

- Advertisement -
- Advertisement -

భక్తులతో కిటకిటలాడిన ఐదు కిలోమీటర్ల పొడవు జంపన్న వాగు, మొదటి రోజు మధ్యాహ్నానికే
గద్దెలను సందర్శించుకున్న 50లక్షల మంది, వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు
మేడారం చుట్టూ 20కిలోమీటర్ల మేర భక్తుల విడిది, నాలుగు రోజుల పాటు సాగనున్న జాతర
తల్లుల వన ప్రవేశంతో శనివారం నాడు ముగింపు, ఆలయప్రాంగణంలో శివసత్తుల పూనకాలు

మేడారం మహా జాతర ఆరంభం

 

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: సమ్మక్క కూతురు సారలమ్మను ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో కన్నెపల్లి నుంచి మేడారం గద్దెకు బుధవారం రాత్రి అంగరంగవైభవంగా ఊరేగింపు గా చేర్చారు. రాత్రి 10 గంటలకు తల్లి గద్దెపై కొలువుదీరడంతో మహాజాతర ప్రారంభమైంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారలమ్మ భర్త గోవిందరాజు లు సారలమ్మ తమ్ముడు జంపన్నలను ముందుగానే గద్దెకు తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి  ఆదివాసీ పూజారులు క న్నెపల్లిలో సారలమ్మకు ప్రత్యేక పూ జలు చేశారు. సారలమ్మను వెదురుబుట్టలో కూర్చోపెట్టుకొని హన్మంతుని జెండా సహాయంతో కన్నెపల్లి నుంచి సారలమ్మ సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. కన్నెపల్లి వెన్నెలమ్మగా పిలవబడుతున్న సారలమ్మ గుడి నుంచి బయటకు రాగానే ఆదివాసీ ప్రతినిధిగా ఉన్న ములుగు ఎంఎల్‌ఎ సీతక్క ఆధ్వర్యంలో నృత్యాలు చేస్తూ ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు చల్లుతూ తల్లికి స్వాగతం పలికారు. సారలమ్మను తీసుకురావడంలో అపశ్రుతి చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రధాన పూజారి సారలమ్మ వెదురుబుట్టను పట్టుకోగా మిగిలిన పూజారులు సారలమ్మ చుట్టూ మొదటి భద్రత వలయంగా ఉన్నారు. వారి తరువాత గ్రీన్‌బెల్ట్‌గా ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు వలయాకార భద్రతగా ఉన్నారు. ఆ తరువాతనే పోలీస్‌శాఖ రోప్‌తో ప్రత్యేక భద్రత వలయాన్ని ఏర్పాటు చేసింది. సారలమ్మ మేడారానికి తరలివస్తుండడంతో వేలాది మంది భక్తులు సారలమ్మకు ఎదురెళ్లి ఎదుర్కోళ్లతో స్వాగతం పలికారు. శివసత్తులు ఊగిపోతూ వరం పడుతూ తల్లిని తాకుతూ స్వాగతం పలికారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం అంగరంగవైభవంగా తల్లిని మేడారం పరిసర ప్రాంతాల్లోని జంపన్నవాగు వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే రాత్రి 8.30 అయింది. జంపన్నవాగుకు బ్రిడ్జి ఉన్నప్పటికి తమ్ముడు జంపన్నను అలింగనం చేసుకోవడానికి పూజారులు సారలమ్మతో వాగులోకి దిగారు. సారలమ్మ జంపన్నను అలింగనం చేసుకొని ఒడ్డుకెక్కింది. అక్కడి నుంచి జయజయ హర్షధ్వానాల మధ్య భక్త కోటి సారలమ్మను మొక్కుతూ నినాదాలు చేస్తుండగా వడివడిగా మేడారం గద్దెవైపు వచ్చింది.

Medaram

అప్పటికే మేడారం గద్దెల వద్ద భక్త కోటి జనం బారులు తీరి కిక్కిరిసి ఉంది. ప్రధాన పూజారుల్లో కొందరు ముందుగా సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. గద్దె ప్రాంగణాన్ని శుద్ధి చేసి ముగ్గులు పెట్టారు. అప్పటి వరకు గద్దెల ప్రాంతానికి సుదూరంగా ఉన్న సారలమ్మను తీసుకురావడానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సారలమ్మ వెంట వస్తున్న భక్తులను నిలిపి వేయడానికి రోప్‌వే పార్టీలతో పాటు ఐదంచెల భద్రతను అమలు చేశారు. గుడి దగ్గరికి రాగానే తల్లితో ఉన్న ప్రధాన పూజారులను గుడిలోనికి పంపిన తరువాత పోలీసులు మిగిలిన వారిని తనిఖీ చేసి లోనికి పంపారు. గద్దెల ప్రాంగణానికి పోగానే ప్రధాన పూజారులు మినహా మరెవరిని అనుమతించలేదు. సారలమ్మ గద్దె వద్దకు రాగానే ప్రధాన పూజారితో పాటు మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతించి తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు. దీంతో మహాజాతర మొదటి ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ ఆగమనానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టింది. జాతరలో భక్త కోటి జనం తల్లుల కోసం నిరీక్షిస్తుండగా మొదటి ఘట్టం ఆవిష్కృతం కావడంతో దర్శనం కోసం భక్తులు లక్షల సంఖ్యలో గుడికి చేరుకుంటున్నారు.

