Thursday, April 25, 2024

వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

Migrant workers should be added to their Hometowns

 

జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ చరిత్రలో నమోదయిపోయింది. వీరి హృదయ విదారక గాథలు మీడియాలో రావడం మొదలైనప్పుడే పట్టించుకొని వారి విమోచనకు తగిన ఆదేశాలు ఇస్తుందని ఆశించిన సుప్రీంకోర్టు నుంచి అప్పట్లో అటువంటి స్పందన కనిపించకపోడం నిరాశ కలిగించింది. అయితే చివరి దశలోనైనా దేశ అత్యున్నత న్యాయస్థానం వలస కార్మికుల గురించి ఆందోళన చెంది ప్రభుత్వాలకు తగిన ఆదేశాలివ్వడం ఆనందం కలిగిస్తున్నది. కరోనా లాక్‌డౌన్ కారణంగా నగరాల్లో, పట్టణాల్లో ఇతర సుదూర ప్రాంతాల్లో చిక్కుకొని ఇళ్లకు వెళ్లాలని వెళ్లలేకపోతున్న వలస కార్మికులను 15 రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చాలని ఈ పనిని వారి అభీష్టం మేరకు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతేకాదు వారికున్న నైపుణ్యాల ఆధారంగా తగిన పనులు కల్పించి సమగ్ర పునరావాసం ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ తమ పరిధుల్లో చిక్కుకొని ఉన్న వలస కార్మికులను గుర్తించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోరిన 171 శ్రామిక్ ప్రత్యేక రైళ్లకు అదనంగా అవసరమైన వాటిని 24 గంటల్లో సమకూర్చాలని రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాల వద్ద అందుబాటులో గల సంక్షేమ పథకాలన్నింటి వివరాలను బ్లాకు, జిల్లా స్థాయి ల్లో ఏర్పాటు చేసే సలహా కేంద్రాల ద్వారా వలస కార్మికులకు తెలియజేయాలని వాటి నుంచి వారు కోరుకునే రీతి సాయం వారికి అందేలా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే స్వస్థలాలకు చేరుకున్నవారి వివరాలన్నింటినీ సేకరించాలని వారికి గల నైపుణ్యాలను రికార్డు చేయాలని మరో ఉత్తర్వు జారీ చేసింది. ఇంతకు ముందు వారు ఏయే పనులు చేసేవారో తెలుసుకోవాలని విడమరిచింది.

పూర్వపు పని స్థలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్నవారికి ఆ సాయం చేయాలని చెప్పింది. మరో ముఖ్య ఉత్తర్వు ద్వారా లాక్‌డౌన్ కాలంలో ప్రయాణం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా విపత్తుల నిర్వహణ చట్టం 51 సెక్షన్ కింద కేసులకు, ప్రాసిక్యూషన్‌కు గురైన వారందరినీ వాటి నుంచి విముక్తం చేయాలని, ఆ కేసులను రద్దు చేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్ ఎప్పటికీ అంతం కాకపోడంతో చేతిలో చిల్లి గవ్వ లేక తలదాచుకోను నీడ కూడా కరువై ఎలాగైనా స్వస్థలాలకు చేరుకోవాలన్న ఆరాటంతో బస్, రైల్వే స్టేషన్ల వద్ద వలస కార్మికులు వందలు, వేలాదిగా గుమికూడి, తమ మొర వినిపించుకోవాలని ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీ చార్జి చేసి చెదరగొట్టడమే కాకుండా భౌతిక దూరం పాటింపు నిబంధనను ఉల్లంఘించినందుకు కేసులు పెట్టారు. ముంబై, ఢిల్లీలోనే ఇటువంటి వేలాది కేసులు నమోదైనట్లు సమాచారం.

అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని వెనుక సీటు మీద కూర్చోపెట్టుకొని 1200 కి.మీ దూరంలోని సొంత ఊరుకు సైకిల్ తొక్కుకుంటూ తీసుకెళ్లిన బీహార్‌కు చెందిన జ్యోతి కుమారి వంటి వారి గాథలు ఎన్నో వెలుగు చూశాయి. మండుటెండల్లో కాలి నడకన ప్రయాణం చేస్తూ గమ్యాలు చేరుకోలేక నడి దారిలోనే అనేకులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని వివిధ నిర్మాణ, ఉత్పత్తి కార్యకలాపాలకు చెమటను ధారపోసి చెప్పనలవికాని బాధలు అనుభవించారు. వీరందరి ఉదంతాలను ఒక్కటైనా మిగల్చకుండా సేకరించి వారికి తగిన ఉపశమనాన్ని కలిగించాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలైతే దేశంలోని వలస కార్మికుల నిజ స్థితి చాలా వరకు నమోదవుతుంది. వారిలో నిరక్షరాస్యులెందరో, చదువుకున్నవారెంత మందో నిగ్గు తేలుతుంది. వలస కార్మికుల్లో ఎక్కువ మంది అక్షరాలు రాని వారు, శారీరక శ్రమ తప్ప ఇతర నైపుణ్యాలు లేని వారే ఉంటారు.

ఇటుక బట్టీల్లో, అటువంటి ఇతర శ్రమ ప్రధానమైన రంగాల్లో, వ్యవసాయాది క్షేత్రాల్లో, ఒళ్లు హూనం చేసుకొని శ్రమించే వారే ఎక్కువ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నైపుణ్య కల్పన కార్యక్రమాల కింద ఇటువంటి వారందరికీ మెరుగైన వృత్తులు నేర్పించవలసి ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న చోట వారికి న్యాయమైన పని గంటలు, వేతనాలు, భవిష్య నిధి, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వారెదుర్కొన్న దుర్భర స్థితి మరొకసారి తలెత్తకుండా చూడాలి. సుప్రీంకోర్టు ఆలస్యంగానైనా జారీ చేసిన ఈ ఉత్తర్వులు వలస కార్మికులనే కోట్లాది అతీగతీ లేని స్థితిలోని శ్రమ జీవులను కొంచెమైనా మెరుగైన జీవన మలుపులో నిలబెడతాయని ఆశిద్దాం. ఈ ఉత్తర్వుల ద్వారా సుప్రీంకోర్టు దేశంలోని పలు రకాల ఉత్పత్తి రంగాలకు అవసరమైన కార్మిక శక్తిని తిరిగి అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడింది. ఇందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని అభినందించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News