Thursday, April 25, 2024

మయన్మార్ జనఘోష

- Advertisement -
- Advertisement -

 

మయన్మార్‌లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళు పాలించిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ సైనిక పాలన వచ్చిపడింది. కాని మయన్మార్ ప్రజలు సైనిక పాలనకు తలొగ్గేది లేదంటున్నారు. దేశంలో మార్షల్ లా విధించారు, కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినప్పటికీ వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.మయన్మార్‌లో పెద్ద నగరం యాంగాన్ మొదలు చిన్న చిన్న పట్టణాల వరకు నిరసన జ్వాలలు పాకాయి. సైనిక పాలనకు చరమగీతం పాడాలనే నినాదాలు మిన్నంటుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మయన్మార్ ప్రజానేత అంగ్ సన్ సూచీని అరెస్టు చేశారు. ఏడాది పాటు ఎమర్జన్సీ విధించారు. ఈ పరిణామాలు చూసి మొదట ప్రజలు నిర్ఘాంతపోయారు. భయభ్రంతులకు గురయ్యారు. ఇండ్లలో ఆహారపదార్థాలు నిల్వ చేసుకోవడం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం జరిగాయి. ప్రజలు భయంతో ఇండ్లలోనే ఉన్నారు.

కాని ఇది కేవలం ఒక్క రోజు పరిస్థితి మాత్రమే. రెండవ రోజు తమ ఇండ్ల నుంచి బయటకు వచ్చి బాల్కనీల్లో నిలబడి, గుమ్మాల వద్ద నిలబడి పాత్రలు మోగిస్తూ నిరసన తెలిపారు. ఆ తర్వాతి రోజు నుంచి లొంగేది లేదంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. 1988 విద్యార్థి ఉద్యమాల పరిస్థితి మరోసారి కనిపించింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ర్యాలీలు తీయడం మొదలైంది. ఫిబ్రవరి 8 నాటికి దాదాపు 10 పట్టణాలకు నిరసన సెగలు విస్తరించాయి.

మాడ్చే ఎండలకు నిరసనకారులు భయపడడం లేదు, కరోనా భీతి కూడా వారిలో లేదు. ఇంటర్నెట్ షట్ డౌన్లు వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం లేదు. పోలీసుల దౌర్జన్యం కూడా వారిని నిలువరించలేకపోతోంది.వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ఇవేవీ నిరసనకారులను ఆపలేకపోతున్నాయి. పోలీసులు చివరకు కాల్పులు కూడా జరిపారు. ఒక వ్యక్తి మరణించాడు. విభిన్న తెగలకు చెందినవారు, వివిధ వయో సమూహాల వారు, సాధారణ ప్రజలు అందరూ నియంతల పరిపాలనకు చరమగీతం పాడాలనే దృఢ నిశ్చయంతో కనిపిస్తున్నారు. “ఈ దేశంలో యూనిఫాంలో ఉన్నవారిని చూసి వణికిపోతూ నాలాగా నా పిల్లలు కూడా బతకాలని కోరుకోవడం లేదు” అంటున్నారు వివిధ కార్యకర్తలు. మళ్ళీ చీకటి యుగాల సైనిక పాలనకు వెళ్ళాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు.

ఈ నిరసన ప్రదర్శనల్లో చాలా మంది సామాజిక కార్యకర్తలు ముందంజలో ఉన్నారు. ఈ నిరసనల్లో ప్రముఖంగా కనబడడం వల్ల తమ ప్రాణాలకు ప్రమాదమని కూడా వారికి తెలుసు. ప్రాణాలకు ప్రమాదమనే సూచనలు దొరికినవారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక కార్యకర్త థెట్ స్వేవిన్‌ను మేము ఫోను ద్వారా ఇంటర్వ్యూ చేశాము. “నాకెలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనా గానీ, నా పిల్లల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. భవిష్య తరాల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాను. మరో ఇరవై ముప్పయి సంవత్సరాలు సైనిక పాలనలో మగ్గాలని నేను కోరుకోవడం లేదు. మేం పోరాడక తప్పదు” అన్నాడు.

గతంలో 1962 నుంచి 2011 వరకు మిలిటరీ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛలను హరించింది. మాట్లాడే స్వేచ్ఛ లేదు. స్వతంత్ర మీడియా గొంతు నులిమేశారు. కళారూపాలను అణగదొక్కారు. 1988లో విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసనలకు దిగారు. వేలాది విద్యార్థులు అహింసాత్మక నిరసన ప్రారంభించారు. 2007 లో లక్షలాది బౌద్ధ భిక్షులు కాషాయ దుస్తుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రతి సందర్భంలోనూ మిలిటరీ పాలకులు బలప్రయోగంతో, హత్యాకాండతో నిరసనలను అణచేశారు. అసంఖ్యాక అరెస్టులు జరిగాయి. అనేక మంది ప్రాణాలు కాపాడుకోడానికి దేశం వదిలి పారిపోయారు.

“సైనిక పాలనపై తిరగబడకపోతే తర్వాతి తరాలకు కూడా మాలాగే విద్య, వైద్యం, పాలనా వ్యవస్థ లేని దుర్భాగ్య జీవితం గడపవలసి వస్తుందన్నాడు” మరో మానవ హక్కుల కార్యకర్త సు చిట్. దేశం మరోసారి నియంతృత్వంలోకి జారిపోకుండా పోరాడుతున్నామన్నారు.

