Thursday, April 18, 2024

కోల్డ్ వైరస్‌తో ఏడాది లోనే లక్షమంది చిన్నారుల బలి

- Advertisement -
- Advertisement -

Millions of children die each year from the cold virus

లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి

లండన్ : జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఏడాది లోనే లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారుల్లోనే ఈ మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నాయని తెలియజేసింది. ఈ అధ్యయన నివేదిక ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. చిన్నారుల్లో రెస్పిరేటరీ సైన్‌సైటియల్ వైరస్ ( ఆర్‌ఎస్‌వి) ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్ పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్క 2019 లోనే ఆరు నెలల లోపు వయసున్న 45 వేల మంది చిన్నారులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌వీ వైరస్ బారిన పడుతోన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నట్టు తెలిపారు. చిన్నారులు పుట్టిన 28 రోజుల నుంచి ఆరు నెలల మధ్య కాలం లోనే ఆర్‌ఎస్‌వీ మరణాల ముప్పు అధికంగా ఉందన్న నిపుణులు వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ఈ ముప్పు తక్కువగానే ఉందన్నారు. పేద దేశాల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 2019 లోనే 3.3 కోట్ల ఆర్‌ఎస్‌వీ కేసులు నమోదు కాగా, వీరిలో 36 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు.

అందులో 26,300 మంది ఆస్పత్రుల్లోనే మరణించగా, ఆ ఏడాది మొత్తంగా 1,01,400 ఆర్‌ఎస్‌వి సంబంధిత మరణాలు సంభవించినట్టు పరిశోధకులు అంచనా వేశారు. ఆ వయసు పిల్లల్లో వివిధ రకాల కారణాలతో ప్రాణాలు కోల్పోయే ప్రతి 50 మందిలో ఒకరు ఆర్‌ఎస్‌వీ వల్లే చనిపోతున్నారు. 2019 లో ఆరు నెలల లోపు వయసున్న చిన్నారుల్లో ఆర్‌ఎస్‌వీ కేసులు ప్రపంచ వ్యాప్తంగా 66 లక్షల వరకు వెలుగు చూడగా, వీరిలో 14 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. అలా చేరుతున్న వారిలో కేవలం 20 శాతం మంది లోనే మరణాలు సంభవిస్తున్నాయి. కమ్యూనిటీ స్థాయి లోనే 80 శాతం మరణాలు జరుగుతున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంది. చిన్నారుల్లో తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు ఆర్‌ఎస్‌వీ ప్రధాన కారణంగా ఉంటోందని ఈ అధ్యయన సహ రచయిత, బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన నిపుణులు హరీశ్ నాయర్ పేర్కొన్నారు. అయితే కొవిడ్ ఆంక్షలు సడలిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధికి అనేక కంపెనీలు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News