Home నాగర్ కర్నూల్ రాష్ట్రం నుంచి మీరా కుమార్ పోటీ?

రాష్ట్రం నుంచి మీరా కుమార్ పోటీ?

    Meer-Kumar

మన తెలంగాణ/ హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను బరిలో దింపితే ఎలా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నారు.  ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది. మీరా కుమార్  పోటీ చేసేందుకు పెద్దపల్లి, మెదక్ లోక్‌సభ స్థానాలు అనువుగా ఉంటాయని భావిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూలు స్థానంలో కూడా పోటీకి అనుకూలంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. తెలంగాణ బిల్లును లోక్‌సభలో పాస్ అవ్వడంలో మీరా కుమార్ కీలక పాత్ర పోషించారు. నాటి సభలో స్పీకర్‌గా ఉన్న ఆమె అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య బిల్లును ఆమోదింపజేశారు. సభలో ఎంపిల మధ్య తోపులాట జరిగినా కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేయించి మూజువాణి ఓటు ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేశారు. నాటి పరిస్థితులు ఇప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో తాజాగానే ఉన్నాయి. దీని ఆధారంగానే ఆమెను రాష్ట్రం నుండి పోటీ చేయించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనికి తోడు మాజీ ఉప ప్రధాని, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తెగా మీరాకుమార్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

దళిత వర్గాల్లో కూడా ప్రత్యేక అభిమానం ఉన్నది. అంతే కాకుండా ఆమె గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిగా కూడా సేవలు అందించారు. అనంతరం 1985లో రాజకీయాల్లోకి వచ్చి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ స్థానంలో దళిత దిగ్గజ నేతలు రాంవిలాస్ పాశ్వాన్, మాయావతిని ఓడించి లోక్‌సభలో ప్రవేశించారు.ఆ తరువాత ఢిల్లీలోని కరోల్ బాగ్ స్థానం నుండి గెలుపొందారు. 2004, 2009లో బీహార్‌లోని తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ససారాం స్థానం నుండి విజయం సాధించగా, గత ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మీరా కుమార్ మూడుమార్లు ఇక్కడికి వచ్చారు. ఒకసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. మరోసారి దళితులను పరామర్శించేందుకు సిరిసిల్లలో పర్య టించారు. ఇటీవల వరంగల్‌లో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు కూడా ఆమె హాజరయ్యారు.

ఆయా సందర్భాలలో మీరాకుమార్‌ను రాష్ట్రంలో పోటీ చేయించే అంశంపై ఆలోచన జరిగినట్లు తెలిసింది. గతంలో ఒకసారి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించిన మెదక్ స్థానంలో ఆమెను పోటీకి పెట్టడం ద్వారా టిఆర్‌ఎస్‌కు గట్టి పట్టున్న ప్రాంతంలో పాగా వేయొచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ స్థానం పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో కూడా బలమైన కాంగ్రెస్ నాయకులు ఉండడంతో పాటు , మీరా కుమార్ పోటీ కూడా కలిసి వస్తుందని భావించారు. మరోవైపు సిరిసిల్లాలో పర్యటించినందునే పొరుగున ఉండే లోక్‌సభ స్థానం పెద్దపల్లి నుండి కూడా పోటీ చేయించవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. మొన్న మెదక్‌కు వెళ్ళేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానం నుండి పోటీ గురించి ఆమెతో ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరి వద్ద ప్రస్తావించగా‘ మీరాకుమార్‌ను పోటీ చేయించే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామ’ని ధృవీకరించారు.