66 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొలువుదీరిన పగిడిద్దరాజు

సమ్మక్క భర్త పగిడిద్దరాజును సోమవారం పెళ్లికొడుకును చేసి మేడారానికి తరలించారు. 66 కిలోమీటర్ల పొడవునా కాలినడకతో ఎరుపురంగు నాగపడగను పట్టుకొని ప్రధాన పూజారులు బుధవారం ఉదయం పస్రాకు చేరుకున్నారు. మధ్యాహ్నానికి పగిడిద్దరాజు జాతరలోని వన ద్వారం ద్వారా మేడారం చేరుకొని చిలకలగట్టుకు పూజారులు ఆహ్వానించారు. అక్కడే సమ్మక్కకు పగిడిద్దరాజుకు పెళ్లి వేడుకను ముగించి సారలమ్మ గద్దెకు చేరుకునే ముందే పగిడిద్దరాజును తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అదే సమయంలో సారలమ్మ భర్త గోవిందరాజులను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ ముగ్గురి రాకతో మహాజాతర మొదటిఘట్టం పూర్తయి జాతర రోజు ప్రారంభమైంది.

నేడు సమ్మక్క ఆగమనం

మేడారం మహాజాతరకు నేడు అనుకూలమైన ఘడియలు వచ్చాయి. మాఘశుద్ధపౌర్ణమి రోజున పండు వెన్నెలలో జయజయధ్వానాల మధ్య తల్లి సమ్మక్క గురువారం రాత్రి గద్దెకు చేరనుంది. సమ్మక్కను తీసుకురావడానికి అధికార యంత్రాంగంతో పాటు లక్షలాది మంది భక్తులు స్వాగతం పలికేందుకు మేడారంలో వేచి ఉన్నారు. సమ్మక్కను గద్దెకు చేర్చడానికి ముందుగా పూజారులు చేయాల్సిన పూజా కార్యక్రమాలు, సాంప్రదాయ కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేశారు. నేడు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ముఖ్యకార్యనిర్వహణాధికారి సోమేశ్వర్, రాష్ట్ర డిజిపిల ఆధ్వర్యంలో చిలకలగట్టు వద్ద సమ్మక్కను మేడారం గద్దెపై ఆహ్వానించడానికి వెళ్తారు. ఆదివాసీ పూజారులు పూజా వేడుకలను ముగించుకొని చిలకలగట్టు దిగగానే పోలీస్ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి సమ్మక్కను గద్దెకు తీసుకొని బయలుదేరుతారు.

చిలకలగట్టు నుంచే సమ్మక్క వస్తుందని ఆమె కోసం ఎదురుచూస్తున్న లక్షలాది భక్తజనం యాటలు, కోళ్లతో ఎదురెళుతారు. అదే సమయంలో పోలీసు శాఖ వేలమందితో సమ్మక్కను మూడంచెల భద్రతతో గద్దెకు తీసుకురావడానికి ఒడిఒడిగా అడుగులేస్తూ గుడికి చేరుకుంటారు. గుడి ప్రాంగణంలో నలుదిశలా ఉన్న రోడ్లలో సమ్మక్కకు స్వాగతం పలికి పూజారులను తాకేందుకు పోటీపడుతూ భక్తులు ఎదురెళ్లడం వల్ల కనురెప్పపాటులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఒక్కసారిగా జనసముద్రం ఉప్పెంగినట్లుగా మేడారం గుడి ముందు ప్రాంతం మారిపోతుంది. కనురెప్పపాటులోనే పోలీసులు భక్తులను తప్పించి సమ్మక్కను గద్దెకు చేరుస్తారు. ఈ పరిణామంతో పోలీసులు మహాఘట్టాన్ని పూర్తయిందని ఊపిరిపీల్చుకుంటారు. తల్లిబిడ్డలు గద్దెలపై కొలువుదీరిన తరువాత అశేష భక్తజనం దర్శనం కోసం బారులు తీరుతారు. రెండు రోజుల పాటు భక్తులు తల్లులను దర్శనం చేసుకోవడానికి క్యూలైన్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది.

12 వేల మందితో బందోబస్తు

100 సిసి, 4 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా
పర్యటించిన సిఎస్ సోమేశ్‌కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ ః మేడారం జాతర ఏర్పాట్లను బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజి జితేందర్ లు పరిశీలించారు. ఈ సందర్బంగా మేడారలో జంపన్నవాగు, చిలకలగట్టు, గద్దెల ప్రాంగణం, క్యూ లైన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలలో అధికారులు పర్యటించారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ మేడారం జాతరలో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల చర్యలు చేపట్టామన్నారు. భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టామని, ప్రధానంగా సాధారణ భక్తులు సులువుగా అమ్మవార్ల దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ లో నిష్ణాతులైన ట్రాఫిక్ పోలీస్ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, ఇద్దరు డి ఐ జి ర్యాంక్ అధికారులు, 6గురు ఎస్‌పిలతో పాటు 12 వేల పోలీస్ యంత్రాంగంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.

ముఖ్యంగా మహిళల భద్రతకు షి టీమ్ లు ఏర్పాటుతో పాటు 70 మంది మహిళా ఎస్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. జాతరలో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల, అధికారుల సహాయ సహకరాలతో జాతరను విజయవంతం చేద్దామని డిజిపి పిలుపునిచ్చారు. జాతరలో శాంతిభద్రతల చర్యల్లో భాగంగా నాలుగు డ్రోన్ కెమెరాలు, 100 సిసి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందన్నారు.అలాగే 350 సర్వేలెన్స్ కెమెరాలు, 20 జూమ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశామని, ఈ విషయంలో ప్రత్యేక పోలీసులు నిరంతరం పర్య వేక్షణ జరుపుతున్నారని వివరించారు. అలాగే జాతర సందర్బంగా భక్తుల వాహనాల పార్కింగ్ కు 32 ప్రాంతాల్లో స్థలాలను కల్పించామని, పోలీసులు, ఇతర శాఖ సిబ్బంది నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని సిఎస్ సోమేశ్‌కుమార్, డిజిపిలు ఆదేశాలిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News