Home ఎడిటోరియల్ అధ్వాన స్థితిలో వైద్యరంగం…!

అధ్వాన స్థితిలో వైద్యరంగం…!

sampadakiyam

 

ఆరోగ్యమే మహాభాగ్యమని అనుకోడమేగాని దానిని కాపాడే, మెరుగుపరిచే వైద్య సేవలను అందరికీ ఏ లోపం లేకుండా అందించవలసిన బాధ్యతను మాత్రం గాలికి వదిలేస్తున్నాం. వైద్యం మనిషి భౌతిక మనుగడను కాపాడుతుంది. వివేకవంతమైన సమాజ నిర్మాణానికి ఇటుకలను అందిస్తుంది విద్య. ఈ రెండు రంగాలనూ శ్రద్ధగా పట్టించుకొనే చోటనే జాతి అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో మంచి విద్య, వైద్యం సాధారణ ప్రజలకు గగనకుసుమాలైపోయాయి. నాణ్యమైన వైద్యం అందుబాటులో లేకుండాపో యింది. భారతదేశంలో గల వైద్య సిబ్బందిలో సగం మందికి పైగా (54%) తగిన అర్హతలు లేనివారేనని బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో తేలినట్టు వచ్చిన వార్త మన వైద్య రంగం డొల్లతనాన్ని చాటుతున్నది. దేశంలో నమోదైన అన్ని యోగ్యతలు గల వైద్య నిపుణుల్లో 20% మంది ఇప్పుడున్న సిబ్బందిలో లేరని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య భద్రతా సౌకర్యాలు కరువని ఈ గణాంకాలు చాటుతున్నాయి. దేశంలో వివిధ వైద్య సంఘాల ద్వారా నమోదైన వైద్య నిపుణుల సంఖ్య 50 లక్షలు కాగా వాస్తవంలో పని చేస్తున్నవారు 38 లక్షల మందే కావడం గమనించవలసిన విషయం. ప్రజాధనంతో వైద్య విద్యను అభసించి తగిన శిక్షణ పొందినవారు దేశ ప్రజల సేవకు అందుబాటులో లేకపోవడం ఎంతైనా ఆందోళనకరం. ఎంబిబిఎస్, ఆపైన చదువుకునే వైద్యులు ఆధునిక జీవన సౌకర్యాలుండని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించడానికి బొత్తిగా సుముఖులుగా లేకపోడం నగర, పట్టణ ప్రాంతాలకే వారు పరిమితమైపోడం అత్యధిక జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్న మన దేశంలో అందరికీ నాణ్యమైన వైద్యం అందించలేని పరిస్థితిని సృష్టిస్తున్నది.

ప్రభుత్వాలు సమగ్రమైన అధ్యయనం, ఆలోచన చేసి ఈ లోపాన్ని అధిగమించడానికి అవసరమైన వ్యూహాన్ని రచించి అమలుపరచాలి. ఇక్కడ తయారవుతున్న చాలా మంది వైద్య పట్టభద్రులు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వలస పోతున్నారు. వారి సమ్మతితోనే దీనిని అరికట్టవలసి ఉన్నది. దేశానికి సుశిక్షితులైన సైనికులున్నట్టే నిపుణులు, నిబద్ధులైన వైద్య సేన కూడా ఉండాలి. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండి ఉంటే ఈ రెండు రంగాలలో అటువంటి సైన్యాలను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమవడం ద్వారా వారికి విశేష సేవలందించేలా చూడడానికి అవకాశం కలుగుతుంది. పాలకుల దీక్షాదక్షతలను బట్టి దీనిని వాస్తవం చేసుకోగలుగుతాము. ప్రైవేటు రంగానికి విచ్చలవిడి, విశృంఖల స్వేచ్ఛ లభిస్తున్న నేపథ్యంలో అటువంటి స్థితిని ఆశించలేము.

అయినా ఉన్న పరిమితులలోనే నిపుణులు, సకల అర్హతలు గల వైద్య సిబ్బంది సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఉంది. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల మీద కూడా ఈ బాధ్యతను ఉంచాలి. అటువంటప్పుడే దేశంలోని యువత దృఢతరంగా తయారై జాతి భవిష్యత్తుకు భరోసాను ఇవ్వగలుగుతుంది. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు తగ్గి ఆయుష్షు పెరుగుతుంది. వైద్య నిపుణులు ప్రతి వెయ్యి మందికి ఒకరుండాలన్నది ప్రమాణం. ఇది దేశంలో అన్నిచోట్లా లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో తగిన యోగ్యతలు కలిగిన వైద్యులు ఈ ప్రమాణం మేరకు అందుబాటులో లేరు. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, గోవాలలో మాత్రం వెయ్యిమందికి ఒకరి కంటే ఎక్కువగానే వైద్యున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులోనైతే ప్రతి వెయ్యి మందికి నలుగురు వైద్యులున్నారని సమాచారం.

ఢిల్లీలో ప్రతి వెయ్యి మందికి ముగ్గురు, కేరళ, కర్ణాటకల్లో 1.5 మంది, పంజాబ్, గోవాలలో 1.3 మంది వైద్యులున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆలోపతి, దంత, ఆయుష్ (దేశీయ) వైద్య రంగాల్లో కనీసం పట్టభద్రత, పోస్టుగ్రాడ్యుయేట్ విద్య పూర్తి చేసినవారు ఉండి తీరాలి. నర్సు ఉద్యోగాలకు హైయ్యర్ సెకండరీ సాధారణ విద్యతోపాటు సంబంధిత వైద్యంలో తగిన సాంకేతిక శిక్షణ అవసరమవుతుంది. ఈ స్థాయి యోగ్యతలు సగానికి మించిన సిబ్బందిలో లేవంటే మన వైద్య రంగాన్ని గురించి లోతైన పరిశీలన జరిపి తగిన పరిష్కార చర్యలు తీసుకోవలసిన అత్యవసరం స్పష్టంగా కనిపిస్తున్నది. అర్హులు అందుబాటు లో లేకపోడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల మీద ఆధారపడవలసి వస్తున్నది, లేదా ఇంకా మూఢ విశ్వాసాలను పట్టుకొని వేళ్లాడే దుస్థితిలో ప్రజలుంటున్నారు. దీనిని మార్చవలసిన తక్షణ ఆవశ్యకతను పాలకులు గుర్తించాలి.

Medical Field in Worst Condition