Thursday, February 2, 2023

తండ్రికి ఇచ్చిన గొప్ప బహుమతి ‘సైరా’

- Advertisement -

saira-narasimha-reddyమెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా… నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ‘థాంక్యూ మీట్’లో చిత్ర కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ “12 ఏళ్ల కిందట నాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చెప్పారు పరుచూరి బ్రదర్స్. కథ బాగా నచ్చినప్పటికీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలంటే భారీ బడ్జెట్ కావాలి. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. చివరికి రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ‘ధ్రువ’ చిత్రాన్ని చూడగానే సురేందర్ రెడ్డి ‘సైరా’ చిత్రానికి న్యాయంచేస్తాడని అనిపించి అతన్ని దర్శకుడిగా తీసుకున్నాం.

ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఇప్పటివరకు చిరంజీవి నటించిన 150 సినిమాలు ఒకెత్తు… ‘సైరా’ మరొక ఎత్తు’ అని అందరూ అంటుంటే ఎంతో సంతోషంగా ఉంది”అని అన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ “కథ పూర్తయి నటీనటుల ఎంపిక జరిగిన తర్వాత నేను నిద్రలేని రోజులు చాలా గడిపాను. ఇంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం… ఇలాంటి సినిమాలు అసలు హిట్ అవుతాయా? ఇప్పటివరకూ ఇలాంటి సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి? అని వెనక్కి వెళ్లి చూసుకున్నాను. సినిమాలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. చిరంజీవితో పాటలు లేవు. అసలు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందా అని నాకు భయం వేసింది. అప్పుడు నాకు ఈ సినిమాలో దేశభక్తి మాత్రమే కనపడింది.

చిరంజీవి కూడా ఇదే నమ్మి ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు”అని తెలిపారు. జగపతిబాబు మాట్లాడుతూ “నాన్న మీద ప్రేమతో రామ్‌చరణ్ తీసిన చిత్రం ‘సైరా’. ఆయన తన తండ్రికి ఇచ్చిన గొప్ప బహుమతి ఇది. అన్ని భాషాల్లో ‘సైరా’ గొప్ప విజయాన్ని సాధించింది. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారు”అని పేర్కొన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ “స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఎంతో ఆనందంగా ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, తమన్నా, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, రత్నవేలు తదితరులు పాల్గొన్నారు.

Megastar Chiranjeevi Saira Narasimha Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles