Home రాష్ట్ర వార్తలు రెండేళ్లలో మేడిగడ్డ

రెండేళ్లలో మేడిగడ్డ

రీ డిజైనింగ్ ద్వారా, సముద్రంలో కలిసిపోతున్న జలాల మళ్లింపు
కోటి ఎకరాలకు నీరు: కాళేశ్వరం, డిండి, సీతారామ ప్రాజెక్టుల సమీక్షలో సిఎం కెసిఆర్

kcrహైదరాబాద్ : రెండేళ్లలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్మాణ పనులు చేపడుతున్న ఎల్ అండ్ టి ప్రతినిధులను ఆదేశించారు. ఉత్తర తెలంగా ణకు వరప్రసాదిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే తెలంగాణ రైతులకు అంత ప్రయోజనం చేకూరుతుందని సిఎం చెప్పారు. కాళేశ్వరం, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కాళేశ్వరం సిఇ వెంకటేశ్వర్లు, ఎస్‌ఇ సుధాకర్‌రెడ్డి, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు, పాలమూరు ప్రాజెక్టుల ఒఎస్‌డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే సమీక్షలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ పనులుచేస్తున్న ఎల్‌అండ్‌టి ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి  చర్చిం చారు. ఎల్‌అండ్‌టి సీనియర్ డిజిఎం అమర్‌పాల్‌సింగ్, డిజిఎం రామకృష్ణరావు, సీనియర్ మేనేజర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం త్వరగా పూర్తయ్యే వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టి ప్రతినిధులు మేడిగడ్డ కన్‌స్ట్రక్షన్ మెథడాలజీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 24 నెలల సమయంలో బ్యారేజి నిర్మాణం చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చారు. బ్యారేజితో పాటు నదికి ఇరువైపులా బండ్ కట్టే ప్రాంతాలను  కూడా ఖరారు చేశారు. బ్యారేజి పూర్తవడం కన్నా ముందే పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయాలని సూచించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నందున పనులు కూడా త్వరితగతిన పూర్తి కావాలని సిఎం కెసిఆర్ అన్నారు.తెలంగాణలో ఎక్కువ మంది ఆధారపడేది వ్యవసాయం మీద కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడదని స్ప,్టంచేశారు. ప్రతి ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని, ప్రతి నెలా రూ.2,100 కోట్ల చొప్పున నీటి పారుదల శాఖకు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతకూడా ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని, రైతులుకు ప్రస్తుతం ఏడాదికి రూ.4 వేల కోట్ల చొప్పున వెచ్చించి అందించే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించి తీరుతామని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికున్న ఆదాయ వనరులు ఈ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగపడాలన్నది తమ లక్షమని సిఎం అన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వమంటే చంద్రబాబు ప్రభుత్వం రైతులను రాచిరంపాన పెట్టిన పరిస్థితిని ప్రజలు చూశారని, అలాంటి పాలకులను తిరస్కరించారని సిఎం చెప్పారు. కానీ నేడు రైతులకు ఉచిత విద్యుత్ అందివ్వడంతో పాటు సాగునీరు అందించడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయం బాగుంటే రైతులు బాగుంటారని, రైతుల చేతిలో డబ్బులుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సిఎం చెప్పారు. వ్యవసాయానికి సాగునీరు వస్తే రైతులు పచ్చగా ఉంటారన్నారు. అందుకే ప్రభ్తుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా నిర్వహించాలని, జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.
రెండు రాష్ట్రాల రైతులూ బాగుపడాలి
తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేయడం ద్వారా సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా వినియోగించుకోగలుగుతామని సిఎం కెసిఆర్ అన్నారు. గోదావరి, కృష్ణా నదుల ద్వారా ప్రతి ఏటా 4500 టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తుందన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తయినా సరే కేవలం వెయ్యి టిఎంసిల లోపే వాడుకోగలుగుతామని, మిగతా నీరంతా కింద ఉన్న ఆంధ్రప్రదేశ్‌కే వెళ్తుందని సిఎం చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా చక్కగా ప్రణాళిక వేసుకుని సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వినియోగించుకోవాలని సూచించారు. రైతులెవరైనా రైతులే అని రెండు రాష్ట్రాల రైతులు బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు సిఎం చెప్పారు.
బహుళార్థక సాధక ప్రాజెక్టుగా సీతారామ ఎత్తిపోతల పథకం
ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను ఏకం చేసి కొత్తగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద నిర్మించిన బారాజ్ ద్వారా నీటిని లిప్ట్ చేసి సీతారామ ప్రాజెక్టును నిర్వహించాలని సూచించారు.
భవిష్యత్తులో ప్రస్తుతమున్న బ్యారేజికి 200 మీటర్ల కిందికి మరింత ఎత్తులో బ్యారేజి నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చే విధంగా సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దాలని సిఎం చెప్పారు. దీని వల్ల దాదాపు 22 టిఎంసిల నీరు నదిలోనే నిల్వ ఉండడంతో పాటు దాదాపు 31 కిలోమీటర్ల వరకు నదిలో నీరు నిలుస్తుందని, ఎలాంటి ముంపు లేకుండా నీటిని వాడుకోవచ్చని సిఎం చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా నదిలో జలాలు లేకున్నా సరే ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా వ్యవసాయానికిఢోకాలేని పరిస్థితి తేవాలని కెసిఆర్ సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక, అంచనాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.