Home తాజా వార్తలు సత్య నాదెళ్ల భారత్ పర్యటన

సత్య నాదెళ్ల భారత్ పర్యటన

Microsoft CEO Satya Nadella

 

24 నుంచి పర్యటించవచ్చని కంపెనీ వెల్లడి

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఒ) సత్య నాదేళ్ల ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. సంస్థ గురువారం ఈ సమాచారం ఇచ్చింది. అయితే నాదేళ్ల పర్యటన తేదీలు వెల్లడించలేదు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు నాదెళ్ల భారత పర్యటించవచ్చని వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. ఈ సమయంలో ఆయన న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబైలను సందర్శిస్తారు. నాదెళ్ల దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా కలిసే అవకాశముంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నాదెళ్ల్ల సమావేశం ఉండొచ్చని తెలుస్తోంది. గత నెలలో నాదెళ్ల భారతదేశ వలస విధానాన్ని ప్రశ్నించారు.

భారత్‌లో సిఎఎ(పౌరసత్వ సవరణ చట్టం)పై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నాదెళ్ల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై నాదెళ్ల మాట్లాడుతూ, భారతదేశంలో ఏమి జరిగిందో అది విషాదకరమని అన్నారు. వలస వచ్చిన బంగ్లాదేశ్‌వాసి భారతదేశంలో ఒక పెద్ద కంపెనీని ప్రారంభిస్తే లేదా ఇన్ఫోసిస్ వంటి సంస్థకు సిఇఒగా మారితే తాను సంతోషంగా ఉంటానని అన్నారు. నాదెళ్ల చేసిన ఈ ప్రకటనను బిజెపి ఖండించింది. అయితే మైక్రోసాఫ్ట్ తర్వాత నాదెళ్ల తరపున ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి దేశానికి తన సరిహద్దులను రక్షించుకునే హక్కు ఉందని తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు.

విదేశీ సంస్థలపై కఠినంగా ప్రభుత్వం
మైక్రోసాఫ్ట్, టెక్నాలజీ రంగంలోని ఇతర సంస్థలకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా ఉంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కలిగి ఉంది. ఇది యుఎస్ వెలుపల సంస్థ అతిపెద్ద కేంద్రం. భారత సంతతికి చెందిన నాదెళ్ల కూడా హైదరాబాద్‌లో పెరిగారు. టెక్నాలజీ రంగంలో విదేశీ కంపెనీలకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది. గత సంవత్సరం భారతదేశంలో డేటాను నిల్వ చేయాలనే నిబంధన అమలు చేశారు.

భారత్ పర్యటనలో జెఫ్ బెజోస్‌పై వ్యతిరేకత
గత నెలలో అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్ కూడా భారతదేశాన్ని సందర్శించారు. అయినప్పటికీ ప్రధానమంత్రిని లేదా ప్రభుత్వ ప్రతినిధులు ఎవరినీ కలవలేదు. అమెజాన్ విధానాలను వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ప్రశ్నించారు. బెజోస్‌ను రిటైల్ వ్యాపారులు కూడా వ్యతిరేకించారు. అమెజాన్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దర్యాప్తు చేస్తోంది.

Microsoft CEO Satya Nadella to visit India this month