Thursday, March 28, 2024

గ్వినియాలో సైనిక తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

Military coup took place in Guinea

అధ్యక్షుడు ఆల్ఫాకోండేను నిర్బంధించిన ఆర్మీ

కోనాక్రీ: పశ్చిమ ఆఫ్రికా దేశం గ్వినియాలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఆల్ఫా కోండేను సైన్యం నిర్బంధించింది. ఆర్మీ కమాండర్ కల్నల్ మమాడీ దౌంబోయా నేతృత్వంలో ఆదివారం ఈ తిరుగుబాటు జరిగింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మమాడీ ప్రకటించారు. దేశ రక్షణ కోసం ఓ సైనికుడిగా తన విధి తాను నిర్వహించానంటూ తిరుగుబాటు అనంతరం ప్రభుత్వ టివి ద్వారా మమాడీ ప్రకటన చేశారు. కొన్ని గంటలవరకు కోండే ఎక్కడ ఉన్నారన్నది తెలియలేదు. ఓ వ్యక్తికి ఈ దేశ రాజకీయాల్ని సుదీర్ఘకాలం అప్పగించేందుకు తాము సిద్ధంగా లేమంటూ పరోక్షంగా కోండేపై మమాడీ విమర్శలు చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన టివి ఛానల్‌తో మాట్లాడుతూ కోండే సురక్షితంగా తమ కస్టడీలో ఉన్నట్టు మమాడీ తెలిపారు. ఆయనకు ఓ వైద్యుడిని కూడా కేటాయించామన్నారు.

అమెరికా దౌత్యాధికారి కూడా కోండేను కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. 1958లో ఫ్రాన్స్ నుంచి విముక్తి పొందిన తర్వాత దేశ ఆర్థిక పురోగతి మందగించిందని మమాడీ ఆరోపించారు. 2010 నుంచి కోండే ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ద్వారా అధికారం చేపట్టిన కోండే హయాంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతికి చరమగీతం పాడుతారని మెజార్టీ ప్రజలు భావించారు. అయితే, ఆయన పాలనలోనూ గ్వినియా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కోండేపై 2011లోనే ఓ హత్యా యత్నం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News