Home తాజా వార్తలు మిలియన్ మార్చ్ ఉద్రిక్తం

మిలియన్ మార్చ్ ఉద్రిక్తం

Million march

 

ఆందోళనకారులపై లాఠీ, టియర్ గ్యాస్
నిరసనలో మావోయిస్టు అనుబంధ సంఘాలు
వేర్వేరు ప్రాంతాల్లో 300మంది అరెస్టు
రాళ్లు రువ్విన ఘటనల్లో అడిషనల్ డిసిపి, ఎసిపి, సిఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు గాయాలు

హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు శనివారం చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్ బ ండ్ వద్దకు చేరుకునేందుకు యత్ని ంచిన ఆర్‌టిసి కార్మికులు, కుటుంబ సభ్యులు, ఒయు విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించడంతోఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తుంటే తమపై లాఠీఛార్జి చేస్తారా?అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు తాళ్లతో నెడుతూ ఆందోళనకారులను లిబర్టీ వైపు పంపేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దించింది.

దీంతో వారు భాష్పవాయు వాహనాలతో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. పోలీసులకు, కార్మికులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఆర్‌టిసి కార్మికుడు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.తెలంగాణ ఆర్‌టిసి ఐకాస, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

ఆర్‌టిసి ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్నారు. హిమయత్ నగర్ లోని లిబర్టీ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈక్రమంలో ట్యాంక్ బండ్ లోని బుద్ధ భవన్ వద్ద ఆర్‌టిసి కార్మికులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా 50 మంది కార్మికులు ట్యాంక్ బండ్ పైకి దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆందోళనలో మావోయిస్టు అనుబంధ సంఘాలు
పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగం ః సిపి
ఆర్‌టిసి కార్మికుల ఆందోళనలో భాగంగా మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని సిపి అంజనీకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు అనుబంధ సంఘాలతో కలిసి ఆర్‌టిసి కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. ఆందోళన కారుల దాడిలో అడిషనల్ డిసిపి రామచంద్రరావు, ఎసిపి రత్నం, సిఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ శేఖర్, కానిస్టేబుల్ రాజు గాయపడ్డారని వివరించారు. పోలీసులపై దాడి చేసినవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్లే టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు తెలిపారు. ఆర్‌టిసి కార్మికులకు మావోయిస్టు అనుబంధ సంఘాలతో సంబంధం ఉన్నందునే.. ‘చలో ట్యాంక్‌బండ్’కు అనుమతి ఇవ్వలేదని అంజనీకుమార్ వివరించారు.

ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పెద్దసంఖ్యలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశామని తెలిపారు. వేర్వేరు ప్రాంతాలలో 300 మంది ఆందోళన కారులను అరెస్ట్ చేశామని సిపి అంజనీకుమార్ తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. కొందరు ఐకాస నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీకుల చెందిన కొందరు నేతలను ముందస్తుగా శుక్రవారమే అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ట్యాంక్ బండ్ పై వాతావరణం ప్రశాంతంగా ఉందని అంజనీకుమార్ వెల్లడించారు.

ఇందిరాపార్క్ వద్ద కదం తొక్కిన మహిళా కార్మికులు
చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్‌టిసి మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు దూకి ట్యాంక్ బండ్ మీదకు మహిళా కార్మికులు దూసుకెళ్లారు.

ఆర్‌టిసి కార్మికులు, విద్యార్థి సంఘాల నేతలు వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తుండగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ లోని ఎంబి భవన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క, నేతలు బారికేడ్లు తోసుకుంటూ ముందుకు సాగడంతో అశోక్ నగర్ లోని ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అశ్వత్థామరెడ్డి అరెస్టు
చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్‌టిసి జెఎసి కన్వీనర్‌అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

గృహ నిర్భంధాలు..ముందస్తు అరెస్ట్‌లు
ఆర్‌టిసి కార్మికుల చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, సిపిఐ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిఎల్‌సి నేత మల్లు భట్టివిక్రమార్కను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అలాగే టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, శానసనమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్‌లో గృహనిర్భంధం చేశారు. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మా ఇంటి తలుపులు కొట్టి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటి ముందు పోలీసులను కూర్చోబెట్టడం దారుణమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డిని గాంధీనగర్ పోలీస్టేషన్‌కు తరలించారు.

