Home ఆఫ్ బీట్ మనకెందుకనే ధోరణి వద్దు..!

మనకెందుకనే ధోరణి వద్దు..!

lf1
మానవహక్కులు జీవించే హక్కులో ఓ భాగం. జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ హక్కులు కాలక్రమంలో నిర్లక్షానికి గురవుతున్నాయి. కాబట్టి హక్కులను కాపాడేది ప్రజలు, వారు చేసే పోరాటాలే అంటూ కుల మత వర్గ భేదాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించే సామాజిక వ్యవస్థ కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులతో సకుటుంబం చర్చా గోష్టి…

మానవ హక్కులను పరిరక్షించాలనే ఆలోచన ఎలా మొదలైంది…
మానవ హక్కులను పరిరక్షించడానికి 2016లో ఆరుగురం కలిసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థను ఏర్పాటుచేశాం. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హక్కును హరించటం జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణలు ఎన్నో. అలా కళ్లముందు కదలాడుతున్న సమస్యలను చూసి మానవతా దృక్పథంతో హక్కులను రక్షించడానికి అడుగులు వేశాం. ఆరుగురితో మొదలైన మా సంస్థ ఇప్పుడు వేల మందితో ముందుకు సాగుతుంది. నిస్వార్థంతో హృదయపూర్వకంగా ప్రజల మేలుకోరి పనిచేసే వాళ్లందరికీ (సభ్యులు కె.అనంత్‌నాగ్ శర్మ, ఎమ్. సుబ్బారెడ్డి, మాలతిలత, బాలాజి సుందరం, కొంకటి శ్రీనివాస్, కె.శ్రీనివాసరావు ) స్వాగతం పలుకుతున్నాం.
మీ సంస్థ లక్షం ఏమిటి?
సమాజంలో రేపటి వెలుగుల కోసం అందరం కదులుదాం. ఒక్క అడుగు వేస్తే వారివెనుక లక్షలాది అడుగులు పడతాయని చెప్పే ఓ మంచి సందేశాత్మక సంపూర్ణ నవనిర్మాణం కోసం కృషి చేయడం. హక్కుల పరిరక్షణపై పోరాడటం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లక్షం.
ఎలాంటి హక్కుల కోసం మీ పోరాటం…
ఈ సమాజంలో ముఖ్యంగా మన దేశంలో అంటరానితనం, కులాంతర, మతాంతర వివాహాలు, వరకట్నవేధింపులు, అవినీతి, లైంగికవేధింపులు, బాలకార్మికులు, భ్రూణహత్యలు, గృహనిర్బంధం, బాల్యవివాహాలు, భూకబ్జాలు, ఇలాంటి హక్కుల గురించి అవగాహన కల్పించడం. సమాజంలో వివిధ వర్గాల ప్రజలు నిత్యజీవితంలో హక్కులపై అవగాహనలేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిరక్షించుటలో మా సంస్థ గట్టిపునాది వేస్తోంది. ప్రతి ఒక్కరూ తమ హక్కుల సంరక్షణకు నిర్భయంగా నిలబడి పోరాడాల్సిన అవసరం ఉంది.

ph0
ఇప్పటి వరకూ ఎన్ని, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు…
దేశవ్యాప్తంగా ఎక్కడ హక్కును హరించివేసిన సమాచారం మాకు అందగానే అక్కడికి వెళ్లి స్పందిస్తుంటాం. బాధ్యులకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తుంటాం. ఇప్పటి వరకూ 56 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం. మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సంస్థగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు సామూహికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ సమస్య ఏదైనా ఎదురైనపుడు తక్షణమే స్పందిస్తాం. సమస్య నివారణోపాయాలకు కృషి చేసి న్యాయం జరిగేలా చూస్తాం. వ్యక్తిగతంగా కానీ సామాజికపరంగా కానీ న్యాయ సమస్యలకు చట్టపరమైన సహాయం అందించడం. సామాజిక న్యాయం కోసం పోరాడటం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం.
హక్కుల గురించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు…
మానవ హక్కుల గురించి అవగాహన లేక వివిధ వర్గాల ప్రజలు నిత్యజీవితంలో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యావత్ దేశానికి భవిష్యత్తు నిర్దేశించేది ప్రజలే. కాబట్టి ఇక్కడ తడబడుతూ నిలబడలేకపోతే మనకు తరతరాలుగా మిగిలేది బాధలే. అందుకు మనకు కావాల్సింది ఐకమత్యం, బలమైన సంఘం. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూడిన చర్యలు తీసుకునే సమర్థవంతమైన నాయకత్వాన్ని, నేటి సమాజంలో మానవ హక్కులకు బలమైన పునాదులు పడితేనే సమస్యలు లేని సమాజాన్ని నిర్మించగలం.
అవినీతి నిర్మూలనకు మార్గాలేమిటి…
ఈ దేశంలో, ప్రపంచంలో అవినీతిని నిర్మూలించాలంటే యువత, ప్రజలు ఐకమత్యంతో నడుంబిగించి ఈ దుర్మార్గాన్ని తరిమికొట్టాలి. భారత రాజ్యంగంలో ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచిన వ్యక్తి, జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం గౌరవంతోపాటు తదితర అంతర్జాతీయ ఒప్పందాలతో ఏర్పడిన భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలో అమలు పరచేవే మానవ హక్కులు. హక్కు వుంటే దాని పక్కనే ఉల్లంఘన ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. అతి తక్కువ కాలంలోనే దేశంలో హక్కుల గురించి తెలియజేయడం, అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడంలో మా సంస్థ ముందుంది.
మీ నినాదం ఏమిటి…
నాకు (మనకు) ఎందుకులే అనే అలసత్వం, నిర్లక్షం వీడనాడాలి. నేనొ క్కడినే అడుగులు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిరాసక్తత వీడి రండి చేతులు కలపుదాం, సమ సమాజ స్థాపనకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియాగా కదులుదాం. మన హక్కులను గుర్తుంచుకుని వాటిని ఉపయో గించుకుందాం.
ప్రతి ఒక్కరం హక్కు కోసం స్వరంపెంచుదాం. భావి భారత బాధ్యతాయుత పౌరులుగా ఉనికిని చాటుతూ బంగారు భవిష్యత్తు కోసం మానవ హక్కులను కాపాడుదాం. హ్యూమన్ రైట్స్‌గా అందరం ఐక్య మ వుదాం. మతం మహమ్మారిని అంతం చేద్దాం. కుల రహిత సమాజం నిర్మి ద్దాం. బాధ్యతను గుర్తించి సమాజానికి తోడ్పడుదాం రండి కదలి రండి.

బొర్ర శ్రీనివాస్