Friday, March 29, 2024

స్కూల్లో హ్యాపీగా ఉంది

- Advertisement -
- Advertisement -

Melania

 

హ్యాపీనెస్ క్లాస్‌లనుంచి స్ఫూర్తి పొందా, ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
విద్యార్థుల స్వాగతానికి ఫిదా అయిన అమెరికా ప్రథమ మహిళ

న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యాపీనెస్ తరగతులనుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ దంపతుల భారత పర్యటన రెండో రోజులో భాగంగా మెలానియా మంగళవారం దక్షిణ మోతీబాగ్‌లోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సెకండరీ స్కూలును సందర్శించారు. అక్కడి హ్యాపీనెస్ తరగతులకు హాజరై వాటి నిర్వహణను పరిశీలించారు. చిన్నారులతో కాస్సేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘ నమస్తే.. ఈ అందమైన పాఠశాలలో మీ అందరినీ ఇలా కలవడం సంతోషంగా ఉంది. సంప్రదాయ పద్ధతిలో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.

నేను భారత్ రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను. భారత పర్యటన పట్ల అధ్యక్షుడు ట్రంప్, నేను ఎంతో ఆనందిస్తున్నాం. ఢిల్లీ పాఠశాలల్లో హ్యాపీనెస్ తరగతులను ప్రాంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రకృతితో మమేకమై విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం ఎంతో బాగుంది. విద్యార్థులకు నైపుణ్యాలను తెలియజేస్తూ నేటి సమాజానికి ఉదాహరణగా నిలుస్తున్న బోధకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని మెలానియా అన్నారు. అమెరికాలో తాను కూడా ‘బీ బెస్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

సంప్రదాయ పద్ధతిలో స్వాగతం..
కాగా అంతకు ముందు పాఠశాలకు విచ్చేసిన మెలానియాకు విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. భారతీయ పద్ధతిలో బొట్టు పెట్టి మంగళ హారతులతో స్వాగతం పలికారు. చిన్నారుల స్వాగతానికి మెలానియా మురిసిపోయారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. మెలానియా వెంట ముగ్గురుమహిళా టీచర్లు ఉన్నారు. టీచర్లు అడిగిన ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానం చెప్పారు.

పాటలు, సంగీతం, ఆటలపై తమకున్న మక్కువను వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేసిన నృత్యాలను మెలానియా తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమెరికా ప్రథమ మహిళకు ప్రత్యేక కానుకలు ఇచ్చారు. చిన్నారులు స్వయంగా వేసిన మధుబని పెయింటింగ్స్‌ను మెలానియాకు బహూకరించారు. అనంతరం విద్యార్థులకు మెలానియా షేక్‌హ్యాడ్ ఇచ్చి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయారు. మెలానియా రాక సందర్భంగా పాఠశాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

Melania is inspired by Happiness Classes
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News