1988 నిరసనలు, ప్రతిఘటనల్లో ప్రజానేతగా అంగ్ సన్ సూచీ ప్రజాదరణ పొందారు. ఆమెను 15 సంవత్సరాలు మిలిటరీ పాలకులు గృహ నిర్బంధంలో ఉంచారు. కాని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు, ప్రపంచ దేశాల ఒత్తిళ్ళ తర్వాత 2010లో ఆమెను విడుదల చేసి, ప్రజాస్వామిక సంస్కరణలు ప్రారంభించవలసి వచ్చింది. చివరకు 2015లో ఎన్నికలు నిర్వహించారు. 2008లో మయన్మార్ భయంకరమైన తుఫాను నర్గీస్ వల్ల అతలాకుతలమయ్యింది. ఈ పరిస్థితుల్లోనే మిలిటరీ పాలకులు హడావిడిగా దేశ రాజ్యాంగ ప్రతిని సిద్ధం చేసింది. విదేశీయులను పెళ్ళాడిన వారు దేశాధ్యక్షులుగా పోటీ చేయలేరనే నిబంధన పెట్టారు. ఈ నిబంధన అంగ్ సన్ సూచీని అడ్డుకోడానికి పెట్టిన నిబంధన. కాని ఆమె పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ భారీ మెజారిటీ సాధించింది. అనధికారికంగా ఆమె దేశానికి నాయకురాలయ్యారు.

2017లో మిలిటరీ రఖానినే రాష్ట్రంలో రోహింగ్యాలపై హింసాకాండకు, హత్యాకాండకు పాల్పడిన తర్వాత అంగ్ సన్ సూచీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు ఎనిమిది లక్షల మంది రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు ప్రాణాలు కాపాడుకోడానికి పారిపోయారు. అంగ్ సన్ సూచీ ఈ హింసాకాండను, హత్యాకాండను ఖండించ లేదు. మయన్మార్ పై జాతి నిర్మూలన ఆరోపణలు వచ్చినప్పుడు అంగ్ సన్ సూచీ మిలిటరీకి కొమ్ము కాస్తూ, మిలిటరీ చర్యలను సమర్థించింది. 2019లో అంతర్జాతీయ న్యాయస్థానంలో మిలిటరీ పక్షాన ఆమె వాదించింది. అయితే రోహింగ్యాలపై దారుణ మారణకాండల ప్రభావం కానీ, ఈ హత్యాకాండల విషయంలో అంగ్ సన్ సూచీ వైఖరి కాని మయన్మార్ ఎన్నికలపై ప్రభావం వేయలేదు. 2020లో కూడా ఆమె పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కాని, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు మిలిటరీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుని, అధికారం తన చేతుల్లోకి తీసుకుంది.

ఇప్పుడు ప్రతిఘటనల్లో అంగ్ సన్ సూచీని తిరిగి దేశనేతగా ప్రతిష్ఠించడం మాత్రమే కాదు, దేశ రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ధోరణి కనిపిస్తోంది. 2008లో మిలిటరీ ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో మిలిటరీకి అనేక అధికారాలు, హక్కులు ఇచ్చుకున్నారు. రాజ్యాంగ సంస్కరణకు కూడా అవకాశం లేకుండా చేశారు. మయన్మార్‌లో విభిన్న తెగలున్నాయి. ఏడు విభిన్న రాష్ట్రాల్లో ఈ తెగలు నివసిస్తున్నా యి. అంగ్ సన్ సూచీ తండ్రి ఒక గణతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాలని అప్పట్లో చెప్పారు. కాని మయన్మార్ స్వాతంత్య్రానికి ముందే ఆయన హత్యకు గురయ్యారు. అంగ్ సన్ సూచీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ గణతంత్ర వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. వివిధ రాష్ట్రాలకు హక్కుల విషయంలో డిమాండ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మెజారిటీ ప్రజలు ఇతర తెగలను అణిచేసే వ్యవస్థ తమకు వద్దంటున్నారు ఇప్పుడు మయన్మార్ ప్రజలు.

కచిన్ రాష్ట్రంలో కూడా రోహింగ్యాలతో పాటు వివిధ తెగలున్నాయి. మిలిటరీ ఈ తెగలపై కూడా దుర్మార్గమైన దౌర్జన్యాలకు పాల్పడుతూ వస్తోంది. మూడు రాష్ట్రా ల్లో మిలిటరీ పాల్పడిన నేరాలను యుద్ధనేరాలుగా 2018లో ఐక్యరాజ్యసమితి విచారణ జరపాలని చెప్పింది. ఇప్పుడు దాదాపు 300 పట్టణాల్లో ఈ ప్రతిఘటన విస్తరించింది. పౌర సహాయ నిరాకరణ, శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం వికసిస్తుందా? శాంతియుత వాతావరణం ఏర్పడుతుందా? 1988 నిరసనల్లోను, పోరాటాల్లోను పాల్గొన్న అప్పటి తరం మరోసారి ఈ పోరాటాల్లో నడుం బిగించింది. యువతరం సైనిక పాలన మాకొద్దంటూ నినదిస్తున్నారు. మయన్మార్ పరిస్థితులను ప్రపంచం గమనిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News