Home ఎడిటోరియల్ తిండి పిల్లలది, భోజ్యం పెద్దలది

తిండి పిల్లలది, భోజ్యం పెద్దలది

Mid-day-Mealకటిక పేదరికంతో కటకటలాడే కుటుంబాల పిల్లలకు సమగ్ర పోషకాహారం అందించి పోషించడంతోపాటు చదువులు నేర్పించాలన్న లక్షంతో 1995లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం పెద్దల భోక్తంగా వర్థిల్లుతోంది. దాదాపు 11 కోట్ల మంది పిల్లలకు ఈ పథకాన్ని వర్తింప చేసి పాతికేళ్లు కావస్తున్నా అవకతవకలకు అడ్డుకట్ట పడడం లేదు. రానురాను లబ్ధిదారుల సంఖ్య తక్కువై పెద్దల కక్కుర్తి ఎక్కువవుతోంది. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే దాదాపు 80 లక్షల లబ్ధిదారులైన పిల్లల సంఖ్య తగ్గిపోయింది. 2015-16లో దాదాపు 11 కోట్ల మంది ఈ పథకం నుంచి లబ్ధిపొందగా, 2018-19 నాటికి 9.17 కోట్లకు పిల్లల సంఖ్య తగ్గింది. ఈ పరిస్థితికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కుల వివక్ష, నిధుల కొరత, నిధుల స్వాహా, నిధుల మళ్లింపు, అక్రమాలు ఇవన్నీ కలిసి పథకానికి తూట్లు పొడుస్తున్నాయి.

1995లో ఈ పథకం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎక్కడో ఒక చోట స్వాహా బాగోతాలే సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం తమిళనాడులో ఈ పథకానికి సంబంధించి 2400 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది. భోజనాన్ని సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాకంలో మంత్రులు, అధికారులు, రాజకీయ నేతల భాగస్వామ్యం ఉండడం విశేషం. గుట్కా స్కామ్‌తో సమాంతరంగా ఈ భోజన పథకం స్కామ్ సాగడం గమనార్హం. దాదాపు 39.31 కోట్లు ఇందులో లంచాల రూపంలో చేతులు మారినట్టు బయటపడింది. 2015లో కాగ్ నివేదిక మధ్యాహ్న భోజన పథకంలోని అవకతవకలను ఎత్తి చూపింది. 123.29 కోట్ల నిధులు దారి మళ్లాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఈ పథకం అమలుపై సరైన పర్యవేక్షణ నిర్వహించడం లేదు.

భోజనం నాణ్యత గురించి అసలు పట్టించుకోవడం లేదు. 2013 జులై 16న బీహార్‌లో మధ్యాహ్న భోజనం ఆరగించిన 27 మంది పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వంటకు ఉపయోగించే నూనెను పురుగు మందుల స్టోర్‌లో నిల్వ చేయడం వల్లనే ఆ నూనెతో వండిన భోజనం కలుషితమైందని పిల్లల మృతికి అదే కారణమని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. దీన్ని బట్టి భోజనం నాణ్యతలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పవచ్చు. కర్నాటక లోని బళ్లారి జిల్లాలోని రెండు తాలూకాల్లో 304 స్కూళ్లలో పిల్లలకు అందించే భోజనంలో 1.04 లక్షల కిలోలు తక్కువగా ఉన్నట్టు బయట పడింది.

దీనికి తోడు కొన్ని చోట్ల కుల వివక్ష ఈ పథకానికి ఆటంకంగా తయారైంది. భోపాల్‌లోని టికమ్‌గత్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో మొత్తం 89 మంది విద్యార్థుల్లో కేవలం 10 మంది మాత్రమే భోజనం చేస్తున్నారు. దీనికి కారణం షెడ్యూల్డు కులాల మహిళలు భోజనం తయారు చేయడం. తమ తల్లిదండ్రులు ఈ భోజనం తిన వద్దని తమకు హెచ్చరించినట్టు విద్యార్థులు చెప్పారు. రాజస్థాన్, ఒడిశా, కర్నాటక, మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో కూడా కుల వివక్ష కొనసాగుతోంది.

ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం ఏవో సాకులు చూపుతుందే తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కంటి తుడుపుగా చర్యలు తీసుకున్నారు. దేశం మొత్తం మీద గత మూడేళ్లలో మధ్యాహ్న భోజనం ఆరగించిన వారిలో 900 మంది కన్నా ఎక్కువ మంది అస్వస్థులైన మాట నిజమే అయినా ఎవరూ చనిపోలేదని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్థించుకోవడం హాస్యాస్పదం. భోజనాల నాణ్యత బాగోలేదని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 35 ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా లోపాలు, అక్రమాలు తగ్గడం లేదు.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 260 స్వయం సహాయక గ్రూపులను బ్లాక్ లిస్టులో పెట్టింది. జనవరి మార్చి నెలల మధ్యలో తనిఖీ చేయగా ఈ గ్రూపుల నిర్వాకం బట్టబయలైంది. లక్నో శివారు మలిహాబాద్ ప్రైమరీ స్కూలులో నాణ్యత లేని ఆహారం అందించడమేకాక, మెనూ ప్రకారం పాలు ఇవ్వకుండా కక్కుర్తి పనులు చేస్తున్నారు. ఆంధ్రలోని విశాఖ జిల్లాలో మధ్యాహ్న భోజనంలోని అవకతవకలకు బాధ్యులైన ముగ్గురు హెడ్మాస్టర్లను గత ఏప్రిల్ 15న సస్పెండ్ చేశారు. గత డిసెంబర్‌లో మధ్యాహ్న భోజనం అమలులో రాష్ట్రాలు సీరియస్‌గా వ్యవహరించడం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఆంధ్ర, ఒడిశా, జమ్ముకశ్మీర్, ఢిల్లీ రాష్ట్రాలకు లక్ష రూపాయల వంతున జరిమానా విధించింది.

2 లక్షల మంది కో ఆర్డినేటర్లు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఎంత వరకు నాణ్యమైన భోజనం ఏ విధంగా ఎంత మొత్తంలో అందిస్తున్నారో పర్యవేక్షించడానికి రీ సోర్స్ కో ఆర్డినేటర్లను నియమించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉపాధ్యాయులకు ఈ మేరకు అదనపు బాధ్యతలు అప్పచెప్పడంతోపాటు ప్రభుత్వేతర సేవా సంస్థల ప్రతినిధులకు కూడా ఇందులో బాధ్యతలు అప్పచెబుతారు. ఆరు నుండి పది స్కూళ్ల వరకు రీసోర్స్ కో ఆర్డినేటర్లు పరీక్షించవలసి వస్తుంది. ఈ విధంగా దేశం మొత్తం మీద రెండు లక్షల మంది కో ఆర్డినేటర్లను ప్రభుత్వం నియమిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంతోపాటు సమగ్ర శిక్షా అభియాన్ పథకం అమలును కూడా కో ఆర్డినేటర్లు పర్యవేక్షించవలసి ఉంటుంది.

రాష్ట్రాల వారీగా కో ఆర్డినేటర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలియజేసింది. కో ఆర్డినేటర్లు ఆయా స్కూళ్లను తనిఖీ చేసిన తరువాత కేంద్రానికి నివేదిక పంపవలసి ఉంటుంది. నవంబర్ నుంచి ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తుంది. దాదాపు 10 కోట్ల మంది పిల్లలకు ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని వర్తింప చేస్తున్నా అమలులో బాగోగుల గురించి పర్యవేక్షించే తటస్థ వ్యవస్థ ఏదీ ఇప్పుడు ఆచరణలో లేదు. అందుకని కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు, ఎప్పటికప్పుడు ఈ పథకం స్థాయిని సమీక్షించుకోడానికి మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తునారు.

సోషల్ ఆడిటింగ్

మధ్యాహ్న భోజనం పథకంపై మదింపు చేయడానికి సోషల విధానాన్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కేంద్ర స్థాయి బృందాలు ఏర్పాటవుతాయి. ఈ బృందాల్లో ఆయా రాష్ట్రాల విద్యావేత్తలు కూడా ఉంటారు. ఈ బృందాలు ప్రతి జిల్లాలో కనీసం రెండు స్కూళ్లనయినా తనిఖీ చేయాలి. ఏ స్కూళ్లను ఎంచుకోవాలో బృందాల ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. జనవరి నాటికి ఈ కసరత్తు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇంత కదిలికా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో రాడానికి ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని పాఠశాలలో పిల్లలకు చపాతీ ఉప్పు సరఫరా చేయడం, అది దేశమంతా చర్చనీయాంశం కావడమే కారణం.

అక్కడి స్కూలులోని పరిస్థితి ప్రిన్సిపల్ కల్పించిన కుట్రయే అన్న ప్రచారం జరిగింది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ స్కూలుకు ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్‌పర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ అక్కడికి వెళ్లడానికి ఇష్టం లేని ప్రిన్సిపాల్ జిల్లా విద్యాధికారికి అప్రతిష్ట తేడానికి పన్నిన పన్నాగంగా ఆరోపణలు వచ్చాయి. ఏదేమైనా, ఈ సంఘటన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళించి తగిన విధంగా పర్యవేక్షించడానికి దోహదపడిందని చెప్పవచ్చు.

Midday Meal Scheme in India