Home తాజా వార్తలు కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు

కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు

shyam-prasad-reddy

n ఈ పనుల ఒప్పందం విలువే 11వేల కోట్లు
n కాళేశ్వరం తెలంగాణ వరదాయిని
n దాదాపు 64% పనులు పూర్తయ్యాయి
n మేడిగడ్డ-ఎల్లంపల్లి పనులు 90% జరిగాయి
n కేసులతో అడ్డుపడడం సిగ్గుచేటు
n రీడిజైనింగ్‌తో రెండుపంటలకు నీళ్లు
n ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండు దశల స్థిరీకరణ
– రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదాయిని అని, ఇప్పటి వరకు దాదాపుగా 64 శాతం పనులు పూర్తయ్యాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మంగళవారం నాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను, పనులు కాలేదన్న ప్రచారం చేస్తున్న తీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన నిర్మాణాలకు రూ.50వేల కోట్లు ఖర్చు అయ్యాయనడం సత్య దూరమన్నారు. అసలు ఈ పనుల ఒప్పంద విలువనే రూ.11వేల కోట్లు. సవరణ అంచనా వ్యయాలు రూ.2వేల కోట్ల వరకు పెరిగే అవకాశముందే తప్ప రూ.50వేల కోట్లు కాబోదని, ఆరోపణలు సత్యదూరమన్నారు.

ఏ ప్రాజెక్టు నుంచైనా దశల వారీగా నీటి విడుదల ఉంటుందని, కాళేశ్వరంలోనూ అదే పాటిస్తున్నాని, గతంలో ఎస్సారెస్పీ ద్వారా ఏకంగా 7-8 దశల్లో నీటి విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ప్రాజెక్టు పరిధిలో అందుబాటులోకి వచ్చిన కాల్వల నిర్మాణం ఆధారంగా రిజర్వాయర్లలో నీళ్లు నింపుకొని సాగునీరు విడుదల చేస్తారని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమయంలోనూ నీటి విడుదల చేసినపుడు నాల్గింట ఒక వంతు కాల్వల నిర్మాణం కూడా జరగలేదన్నారు. అయినా నీటిని విడుదల చేశారని, మొదటిసారి నీటిని విడుదల చేసినపుడు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని చాలా ఆయకట్టుకు సాగునీరు అందలేదన్నారు. కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేసి దశలవారీగా విస్తరించారన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినపుడు ప్రధాన కాల్వ మినహా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాలేదన్న శ్యాంప్రసాద్‌రెడ్డి… తొలుత ప్రధాన కాల్వ ద్వారా చెరువులను నింపామన్నారు. అదేరీతిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పుడు నీటి విడుదల చేసి, అందుబాటులో ఉన్న వ్యవస్థ ద్వారా సాగునీరు అందిస్తారని చెప్పారు.
ఎస్సారెస్పీ రెండు దశల స్థిరీకరణ
ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటి విడుదలతో శ్రీరాంసాగర్ రెండు దశల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ జరగనుండటం సంతోషకరమైన విషయమని శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందున 250 రోజుల పాటు నీటిని ఎత్తిపోసుకునే అవకాశముందని, అక్కడి నుంచి ఎల్లంపల్లికి చేరిన నీటితో శ్రీరాంసాగర్ ఆయకట్టుతో పాటు శ్రీరాంసాగర్ స్టేజ్ 1, స్టేజ్ 2ల ఆయకట్టుకు సాగునీరు వెళుతుందని వివరించారు. ప్రధానంగా కాళేశ్వరం ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు మరో 18.75 లక్షల ఎకరాల స్థిరీకరణ కూడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కేసులతో అడ్డుపడడమా…?
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కారు కేసులు వేయడం అర్థం చేసుకోవచ్చని, కానీ మన ప్రాంతం నాయకులే కేసులు వేయడం దురదృష్టకరమన్నారు. గోదావరిజలాలు వృథాగా సముద్రంలోకి పోకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టుల్ని చేపడుతుంటే విమర్శించడం సమంజసం కాదన్నారు. గతంలో ఎస్సారెస్పీ కాల్వల్లో 2-3వేల క్యూసెక్కులు పారడమే గగనంగా ఉండేదని, కానీ తెలంగాణ సర్కారు రూ.800 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులతో పూర్తిస్థాయి డిశ్చార్జి ప్రవాహం కూడా ఉంటుందన్నారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నందున… వరుసగా రెండు, మూడు సంవత్సరాలు వర్షాలు సకాలంలో రాకున్నా తాగు, సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఇప్పటికైనా అందరూ ఈనెల 21న జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలను ఒక పండగలా జరుపుకోవాలని, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని శ్యాంప్రసాద్‌రెడ్డి కోరారు.
రీడిజైన్‌తో రెండు పంటలకూ నీళ్లు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్క పంట కోసం మాత్రమే చేపట్టాలని సూచించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాత్రం రెండు పంటల కోసం రీడిజైన్ చేశారని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వెంకట్రామారావు అన్నారు. ఈ నేపథ్యంలో గతంలో రూ.40వేల కోట్లున్న ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పుడు రూ.80వేల కోట్లకు పెరగడంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని… ముఖ్యంగా గతంలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిజైన్ చేస్తే ఇప్పుడు ఏకంగా స్థిరీకరణతో సహా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేయడం విశేషమన్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ప్రాజెక్టును హర్షించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఉత్తర తెలంగాణకే కాకుండా యావత్తు తెలంగాణకు వరప్రదాయిని అని, ఈ క్రమంలో ప్రాజెక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఏ ఒక్కరూ మాట్లాడవద్దని విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి కోరారు.

జయప్రకాష్ నారాయన ఎత్తిపోతల పథకాలతో ఎకరాకు రూ.40 నుంచి 50 వేల కరెంటు చార్జీలు అవుతాయంటూ చేస్తున్న ప్రచారాన్ని రిటైర్డ్ ఇంజనీర్ భూమయ్య తప్పుపట్టారు. ప్రభుత్వమే విద్యుత్తు ఛార్జీలు భరించేందుకు ముందుకొస్తుండగా రైతులపై భారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు అని దీని ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగం, పర్యాటకం, మత్స్య, కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి రంగం అభివృద్ధితో పాటు పట్టణాలకు తాగునీరు పుష్కలంగా లభించనుండటంతో జీడీపీ వృద్ధి కూడా బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఇంజినీర్లు కెప్టెన్ జనార్ధన్, సత్తిరెడ్డి, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

mereddy shyam prasad reddy speech on kaleshwaram