Home తాజా వార్తలు మెగా, అక్కినేని హీరోల… సినీ జాతర

మెగా, అక్కినేని హీరోల… సినీ జాతర

mega-heros

సరిగ్గా మరో పది రోజుల్లో సినీ జాతర మొదలుకాబోతోంది. సినీ ప్రియులు పండగ చేసుకోబోతున్నారు. ఈనెల 24 నుంచి ఇటు మెగా హీరోలు… అటు అక్కినేని హీరోలు తమ కొత్త సినిమాలతో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడిచేయనున్నారు. దాదాపు మూడు నెలల పాటు ఈ పండగ వాతావరణం నెలకొననుంది. మెగా, అక్కినేని కుటుంబ వారసులు కొత్త సినిమాలతో మెరుపులు మెరిపించబోతున్నారు.
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో ఈ సినీ జాతరకి రిబ్బన్ కట్ చేయబోతున్నాడు సాయిధరమ్‌తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈనెల 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సాయిధరమ్‌తేజ్ అద్భుతమైన డ్యాన్స్, పర్‌ఫార్మెన్స్, రెజీనా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు అని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు. పది రోజులు గ్యాప్ తీసుకొని అక్టోబర్ 2న వరుణ్‌తేజ్ ‘కంచె’ సినిమా విడుదల కానుంది. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలోని కథతో దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్‌తేజ్ సినిమాలో సైనికుడిగా దర్శనమిస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఇది. ‘కంచె’ వచ్చిన వారానికి ‘రుద్రమదేవి’ విడుదల కానుంది. బ్యూటీక్వీన్ అనుష్క టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు మెగా హీరోలకు కూడా లింక్ ఉంది. సినిమాలో గోనగన్నారెడ్డిగా నటించాడు అల్లుఅర్జున్. బన్నీ ఎంట్రీతో ‘రుద్రమదేవి’ బిజినెస్ రేంజ్ పెరిగింది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో ప్రత్యేకత. గుణశేఖర్ దర్శకనిర్మాతగా రూపుదిద్దుకున్న ‘రుద్రమదేవి’ అక్టోబర్ 9న కదనరంగంలోకి దూకనుంది. ఆతర్వాత అక్టోబర్ 16న రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ విడుదలకానుందని సమాచారం. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గెస్ట్ పాత్రతో చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఓ స్పెషల్ సాంగ్‌తో చాలాకాలం తర్వాత హాట్‌బ్యూటీ ఇలియానా ఈ తెలుగు సినిమాలో దర్శనమివ్వనుంది. అక్టోబర్‌లోనే పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుణ్‌తేజ్ సినిమా ‘లోఫర్’ కూడా విడుదల కానుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా హీరోలు సెప్టెంబర్‌లోనే సినీ జాతరకు తెరతీస్తే… అక్కినేని హీరోలు అక్టోబర్ నుంచి హవా చూపించడానికి సిద్ధమయ్యారు. అక్కినేని అఖిల్ తెరంగేట్ర చిత్రం ‘అఖిల్’ అక్టోబర్ 21న దసరా పండుగా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆస్ట్రియా, స్పెయిన్‌లలో సినిమాలోని రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వినాయక్. సయేషా సైగల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా భారీగా బిజినెస్ జరుపుకోవడం విశేషం. అక్టోబర్‌లో అఖిల్ వస్తుంటే… నవంబర్‌లో నాగచైతన్య సందడి చేయనున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తున్న సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. మంజిమ మోహన్ ఇందులో చైతూతో జోడీకట్టింది. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. అక్టోబర్, నవంబర్‌లను తనయులకు వదిలేసి… డిసెంబర్‌లో వచ్చేయడానికి సిద్ధమవుతున్నాడు అక్కినేని నాగార్జున. ఆయన నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ మరో నెలరోజుల్లో పూర్తికానుంది. కల్యాణ్‌కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఇందులో తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు నాగ్. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్లు. మొత్తానికి అటు మెగా… ఇటు అక్కినేని సినిమాలతో రానున్న 90 రోజులు బాక్సాఫీస్ దగ్గర మోతమోగనుంది.