Home Default ఇతరులతో పోల్చుకోవడం సరికాదు

ఇతరులతో పోల్చుకోవడం సరికాదు

Mental courage for preparing supplementary exams

 

జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారత దేశ విద్యావ్యవస్థలో పదవ తరగతి ఒక మైలురాయి. తన జీవన ప్రయాణంలో మొట్ట మొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు. విద్యార్థి ఒక గమ్యాన్ని ఎంచుకోవడంలో ఈ పది ఫలితాలు దోహదం చేస్తాయని, ఫలితాల ఆధారంగా లక్ష్య నిర్దారణ చేసుకోవాలి. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిలయ్యామనో బాధ పడొద్దు. మార్కులు, ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి. అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో ధైర్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.

విద్యార్థులకు మార్కులు కాదు విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా విద్యార్థులు డిప్రెషన్‌కు గురి కాకూడదు.

ప్రతిభకు మార్కులు కొలమానం కాదు: విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానేకాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశప్రతిష్టగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్ట కూడదు.

స్థాయికి మించి లక్ష్యనిర్దారణ : స్థాయికి మించి లక్ష్యాలను పెట్టుకోవడం వాటిని చేరుకోలేక ఏం చేయాలో తెలియక, చెడు ఆలోచనలు మనసులో చేరడం మూలంగా ఆత్మహత్యల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి.

అవకాశాలను తెలియజేయాలి: పదవతరగతి ఫెయిల్ అయిన వారికి ఓపెన్ స్కూల్ తెలంగాణ ద్వారా చదువుకోవడానికి మంచి అవకాశం ఉంది. పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి ఉత్తీర్ణత పొందే అవకాశాలున్నాయనే నమ్మకాన్ని కలిగించాలి.

అండగా ఉండాలి : పదవ తరగతి ఫలితాల ప్రకటన కంటే ముందే పాఠశాలలో ఒక రోజు తల్లిదండ్రులు, విద్యార్థులతో స మావేశం నిర్వహించి, ఏ విద్యార్థి అధైర్యపడకూడదని, నిరుత్సాహానికి గురికావద్దని, తాము అండగా ఉన్నామని ఉపాధ్యాయులు విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లల గురిం చి అత్యధిక అంచనాలను కలిగి ఉండకూడదని, పిల్లల వాస్తవిక స్థాయిని గుర్తించేలా తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి.

సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధ్దతతో మానసిక ధైర్యం : ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థిని సన్నద్ధ్దం చేయగలిగితే విద్యార్థిలో మానసిక ధైర్యం పెరుగుతుంది. సబ్జెక్టులవారీగా ఫెయిలైన విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం పాఠశాలలో సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైన పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులైన స్థానిక యువత సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఒక్కొక్క సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడానికి గల కారణాలను విశ్లేషించి, పునర్బోధన ద్వారా పునరభ్యాసం కల్పించాలి. తక్కువ గ్రేడ్ వచ్చిందని నిరుత్సాహపడే విద్యార్థుల కోసం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గురించి తెలియజేసి దరఖాస్తు చేయించాలి.

స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు : విద్యార్హతలను బట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో అవకాశం ఉంటుంది. పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో చేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సులతో స్వతహాగా ఎవరిపై ఆధారపడకుండా బతకగలమన్న భరోసా ఉంటుంది.

ఆందోళన, ఒత్తిడిలు దూరం కావాలి: పాఠశాల విద్యాగమనంలో పబ్లిక్ పరీక్షలు ఒక మజిలీ వంటివి. భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఎన్నో రాయాల్సి ఉంటుంది. పది పరీక్షల గురించి ఏ విద్యార్థి కూడా ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటులు దూరం చేసుకోవాలి. పరీక్షల కన్నా జీవితం చాలా విలువైందని, జీవితం గొప్పతనాన్ని గుర్తించాలి. విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, జీవితం పట్ల నమ్మకాన్ని పెంచుకొని భవితకు బాటలు సుగమం చేసుకోవాలి.

పాఠశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు : పాఠశాలల్లో విద్యార్థుల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. కౌన్సెలింగ్ కేంద్రంలో ఒక సైకాలజిస్ట్‌ను నియమించాలి. పిల్లల మానసిక తత్వాన్నిబట్టి పిల్లల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఉత్తీర్ణత ప్రమాణాలను, నాణ్యతను పెంచడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, ఫెయిల్ అయిన వారిని గుర్తించి వీరిని ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కోర్సులలో చేర్పించడం, చదువులో వెనుకబడిన విద్యార్థులను వృత్తి విద్యా కోర్సుల వైపు ప్రేరేపించి జీవన నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది.
విద్యార్థులు నిరాశకు లోనుకావద్దు. మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి. పరీక్షల్లోని మార్కులే జీవితానికి ప్రామాణికం కాదు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యకు ఎదురొడ్డి నిలిచినపుడే శిఖరాలకు చేరుకోగలుగుతారు.

                                                                                            – డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
Mental courage for preparing supplementary exams