Home తాజా వార్తలు కల్పవృక్షం..! మునగ..

కల్పవృక్షం..! మునగ..

Munaga Tree

 

నిజామాబాద్ : భూగోళం మీదున్న సమస్త పోషకాహారం లోపాల్ని సకల రోగాల్ని నివారించటానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లకు మునగాకు పొడిని బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వలన మధుమేహం తగ్గిందని పొడి తినటం వలన పాలు బాగా పడ్డాయని చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు. ఆనోటా ఈ నోటా ఇది మన వరకూ వచ్చింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లుగా నిన్న మొన్నటి వరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపై కెత్తి దాని వైపే చూడలేదు… సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప.. కాని అమెరికాకి చెందిన “ద ట్రీస్ ఫర్ లైఫ్‌” స్వచ్చంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది.

దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కధలుగా చెప్పటం ప్రారంభించాయి. ఐక్యరాజ్య సమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో మన దృష్టి అటు మళ్ళింది. న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి. గోపాలన్, డాక్టర్ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని నిప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులు తోడయ్యారు. అంతా కలిసి మరీ మునగ మహత్యాన్ని కొనియాడుతున్నారు.

ఏముంది మునగాకులో….?
బతికుంటే బలుసాకు తినొచ్చు.. ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, రోజు కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్ళు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే…. వంద గ్రాముల తాజా మునగాకులో.. నారింజలో కన్నా ఏడు రెట్ల సి-విటమిన్, క్యారెట్లలో కన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలో కన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలో కన్నా మూడింతల ఐరన్, బాదంలో కన్నా మూడు రెట్లు విటమిన్-ఇ, పెరుగులో కన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. అందుకే పోషకాహారం లోపాన్ని నివారించటానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.

ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి ఆ కాయల్ని రోజు తినేవాడట. ‘ఓమేగా – 3, 6, 9 ఫ్యాటి ఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు.. మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ.. పేదవాడి ఆహారం” అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకు పండించి, పొడిచేసి విక్రయిస్తున్నారు. భారత్ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయటం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం వలన ఇప్పటికీ మన దగ్గర అలసత్వమే. నిజానికి ప్రాచీన కాలం నుండి ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్ళీ తెరమీదకొచ్చింది.

టైమ్ మ్యాగజైన్ ‘ద నెక్స్ క్వినోవా’ గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవటం, టీ , సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం అలవాటు చేసుకున్నారు. మునగాకుని ఎండబెట్టి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపు పోయింది. దాంతో కాయల కోసం చాలా మంది పెంచుతున్నారు.

కాబట్టి ఇతర ఆకుకూరల్లోనే మునగాకుతో పప్పు కూరలు పచ్చళ్ళు పొడులూ రైస్ వైరైటీలు కోస్తాలూ.. అన్ని రకాలు వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు,సూపుల్లో అన్నంలో కూరల్లో ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

ఔషద గుణలెన్నో….
మరే చెట్టు ఆకులకీ లేనంత మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగ నిరోధక శక్తిని పెంచే 46 యాంటీ ఆక్సిడెంట్లు అనేకానేక బయోయాక్టివ్ పదార్ధాలు ఉండటంతో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఔషధాల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టిరియా, ఫంగస్ లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ, అల్సర్లూ కనుచూపు మేరా కనిపించవు. ఆల్జీమర్స్ ఎగిరిపోతుంది. బిసి, మధుమేహం, కొలెస్ట్రాల్ దరి చేరటానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్. అంతేనా.. రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త మండిన మునగాకునో లేదా టీ స్పూను పొడినో రోజు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ది. ఈ రోజుల్లో పసి వయసు దాటకుండానే కంటి జబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే.

వాటన్నింటిని మునగాకులోని బీటాకెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటోంది. ఇంటా బయటా అంతటా ధూళి మేఘాలే.. కాలుష్యకాసారాలే.. మరి ఆస్తమా, బ్రాంకైటిస్, ట్యుబర్‌క్యూలోసిస్ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపుల్లా చేసుకుని రోజుకి రెండు సార్లు తీసుకుంటే లంగ్స్‌లోని టాక్సిన్లు తొలగి ఆ వ్యాధులన్నీ పారిపోతాయి. రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో.. కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూప్‌ని 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్ళల్లో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది.

పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే. డయేరియా, కామెర్లూ,కలరా బాధితులు బాధ కాదు. ఒకటే దాహం, నీరసం. అప్పుడు రోజుకి రెండు మూడు సార్లు గ్లాసు కొబ్బరి నీళ్ళలో టీ స్పూన్ మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకి మునగ బెస్ట్ మెడిసనే. ఆకుల్ని ముద్దగా చేసి క్యారెట్ రసంలో కలిపి పందిగంటలోకోసారి తీసుకుంటే హానికర బ్యాక్టిరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి. ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమల మచ్చలు, బ్లాక్ హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.

వాహ్‌వా.. మునక్కాడ..!
సీజన్‌లో చిటారు కొమ్మ వరకు చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసే వాళ్ళకి కన్నుల పండుగ అయితే ఆ కాయల రుచి తెలిసిన వాళ్ళకి విందు భోజనమే. దక్షిణాదిన సాంబాబు, పులుసు, అనియల్ మునక్కాడ కనిపించాల్సిందే. ఇక బియ్యం పిండి, బెల్లం లేదా అల్లం వెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే. ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించటం చాలా మందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియ చెప్పినా అది నిజమే. మునక్కాడలోని యాంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే కాల్షియం, ఐరన్‌లు ఎముక బలాన్ని బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.

తరచూ జలుబు చేస్తోందా.. జ్వరమొస్తొందా…!
అయితే రోజు మునక్కాడలు తినండహో.. అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్ – సి జలుబు, ఫ్లూ జ్వరాలకు టాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్ళకి పొట్టలో నులి పురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్ళనొప్పులయితే పరారే. డయాసిస్, రిబోప్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడలోనూ సమృద్దిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండి పదార్దాలు, ప్రొటీన్లు జీర్ణమయ్యేలా చేస్తాయి.

విత్తనంతో నీటి శుద్ధి…!
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా.. ఫరవాలేదు.. ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్ – సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గాను వాడుతుంటారు. రక్షిత నీటి పథకాలు కరువైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటి శుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పులేకుండా తేటగా మారుస్తాయి.

సూడాన్, ఇండోనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్ళను బిందెలోని నీళ్లలో కలిపి ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరువాత ఓ గంట సేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పొసుకుని తాగుతారు. శాస్త్రీయంగా మునగాకు మనుషులకే కాదు. పశువులకీ బలవర్ణకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు.

Medicinal properties in Munaga Tree