Thursday, March 28, 2024

మేడారం జాతర…

- Advertisement -
- Advertisement -

medaram-jatara

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకి 110 కి.మీ. దూరంలో అటవీ ప్రాంతంలో కొండల్లో, కోనల్లో ఉంటుంది. భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గడించిన మేడారం జాతర గిరిజన సంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.

మేడారం జాతరని సమ్మక్క – సారక్క జాతర అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ జాతరని గిరిజనులు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వనదేవతలు సమ్మక్క -సారక్కలను భక్తుల కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే ఆపద్భాంధవులుగా, వనదేవతలుగా పూజిస్తారు.
చరిత్రలోకెళ్తే… కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క- సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించేవారు.

పడిగిద్దరాజు కాకతీయుల సామంతరాజు. ఇతని సతీమణి సమ్మక్క. వీరి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఓసారి మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి వచ్చారు. పడిగిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దాంతో ప్రతాపరుద్రుడు అతనిపై సైనికులను పంపాడు. పడిగిద్దరాజు, అతని కుమార్తెలు, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద ఎదుర్కొని పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది.

తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలు, బల్లాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి పరుగెత్తించి అంతం చేసింది. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైనది. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు.

మేడారం సందడి: మేడారం జాతర సందడి సుమారు పది రోజుల ముందు నుంచే మొదలవుతుంది. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవత పూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకొస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు.

దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. బెల్లం నైవేద్యం: తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు.

ఎలా చేరుకోవాలి: వరంగల్‌కు హన్మకొండకు మధ్య దూరం 8 కి.మీ. ఉంటుంది. హన్మకొండ నుండి మేడారం దాదాపు 95 కి.మీ దూరం ఉంటుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. నేరుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ బస్ స్టాండ్‌ల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు.

medaram sammakka sarakka jatara 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News