Friday, March 29, 2024

450 హుండీల లెక్కింపు… రూ.10,00,63,980 ఆదాయం

- Advertisement -
- Advertisement -
Medaram Sammakka Saralamma Hundi Counting
కొనసాగుతున్న బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీల లెక్కింపు
రెండు, మూడురోజుల్లో కొలిక్కిరానున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం

హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మల జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం సాయంత్రానికి పది కోట్ల రూపాయలు దాటింది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో కానుకల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 450 హుండీల లెక్కింపు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీల ద్వారా రూ.10,00,63,980 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. నాణేలను లెక్కించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేస్తున్నారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

2020లో రూ.15 కోట్లకు పైగా ఆదాయం

2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపంలో రూ.11.65 కోట్లు, 1,063 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. అయితే ఈ సారి జాతర ముందు నుంచే తల్లులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం మహా జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొత్తం కోటి ముప్పై లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారుల అంచనా. 50 లక్షల మందికి పైగా భక్తులు జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News