Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రాయితీలంటూ రోగులకు గాలం

రాయితీలంటూ రోగులకు గాలం

హలో సార్ మీ ఇంట్లో రోగులున్నారా?
ఉంటే మీకు మందులు కావాలా?
రోగులకు ఆన్‌లైన్ మందుల వల

Generic-Medicines

మన తెలంగాణ/సిటీబ్యూరో : హలో సార్ మీ ఇంట్లో రోగులు ఉన్నారా? ఉంటే వారు నిత్యం మందులు వాడుతారా…ఏలాంటి మందులైన మావద్ద చౌక ధరలకే లభిస్తాయి…అంతే కాదు అన్ని రకాల మందులపై 25శాతం ప్రత్యేక రాయితీ ఇస్తాం. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ ఉన్నా, లేకున్నా ఫోన్‌లో మందుల పేర్లు చెబితే చాలు ఆర్డర్ ఇచ్చిన కొద్ది గంల్లోనే మీ ఇంటి ముందు మందులుంటాయంటూ కొన్ని ఏజెన్సీలు ఆన్‌లైన్‌లో రోగులకు గాలం వేస్తున్నాయి. మరి కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో మందులంటూ వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి నగదు చెల్లించుకుని చివరకు మందులు కూడా పంపివ్వడంలేదు. ఇలా నగరంలో రోగులు నిత్యం మోసపోతున్నట్లు తెలుస్తోంది.

మోసపోతున్నారు

నగరంలో ఆన్‌లైన్ మందులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు మోసపోతున్నారు. ఒక్క క్లిక్‌తో మీ ముందుకు మందులు అంటూ మాయమాటలు నమ్మబలికి కొందరు అక్రమార్కులు ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని వెబ్‌సైట్లలో లాగిన్ అయి మందులను ఆర్డర్ చేసి, నగదు చెల్లిస్తే ఇంటికి మందులు రావడంలేదు. ఇలా ఎంతో మంది వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. ఆన్‌లైన్ మందులను కొనుగోలు చేసే ముందు ఆ సంస్థ వివరాలను తెలుసుకోకుండా ప్రజలు ఆర్డర్ చేస్తూ నిలువుగా మునుగుతున్నారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండానే

Medicine Sale to Patient in Online with Fraud

డ్రగ్స్ కాస్మొటిక్స్ యాక్ట్1940 ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు నిషిద్ధం. అయితే ఆన్‌లైన్ మందుల దందాకు ఇవన్నీ పట్టడం లేదు. వినియోగదారులకు కావాల్సిన మందులను బుక్ చేయగానే ఆ మందులను డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చి అప్పజెపుతున్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా, ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే మందులు ఇంటికి తెచ్చిస్తామని పలు ఏజెన్సీలు రోగులకు చెబుతున్నాయి. ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ లేకుండా జరిగే విక్రయాలు. నిబంధనల ప్రకారం షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ హెచ్ 1 మందులను ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి వీలులేదు. బిపి, షుగర్, పక్షవాతం, న్యూరాలజీ సమస్యలు, గుండె, ఆర్థోపెడిక్ వంటి జబ్బులకు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు. ఇలా సుమారుగా 600 నుంచి 700 రకాల మందుల విక్రయాలపై నిబంధనలు ఉన్నాయి. ఓవర్ ది కౌంటర్(ఒటిసి)డ్రగ్స్‌కు మాత్రం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవొచ్చు. కొన్ని రకాల షెడ్యూల్ మందులను కూడా ఒకటి, రెండు పూటలకు సంబంధించి ఇవ్వడానికి సడలింపు ఉంది. మరి ఆన్‌లైన్ మందుల్లో ఇవ్వన్ని చట్ట విరుద్ధంగానే జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదు.

నకిలీ వెబ్‌సైట్లతో వల

కొందరు అక్రమార్కులు భారీ డిస్కౌంట్‌లు అంటూ అక్రమాలకు తెరలేపుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిలో అధికంగా ఇతర దేశాలకు చెందిన వారే ఉన్నారు. ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేస్తే 50నుంచి 60శాతం డిస్కౌంట్‌లు అంటూ బంపర్ ఆఫర్‌లను ప్రకటిస్తుంటారు. వీటికి గాను నగదు ఆన్‌లైన్‌లో ముందుగా చెల్లించాలనే షరతులు వర్తిస్తారు. బంపర్ ఆఫర్‌లను చూసిన కొనుగోలుదారులు ఒకేసారి 5, 6 నెలలను కావాల్సినన్ని మందులను ఆర్డర్ చేసి నగదు చెల్లిస్తారు. చివరకు మందులు రాకపోవడంతో అప్పుడు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను అశ్రయిస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్‌లో మందులను కొనుగోలు చేసే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకొని ఆర్డర్ చేస్తే మోసపోకుండా ఉంటారు.