Tuesday, April 16, 2024

ఐటి అధికారుల పేరుతో వ్యాపారి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇన్‌కంట్యాక్స్ అధికారులమని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…యూసుఫ్‌గూడ, నవోదయ కాలనీకి చెందిన బివి మురళీకృష్ణ వ్యాపారం చేస్తున్నాడు. గత నెల 27వ తేదీన తన కుమార్తె శరణ్య, కుమారుడు మాస్టర్ తేజను లాల్‌బంగ్లా వద్ద ఉన్న నీరజ్ పబ్లిక్ స్కూల్‌లో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. పిల్లలను పాఠశాలలో దింపి తిరిగి వస్తుండగా అమీర్‌పేట వద్ద ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆపి తాము ఇన్‌కంట్యాక్స్ అధికారులమని చెప్పి బలవంతంగా ఇన్నోవా కారు(ఎపి 16డిసి 6999)లోకి బలవంతంగా ఎక్కించారు. కారులోకి ఎక్కిన తర్వాత అందరూ కలిసి తీవ్రంగా కొట్టారు.

అరవకుండా ఉండేందుకు ముందుగానే నోటిని నొక్కిపెట్టారు. అరిస్తే భార్య,పిల్లలను చంపివేస్తామని బెదిరించారు. తర్వాత కారులో రామోజీ ఫిల్మీ సిటీ వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడి బాట సింగారం రోడ్డు వైపు తీసుకుని వెళ్లి వెంటనే ఇన్‌కంట్యాక్స్ కింద రూ.60లక్షలు చెల్లించాలని లేకుండా జైలుకు పంపిస్తామని బెదిరించారు. అంతేకాకుండా అతడి భార్యను కూడా అరెస్టు చేస్తామని బెదిరించారు. ఇప్పటికే మీ బావమర్ది రాజేష్‌ను అరెస్టు చేశామని చెప్పి అతడితో ఫోన్‌లో మాట్లాడించారు. తనను ముగ్గురు వ్యక్తులు పట్టుకున్నారని, తనకు తన పిల్లలకు హానీ చేస్తామని బెదిరిస్తున్నారని ఏడుస్తు చెప్పాడు. దీంతో తన భార్యకు ఫోన్ చేసి తన స్నేహితులను కలవమని వారు డబ్బులు ఇస్తారని చెప్పాడు. తెలిసిన వారి వద్ద నుంచి రూ.30లక్షలు వసూలు చేసి నిందితులు చెప్పినట్లుగా నాంపల్లి రైల్వేస్టేషన్ రోడ్డు వద్ద 4గంటలకు ఇచ్చారు.

డబ్బులు అందిన తర్వాత నిందితులు తనను హయత్‌నగర్‌కు తీసుకుని వచ్చి వదిలేసిపోయారు. వెంటనే బాధితుడు ఇంటికి చేరుకున్నాడు. ఇన్‌కంట్యాక్స్ కడితే తనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ రావాల్సి ఉంది, కాని డబ్బులు చెల్లించినా సర్టిఫికేట్ రాకపోవడంతో ఇది ఇన్‌కంట్యాక్స్ అధికారుల పనికాదని గ్రహించాడు. వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎనిమిది మందిపై ఫిర్యాదు చేయగా పోలీసులు 341, 342, 363, 386, 506 ఐపిసి కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News