Home ఆఫ్ బీట్ పేదల ఆకలి తీర్చే అక్షయపాత్ర

పేదల ఆకలి తీర్చే అక్షయపాత్ర

“మా పిల్లలంతా విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ మమ్మల్ని చూసేవారు లేరు. ఒక పూట భోజనం ఇక్కడే చౌకగా దొరుకుతోంది. ఈ పథకం మా లాంటి వృద్ధ్దులకు ఎంతో మేలు.” అంటున్నారు మింట్ కాంపౌండ్ దగ్గర భోజనం చేస్తున్న ఓ వృద్ధ జంట.  “హైదరాబాద్‌లో ఐదు రూపాయలకు కనీసం టీ కూడా దొరకదు. అలాంటిది కడుపునిండా భోజనం పెడుతున్న ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే…” మాదాపూర్ కేంద్రంలో నిత్యం  అక్షయపాత్ర భోజనం చేసే వినోద్ అంటున్నారు.

Mid-day-Meals

హైదరాబాద్ సమీప జిల్లాల్లో అమలవుతూ, పేదల ఆకలి తీర్చే ‘భోజనమిత్ర’ కార్యక్రమం మరింత మందికి చేరువ కాబోతోంది. వేడి వేడిగా.. ఆహారాన్ని గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా అక్షయపాత్ర సంస్థ రంగారెడ్డిజిల్లా నార్సింగ్, సంగారెడ్డి జిల్లా కందిలో అధునాతన వంట గదులను నిర్మించింది. ఆవిరితో వంట, ప్రత్యేక వంట పాత్రలు, త్వరగా తయారీ విధానం వీటి ప్రత్యేకత. వ్యర్థ జలాలను పూర్తిగా శుద్ధి చేసి తిరిగి ఉపయోగించడం ఇక్కడి ప్రత్యేకత. సౌర విద్యుత్తు, కాయగూరల వ్యర్థాలతో విద్యుదుత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో వివిధ చోట్ల రూ.5 భోజనంతో సామాన్యులకు కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదు. రోజూ 60వేల మందికిపైగా అన్నపూర్ణ కేంద్రాల సేవలను వినియోగించుకుని ఒక పూట అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. లబ్ది పొందుతున్న వారిలో ఉద్యోగులు, వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే నిరుద్యోగులు, కాంట్రాక్ట్ కూలీలు, ఇతర పనులు చేసుకునేవారు ఉన్నారు.
150 కేంద్రాలు… గతంలో కేవలం నలభై మాత్రమే ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను ప్రభుత్వ అనుమతి తీసుకుని 150 కు పెంచడంతో ఆయా వర్గాలకు మరింత ఉపయోగం చేకూర్చినట్లయింది. అయితే, నిర్వహణ బాధ్యత చూసుకునే హరేకృష్ణ ఉద్యమ సంస్థకు ఆహారం తయారీ కష్టంగా మారింది. భోజనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ డం, ఆ మేరకు సౌకర్యాలు లేకపోవడం నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. దీంతో నార్సింగికి తోడు ఇటీవల సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతంలో నాలుగు ఎకరాల్లో హరేకృష్ణ సంస్థ ఓ అత్యాధునిక పాకశాలను నిర్మించింది.

కార్పొరేట్ సంస్థల తోడ్పాటుతో… నార్సింగ్‌లోని వంట శాల నిర్మాణానికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.20కోట్లను, కంది వంటశాలకు ఇన్ఫోసిస్ సంస్థ రూ.18.3 కోట్లను సాయం చేసిందని, రాష్ర్ట ప్రభుత్వం ఇతరత్రా సహకారం అందించిందని హరేకృష్ణ (అక్షయపాత్ర) సంస్థ తెలిపింది. పర్యావరణహిత విధానాలతో వంటశాల నిర్మాణం ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. భవిష్యత్తులో అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున గరిష్ఠంగా ఒకేసారి 2 లక్షల మందికి భోజనాన్ని సిద్ధం చేసేలా వంటగదులను నిర్మించామని వారన్నారు.

ఆకలిలేని సమాజం కోసం : ‘వంటల కోసం రోజూ వందల కిలోల కాయగూరలు వాడుతాం. వాటి వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ప్లాంట్ నెలకొల్పాం. వంటకు సౌర విద్యుత్తు కూడా వాడుతున్నాం. అతి తక్కువ నీటిని ఉపయోగించి వ్యవసాయం చేయడం, ప్రాంగణంలోనే రోజూ 300 కిలోల కూరగాయలను పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వంటశాలల నుండి పాఠశాలలకు, మధ్యాహ్నభోజనం, రూ.5 భోజన కేంద్రాలను భోజనాన్ని తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చుతున్నాం.

క్రమంగా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించుకుంటూ వెళ్లడం, ఆకలి సమస్యను లేకుండా చేయడం అనే మా ఆశయానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని సాయం అందిస్తోంది. అరబిందో ఫార్మాఫౌండేషన్, ఇన్ఫోసిస్ సంస్ధల తోడ్పాటునందిస్తున్నాయి’ అన్నారు అక్షయపాత్ర సంస్థ ప్రతినిధి కౌటయ్య దాస.మార్కెట్ నుండి వంటశాలలకు చేరే ముడిసరుకులను వంటకు ముందు, తరువాత నాణ్యత పరీక్షలు జరిపిన తరువాతే వండిన ఆహారాన్ని బయటకు పంపుతారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ల్యాబొరేటరీ ఉందని నార్సింగ్‌లోని ఫుడ్ ఇన్‌చార్జిలు శ్రీకాంత్, సందీప్ రెడ్డి అన్నారు.

వంటశాలల విశిష్టతలు

* ఉదయం 5 గంటలకు ఆహారం సిద్ధమై కంటైనర్స్‌లో
40 వాహనాల్లో ఆయా ప్రాంతాలకు చేరుస్తారు.
* అక్షయపాత్ర వంటశాలల నుండి 150 కేంద్రాలకు భోజనం
సరఫరా అవుతుంది.
* గంటలో అరవై వేల మందికి భోజనం తయారు చేసే సాంకేతికత.
* రోజూ 40వేల మందికి రూ.5ల భోజనం తయారు.
* నాలుగు ప్రభుత్వ హాస్టల్స్‌తో సహా 20వేల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిత్యం సరఫరా.

పేదోడి ఆకలికి సర్కారు అండ

ఐదు రూపాయలకే అన్నం కార్యక్రమం హైదరాబాద్‌లో 2014లో కేవలం 8కేంద్రాలలో ప్రారంభమైంది. క్రమంగా ఇపుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 కేంద్రాలకు విస్తరించి, ప్రతిరోజూ 25వేల మందికి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఆహారం అందుతోంది. లబ్దిదారుల నుండి రూ.5మాత్రమే వసూలు చేయగా మిగతా ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ద్వారా భరిస్తోంది. వంటశాల నిర్వహణ అంతా హరేకృష్ణ సంస్థ(అక్షయపాత్ర) పర్యవేక్షిస్తోంది.

శ్యాంమోహన్
మనతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి