Home తాజా వార్తలు లంచం తీసుకుంటు ఏసిబికి చిక్కిన మైనింగ్ ఏడి

లంచం తీసుకుంటు ఏసిబికి చిక్కిన మైనింగ్ ఏడి

Mining AD

 

క్రషర్ అనుమతి కోసం లక్ష రూపాయలు డిమాండ్

ఎన్‌ఓసి కోసం తహసీల్దార్‌కు 15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్
ఏసిబిని ఆశ్రయించిన బాధితుడు
15 వేలు లంచం తీసుకుంటు ఏసిబికి చిక్కిన మైనింగ్ ఏడి శ్రీనివాసులు

నాగర్‌కర్నూల్ : క్రషర్ అనుమతి కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసి 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా మైనింగ్ శాఖ ఏడి శ్రీనివాసులు ఏసిబి అధికారులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏసిబి డిఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం శంకర్ బండ తాండాకు చెందిన నారాయణ అనే వ్యక్తి అదే మండలంలోని చెరుకూరు గ్రామంలో 64 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకొని సర్వే నెంబర్ 303 లో అతనికి 18 ఎకరాల భూమి ఉంది. అట్టి భూమిలో సదరు వ్యక్తి నారాయణ క్రషర్ కోసం మీసేవలో నవంబర్ 10వ తేదిన దరఖాస్తు చేసుకున్నారు.

నవంబర్ 13వ తేదిన ఫారం బీ ని నాగర్‌కర్నూల్ మైనింగ్ ఏడి శ్రీనివాసులుకు అందించారు. ఆ తరువాత వారం రోజులుగా ఎన్ని సార్లు తిరిగిన పట్టించుకోలేదన్నారు. నవంబర్ 20వ తేదిన ఏడి శ్రీనివాసులు అనుమతి కోసం తహసీల్దార్ ద్వారా ఎన్‌ఓసి తీసుకోవాల్సి ఉంటుందని అందుకు 20 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాక పూర్తిస్థాయి అనుమతుల కోసం మరో లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఎన్‌ఓసి కోసం 15 వేలు లంచంగా ఇవ్వడానికి నారాయణ మైనింగ్ ఏడి శ్రీనివాసులుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అనంతరం ఏసిబి ని నారాయణ ఆశ్రయించడంతో మంగళవారం 15 వేల రూపాయలు నారాయణ నుంచి తీసుకుంటుండగా జిల్లా కేంద్రంలోని మైనింగ్ ఏడి కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మైనింగ్ ఏడి శ్రీనివాసులును విచారించారు. అనంతరం హైదారబాద్‌లోని ఏసిబి కోర్టులో హాజరు పర్చడంజరుగుతుందని ఏసిబి డిఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఎవరైన అధికారులు లంచాలు అడిగితే 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని ఆయన కోరారు.

Mining AD caught by ACB