బన్సిలాల్‌పేటలో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావును అరెస్ట్ చేశారు. ముందస్తుగా బిజెపి నేత లక్ష్మణ్ హౌస్ అరెస్ట్ చేశారు. టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాంను ఇందిరాపార్క్ కూడలిలో అరెస్ట్ చేశారు. నాగేందర్ అనే ఆర్‌టిసి డ్రైవర్ కు కుడికాలు చిప్ప విరిగిపోయింది. పోలీసులు ఆయన్ని వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఓ మహిళ చిటికెన వేలికి గాయం కాగా ముక్కు పగలడంతో మరో మహిళ విలవిల్లాడింది. సకల జనుల సామూహిక దీక్షకు వచ్చిన తెజస అధ్యక్షుడు కోదండరాం, భాజపా నేత వివేక, అంబర్‌పేట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకొని నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామాంతపూర్‌లో మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎన్‌విఎస్ ఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ, భాజాపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్‌ను బంజరాహిల్స్‌లోని ఎంపి నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు.

అరెస్ట్‌లతో ఉద్యమాలు అణిచివేయలేరు : ఎంపి బండి సంజయ్
చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బిజెపి ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎంపి బండి సంజయ్ మాట్లాడుతూ అరెస్ట్ల ద్వారా ఉద్యమాలను అణచలేరన్నారు. మిలియన్ మార్చ్‌తో ఆందోళన కారులలో నూతన ఉత్సాహం వచ్చిందని, కార్మికులపై ఉక్కుపాదం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పలుచోట్ల పోలీసులతో కార్మికులు, జెఎసి నేతలు వాగ్వివాదానికి దిగారు.

డిమాండ్ల సాధన కోసమే సమ్మెకు దిగాం : ఆందోళన కారులు
న్యాయమైన డిమాండ్లు సాధన కోసమే సమ్మెకు దిగామని ఆర్‌టిసి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తమకు జీతాలు లేవని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తే… బిడ్డలను ఇలాగేనా చూసేది అంటూ వాపోయారు. కనీసం పిల్లలకు స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, తాము ఎలా బతకాలంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆర్‌టిసి సమ్మెలో భాగంగా కార్మికులు శనివారం చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి బిజెపి, కాంగ్రెస్, అఖిలపక్షం మద్దతు తెలిపారు. 36రోజులుగా సాగుతున్న సమ్మెను మరింత ఉద్ధృతం చేసేలా మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందోళన చేపట్టారు. టిజెఎస్, ఎంఆర్‌పిఎస్, కాంగ్రెస్, బిజెపి, టిటిడిపి, సిపిఐ, సిపిఎం, సిపిఎం(ఎంఎల్) న్యూడెమోక్రసీ, జనసేనతో పాటు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు కార్యక్రమానికి మద్దతు ప్రకటించడంతో పాటు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాయి.

వాహనచోదకులు, పాదచారులకు ఇబ్బందులు
ఆర్‌టిసి కార్మికుల ఆందోళన దృష్టా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకోవడంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో శనివారం ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌పై వాహనాలను పోలీసులు నిషేధించారు. సికింద్రాబాద్, లిబర్టీ, కవాడిగూడ, సెక్రటేరియట్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపుగా వచ్చే వాహనాలను వెనక్కి పంపారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడింది.

దోమల్‌గూడా నుంచి లిబర్టీవైపు, ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్‌బండ్ వెళ్లేదారి మొత్తం వాహనాలు నిలిచిపోయాయి. ఇక బషీర్‌బాగ్ నుంచి ట్యాంక్‌బండ్, హిమాయత్ నగర్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించలేదు. వెరసి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే దారులన్నీ పోలీసులు మూసివేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పలు ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో అటు వాహనచోదకులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Million march tension